చెలరేగిన పార్థివ్.. చరిత్ర సృష్టించిన గుజరాత్
చెలరేగిన పార్థివ్.. చరిత్ర సృష్టించిన గుజరాత్
Published Sat, Jan 14 2017 4:10 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
ఏడు దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తమ రాష్ట్ర జట్టు చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని అందించాడు. అవును.. పాలబుగ్గల పసివాడిగా టీమిండియాలోకి ప్రవేశించిన పార్థివ్ పటేల్ జాతీయ జట్టుకు దూరమైనా, దేశవాళీ మ్యాచ్‌లలో మాత్రం ఇరగదీస్తున్నాడు. రంజీట్రోఫీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గుజరాత్ జట్టుకు అందని పండుగానే మిగిలిపోయిన విజయాన్ని అందించిపెట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేసి ఒక రకంగా ఒంటిచేత్తో ట్రోఫీని ఇచ్చాడు. దాంతోపాటు 42వ సారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలనుకున్న ముంబై ఆశల మీద నీళ్లు చల్లాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై జట్టు మీద 5 వికెట్ల తేడాతో గుజరాత్ నెగ్గి రంజీట్రోఫీని కైవసం చేసుకుంది.
విజయానికి 312 పరుగులు కావల్సిన దశలో వికెట్ నష్టపోకుండా 47 పరుగుల స్కోరుతో ఆట ప్రారంభించిన గుజరాత్ జట్టులో అప్పటికి ప్రియాంక్ పాంచాల్ 34 పరుగులతోను, సమిత్ గోహిల్ 5 పరుగులతోను క్రీజ్‌లో ఉన్నారు. అయితే గోహిల్‌ను 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ నాయర్ ఔట్ చేయడంతో ఇక కష్టమనుకున్నారు. కానీ అప్పుడు మన్‌ప్రీత్ జునేజాకు జోడీగా కెప్టెన్ పార్థివ్ పటేల్ బరిలోకి దిగాడు. వీళ్లిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు మ్యాచ్‌నే గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన పార్థివ్‌కు జునేజా మంచి అండగా నిలిచాడు. వీరి భాగస్వామ్యాన్ని అఖిల్ హెర్వాద్కర్ విడగొట్టాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జునేజా ఔటయ్యాడు. అయితే, సులభమైన క్యాచ్‌లను కూడా ముంబై ఫీల్డర్లు వదిలేయడంతో గుజరాత్ పని కొంతవరకు సులువైందని చెప్పుకోవచ్చు. చివర్లో వచ్చిన చిరాగ్ గాంధీ కూడా తనవంతు సాయం చేయడంతో గుజరాత్ రంజీట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది.
నిజానికి రంజీట్రోఫీ కోసం ఏడు దశాబ్దాల నుంచి గుజరాత్ ఎదురుచూస్తోంది. అసలు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టు ఆ తర్వాత కనీసం రన్నరప్‌గా కూడా నిలవలేదు. 65 ఏళ్ల తర్వాత రాకరాక వచ్చిన అవకాశాన్ని పార్థివ్ బృందం సరిగ్గా ఉపయోగించుకుంది. రంజీ టైటిల్‌ను మంచినీళ్ల ప్రాయంలా తమ ఖాతాలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును మట్టికరిపించింది. గత తొమ్మిది సార్లుగా గెలుస్తూ వచ్చిన ఆ జట్టును బోల్తా కొట్టించింది.
స్కోర్లు:
ముంబై 228, 411, గుజరాత్ 328, 313/5
Advertisement
Advertisement