
మెస్సీకి పీలే విన్నపం
రియో డి జనీరో: అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన వీడ్కోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు పీలే విన్నవించాడు. ఇటీవల జరిగిన కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్ ను గోల్ గా మలచడంలో విఫలమైన మెస్సీ.. అర్జెంటీనా జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో ఇక తన అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే తన వీడ్కోలు నిర్ణయాన్ని మార్చుకోవాలని పలువురు అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాళ్లు ఇప్పటికే మెస్సీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు పీలే కూడా మెస్సీ నిర్ణయం సరైనది కాదని అంటున్నాడు.
'గత 10ఏళ్లలో మెస్సీనే అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక మ్యాచ్ లో ఓటమితో అతనికి ఏమైంది. గెలుపు-ఓటములు అనేవి సహజం. కేవలం ఒక పెనాల్టీ షూటౌట్ ను మిస్సయ్యాడు. అంతమాత్రన అంతర్జాతీయ కెరీర్ను ముగించడం సబబు కాదు. మెస్సీ చాలా నిరాశలో ఉన్నాడు. కొంత సమయం తీసుకుంటే దాన్ని మరిచిపోవచ్చు. చాలా మంది అత్యుత్తమ ఆటగాళ్లు ఇదే తరహాలో విఫలమైన దాఖలాలు చాలా ఉన్నాయి. అదంతా ఆటలో భాగం. ఏదొక తప్పిదం జరిగితే మొత్తం ఫుట్ బాల్ కెరీర్ నుంచి వైదొలుగుతానని అనడం సరైన నిర్ణయం కాదు. ఆ నిర్ణయాన్ని మార్చుకో' అని పీలే విజ్ఞప్తి చేశాడు.