ఆటలను కెరీర్‌గా ఎంచుకోండి!
ప్రధాని మోదీ పిలుపు
అహ్మదాబాద్: క్రీడాకారుల పట్ల మన ప్రజల ఆలోచనా విధానం మారాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వారు కూడా సైనికుల తరహాలోనే దేశం కోసం పోరాడతారని ఆయన గుర్తు చేశారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వాతావరణం దేశంలో ఎక్కువగా లేదని, దానిని తాను మార్చాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
శుక్రవారం ఇక్కడ ‘ది ఎరీనా’ పేరుతో రూపొందించిన భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ వేదికలో అత్యుత్తమ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఆటగాళ్లతో సంభాషించే సమయంలో మనలో కొంత మంది మీరు బతకడానికి ఏం చేస్తుంటారు అని అడుగుతుంటారు. ఇది సరిహద్దుల్లో ఉండే సైనికులను మీరేం చేస్తుంటారని ప్రశ్నించడంలాంటిదే. ఈ ధోరణి మారాలి. ఆటగాళ్లు తమ విజయాలతో దేశం గర్వపడేలా చేస్తారు.
క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవాలని నేను కోరుతున్నా. ఒకవేళ అది సాధ్యం కాకపోయినా ప్రతీ ఒక్కరు ఏదో ఒక ఆటను ఆడే సంస్కృతిని అలవర్చుకోవాలి. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఎలా ఉండాలో క్రీడలు నేర్పిస్తాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), గగన్ నారంగ్ (షూటింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్), బైచుంగ్ భూటియా (ఫుట్‌బాల్), అనూప్ కుమార్ (కబడ్డీ), క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, పుజారా, పార్థివ్, ఉనాద్కట్, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.