ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మంటన్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత షట్లర్ సాయి ప్రణీత్ 20-22, 22-20, 16-21 తేడాతో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో గెలిచి రేసులోకి వచ్చాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆండెర్స్ ర్యాలీలు, స్మాష్‌లతో ప్రణీత్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రణీత్ తాను చేసి తప్పిదాల నుంచి తేరుకునే లోపే ఆండెర్స్ గేమ్‌తో మ్యాచ్‌ను కూడా గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు.
తొలి గేమ్‌లో పోరాట స్పూర్తిని ప్రదర్శించిన ప్రణీత్.. రెండో గేమ్‌లో జోరును కొనసాగించాడు. ఆండెర్స్‌కు అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను గెలిచాడు. కాగా, మూడో గేమ్‌లో ఆండెర్స్ తిరిగి పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించాడు. చివర్లో ప్రణీత్ పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రణీత్ ఓటమితో భారత్ సింగిల్స్‌లో పోరాటాన్ని ముగించింది. నిన్న మహిళల సింగిల్స్ పోరాటం ముగిస్తే, ఈరోజు పురుషుల సింగిల్స్ పోరాటం సైతం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment