బీసీసీఐ ఎస్‌జీఎం వాయిదా
తగినంత నోటీసు సమయం ఇవ్వకపోవడంపై రాష్ట్ర సంఘాల అభ్యంతరం
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేసే అంశాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింతగా సాగదీస్తోంది. ఇప్పటికే పలు మార్లు బోర్డు సమావేశాల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోగా, అమలు సాధ్యాసాధ్యాల కోసమంటూ ఇటీవలే ఏడుగురు సభ్యులతో మరో కమిటీ కూడా వేసింది. తాజాగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో లోధా సిఫారసులకు ఆమోద ముద్ర వేసేందుకు బోర్డు అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆరు రాష్ట్ర సంఘాల అభ్యంతరంతో ఇది అర్ధాంతరంగా వాయిదా పడింది.
సమావేశంలో పాల్గొనేందుకు తమకు నిబంధనల ప్రకారం తగినంత నోటీసు సమయం ఇవ్వలేదని ఈ సంఘాలు ఆరోపించాయి. తమిళనాడు. సౌరాష్ట్ర, హరియాణా, కేరళ, గోవా, కర్ణాటక ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంఘాలన్నీ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు బలమైన మద్దతుదారులే కావడం విశేషం. లోధా సిఫారసుల ప్రకారం అనర్హతకు గురవుతున్న నిరంజన్ షా (సౌరాష్ట్ర), అనిరుధ్ చౌదరి (హరియాణా)... శ్రీనివాసన్ వర్గానికి చెందినవారు. ఈసారి కనీసం 15 రోజుల ముందుగా నోటీసు పంపాలని బోర్డు భావిస్తోంది. దాని ప్రకారం జూలై 25 నుంచి 27 మధ్యలో ఎప్పుడైనా మళ్లీ సమావేశం జరగవచ్చు. మరోవైపు ఈ నెల 14నే లోధా సిఫారసుల అంశంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.