
సహచరుడి బాటలోనే...
టి20లకు జయవర్ధనే గుడ్‌బై వరల్డ్‌కప్‌తో కెరీర్ ముగింపు
అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పిన సీనియర్ ఆటగాడు కుమార సంగక్కర బాటలోనే మరో వెటరన్ మహేల జయవర్ధనే కూడా నడిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు మహేల సోమవారం ప్రకటించాడు.
సంగక్కర రిటైర్మెంట్ ప్రకటన తర్వాతి రోజే జయవర్ధనే ఇది చెప్పడం విశేషం. ‘రిటైర్ అయ్యేందుకు సంగక్కర చెప్పిన కారణమే నాకూ వర్తిస్తుంది. మా వయసును బట్టి చూస్తే వచ్చే టి20 వరల్డ్ కప్ ఆడలేం. అప్పటి వరకు జట్టును అట్టి పెట్టుకొని ఉండటం అనవసరం. యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు’ అని జయవర్ధనే అన్నాడు.
టి20ల్లోనూ మెరుపులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ టెస్టు, వన్డే ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జయవర్ధనే టి20 క్రికెట్‌లోనూ మెరిశాడు. ఫార్మాట్‌కు అనుగుణంగా అతను తన శైలిని మార్చుకోవడం విశేషం. 49 టి20 మ్యాచ్‌ల్లో అతను 31.78 సగటుతో 1335 పరుగులు చేసి శ్రీలంక టాపర్‌గా నిలిచాడు. జయవర్ధనే స్ట్రయిక్ రేట్ 134.17 కావడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన తొమ్మిది మంది ఆటగాళ్లలో అతను కూడా ఒకడు. కెప్టెన్‌గా ఆడిన 19 మ్యాచుల్లో 12 మ్యాచుల్లో లంక గెలిచింది.
ఉత్తమ జోడి
శ్రీలంక జట్టు టి20 విజయాల్లో సంగక్కర, జయవర్ధనే కీలక పాత్ర పోషించారు. టి20ల్లో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం (166) సంగక్కర-జయవర్ధనే జోడి పేరిటే ఉంది. ఓవరాల్‌గా ఎక్కువ పరుగులు జోడించిన జాబితాలో ఈ జంట మూడో స్థానంలో (20 ఇన్నింగ్స్‌లలో 792) ఉంది. సంగక్కర సారథ్యంలో శ్రీలంక 2009 ప్రపంచ కప్ ఫైనల్లో... జయవర్ధనే కెప్టెన్సీలో 2012 ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం పాలైంది.
వన్డే వరల్డ్ కప్ తర్వాత సంగక్కర నిష్ర్కమణ!
మరోవైపు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కుమార సంగక్కర... ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. ఆ సమయానికి తాను 37 ఏళ్లకు చేరుకుంటాను కాబట్టి కొనసాగలేనని, ఇది సహజ పరిణామమని అతను స్పష్టం చేశాడు.