14 ఏళ్ల కెరీర్లో తొలి సిక్సర్
మొహాలి: పార్థీవ్ పటేల్..దాదాపు ఎనిమిదేళ్ల తరువాత టెస్టుల్లో పునరాగమనం చేసిన భారత వికెట్ కీపర్. భారత్ తరపున సుదీర్ఘ కాలం తరువాత జట్టులో స్థానం సంపాదించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇంగ్లండ్ తో మూడో టెస్టులో జట్టులోకి వచ్చి బ్యాట్ తో అలరించాడు.
ఈ క్రమంలోనే పార్థీవ్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల తరువాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2004 అక్టోబర్లో చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పార్థీవ్(54) చివరిసారి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తరువాత ఇంతకాలనికీ ఇంగ్లండ్ పై హాఫ్ సెంచరీ సాధించి తనలోని ప్రతిభ తగ్గలేదని నిరూపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసిన పార్థీవ్, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కాగా, పార్థీవ్ సిక్స్ సాధించడం ఇక్కడ విశేషం. దాదాపు అతని 14 ఏళ్ల టెస్టు కెరీర్లో తొలి సిక్సర్ కొట్టాడు. అదిల్ రషిద్ వేసిన 13ఓవర్ మూడో బంతికి పార్థీవ్ సిక్స్ సాధించాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో 110 ఫోర్లు కొట్టిన పార్థీవ్.. సిక్స్ కొట్టడానికి సుదీర్ఘ కాలం నిరీక్షించకతప్పలేదు. 2002లో పార్థీవ్ టెస్టు కెరీర్ను ఆరంభించిన సంగతి తెలిసిందే.