
హంబన్‌టోటా: శ్రీలంకతో జరుగుతున్న అండర్-19 రెండో యూత్ టెస్టులో భారత ఆటగాడు పవన్ షా కదం తొక్కిన సంగతి తెలిసిందే. పవన్ షా 332 బంతుల్లో 33 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 282 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ యూత్ టెస్టు మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంచితే, ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు.
ఈకేవీ పెరీరా వేసిన 108 ఓవర్‌లో వరుస ఆరు బంతుల్ని ఫోర్లగా మలచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా ఒక ఓవర్‌లో ఆరు బంతుల్ని ఆరు ఫోర్లుగా కొట్టిన రెండో భారత ఆటగాడిగా షా అరుదైన రికార్డును లిఖించాడు. చివరిసారి 1982లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ పాటిల్ ఒక ఓవర్‌లో ఆరు ఫోర్లుగా కొట్టగా, 36 ఏళ్ల తర్వాత ఆ ఘనతను పవన్ షా అందుకున్నాడు. కాగా, ఆనాటి టెస్టు మ్యాచ్‌లో నో బాల్ సాయంతో ఏడు బంతుల్ని ఎదుర్కొని సందీప్ పాటిల్ ఆ ఘనత సాధించగా, పవన్ షా వరుస బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టడం విశేషం.
చదవండి: పవన్ షా డబుల్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment