బుకీలు కలిస్తే ఆ పని చేసేవాడ్ని: సెహ్వాగ్
ముంబయి: క్రికెట్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఆటగాళ్లు ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బుధవారం కాన్పూర్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ డాషింగ్ ఓపెనర్ ఈ విధంగా స్పదించారు. 'బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఇలాంటి వ్యవహారాలను ఎవరూ ఆపలేరు. తాను ఎవరిని కలుసుకుంటున్నాం అనేది ప్రతి ఆటగాడికి తెలిసుండాలి.
తన మనస్సాక్షి స్పష్టంగా ఉన్నప్పుడే ఆటను కూడా క్లీన్‌గా ఉంచగలరు. ఎంత భద్రత ఉన్నా ఓ ఆటగాడు ఫిక్సింగ్‌కు పాల్పడాలనుకుంటే ఎవరూ ఆపలేరు. తనను ఎవరూ తప్పుపట్టకూడదనే విచక్షణ ఎవరికి వారు కలిగి ఉంటేనే ఈ మార్పు సాధ్యం. ఒకవేళ నేను క్రికెట్ ఆడే రోజుల్లో ఎవరైనా నాపై బెట్టింగ్ ఆరోపణలు లేవనెత్తినట్లయితే మరో ఆలోచన లేకుండా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. దాంతో పాటు నేను సాధించిన రికార్డులను తొలగించేయాలని విజ్ఞప్తి చేసేవాడిని. ముఖ్యంగా ఫిక్సింగ్ మహమ్మారి పారిపోవాలంటే ఆటగాళ్లు వంద శాతం నిజాయితీగా ఉండటమే దానికి విరుగుడు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది.