'రొనాల్డో క్షమాపణ చెప్పాలి'
లిస్బాన్: తమ జర్నలిస్టు దగ్గర మైక్రోఫోన్ లాక్కొని పక్కనే ఉన్న చెరువులోకి విసిరేసిన ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ పోర్చుగీసు టీవీ నెట్వర్క్ కారియో ద మన్హా డిమాండ్ చేసింది. తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో రొనాల్డ్ వ్యవహరించిన తీరు యావత్ పోర్చుగీసు జాతికే అవమానకరమని టీవీ నెట్ వర్క్ డైరెక్టర్ కార్లోస్ రాడ్రిగ్యూస్ విమర్శించారు. ఈ ఘటనపై పోర్చుగీసు ఫుట్ బాల్ ఫెడరేషన్తో పాటు, రొనాల్డో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-ఎఫ్లో భాగంగా బుధవారం జరిగే తదుపరి పోరుకు పోర్చుగీసు ఏ విధంగా సన్నద్ధమవుతుందంటూ తమ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రొనాల్డ్ నైతిక విలువల్ని మరచిపోయి వ్యవహరించడం ఎంతమాత్రం తగదన్నారు. ఆ జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా, మైక్రోఫోన్ లాక్కొని చెరువులో పడేయటం అతని అహంకారానికి నిదర్శమని రాడ్రిగ్యూస్ తెలిపారు. దీనిపై రొనాల్డో తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.