సరిగ్గా నాలుగేళ్ల క్రితం... 14 సంవత్సరాల పృథ్వీ షా అత్యద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ముంబైలో హారిస్ షీల్డ్ టోర్నీలో భాగంగా రిజ్వీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ ఏకంగా 546 పరుగులు బాది మైనర్ క్రికెట్‌లో అత్యధికపరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 85 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే చిన్నతనంలో సంచలనాలు నమోదు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయిన అనేక మంది ఆటగాళ్ల జాబితాలో మాత్రం అతను చేరలేదు. అప్పటి నుంచి మొదలు పెట్టి నేటి వరకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరుగుల వరద పారించాడు. స్కూల్ క్రికెట్‌లో మాత్రమే కాదు సీనియర్ క్రికెట్‌లోనూ తన బ్యాటింగ్ పదునేమిటో అతను చూపించాడు. ఆడిన ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే నాలుగు సెంచరీలు బాది భవిష్యత్ తారగా, మరో సచిన్‌గా పృథ్వీ షా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నెల 8తో 18 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న పృథ్వీ నిజంగానే ఆ స్థాయికి చేరుకోవాలని అంతా కోరుకుంటున్నారు.
సాక్షి క్రీడా విభాగం: వరుసగా భారీ స్కోర్లు సాధించడం పృథ్వీ షాకు కొత్త కాదు. తనకు గుర్తింపు తెచ్చిన 546 ఇన్నింగ్స్‌కు రెండేళ్ల ముందునుంచే షా గురించి ముంబై క్రికెట్ వర్గాల్లో మంచి అభిప్రాయం ఉంది. స్కూల్ క్రికెట్‌లో వరుసగా జరిగిన ఆరు టోర్నీలలో 13 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 2000కు పైగా పరుగులు నమోదు చేయడమే దానికి కారణం. ఇందులో గైల్స్ షీల్డ్ టోర్నీలో చేసిన ఐదు వరుస శతకాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో స్వయంగా సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యేకంగా పృథ్వీ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరై అభినందనలతో ముంచెత్తాడు. ‘ఆ సమయంలో నా ఎత్తుకు తగినట్లుగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఎస్‌జీ ప్రొఫెషనల్ బ్యాట్‌ను సచిన్ నాకు బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని పృథ్వీ గుర్తు చేసుకుంటాడు. ప్రఖ్యాత ‘కంగా’ లీగ్ ‘ఎ’ డివిజన్ పోటీల్లో కూడా అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన షా, ఆపై వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత తన సీనియర్లు సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్ సభ్యులుగా ఉన్న ముంబై అండర్–16కు షా కెప్టెన్‌గా ఎంపిక కావడం, మరింత వేగంగా దూసుకుపోవడం చకచకా జరిగిపోయాయి.
సీనియర్ స్థాయిలో చెలరేగుతూ...
చిన్న వయసే అయినా పృథ్వీ షాను ఇక ఆపడం సాధ్యం కాలేదు. ఇక ఒక్కో ఘనత అతని ఖాతాలో చేరుతూ పోయింది. ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌తో ముంబై తరఫున అతని ఫస్ట్ క్లాస్ అరంగేట్రం జరిగింది. తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సెంచరీతో జట్టును గెలిపించి షా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం. 1993 తర్వాత ముంబై క్రికెటర్ ఒకరు తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అదే జోరును తాజా సీజన్‌లో కూడా కొనసాగిస్తూ షా, మూడు సెంచరీలు బాదాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేసిన అతని పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. గత పది ఇన్నింగ్స్‌లలో పృథ్వీ వరుసగా 4, 120, 71, 44, 154, 31, 123, 5, 105, 46 స్కోరు చేశాడు. ఇటీవల బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరఫున ట్రెంట్ బౌల్ట్ ఆశ్చర్యపోయేలా అతడిని ఎదుర్కొన్న తీరు షా అంతర్జాతీయ ఆటకు కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతోంది. తాజాగా ఒడిషాతో జరుగుతోన్న మ్యాచ్‌లో సీనియర్ రహానేతో కలిసి పృథ్వీ 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేస్తే అందులో షా 99 పరుగులు చేయగా, రహానే వాటా 34 పరుగులే! సొంతగడ్డపై శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అతడిని ఎంపిక చేయాలని ఇప్పుడు అన్ని వైపుల నుంచి డిమాండ్ వస్తుండటం విశేషం.
అతని షాట్లలో, ఆటలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రస్తుతం తన వయసు వారిలో అతనే అత్యుత్తమం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనర్ కావాల్సిన అన్ని అర్హతలు అతనిలో ఉన్నాయి. వరుసగా భారీ స్కోర్లు చేయడం అతడిని మరింత నైపుణ్యం గల ఆటగాడిగా మారుస్తుంది. పృథ్వీకి తన ఆటపై చాలా నమ్మ కం ఉంది. ముంబై సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. అవకాశం ఇస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ బాగా ఆడగల సత్తా ఈ కుర్రాడిలో ఉంది.
– ప్రవీణ్ ఆమ్రే, ముంబై మాజీ కెప్టెన్, కోచ్
తండ్రి ప్రోత్సాహంతో...
ముంబైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే శివారు ప్రాంతం విరార్ పృథ్వీ స్వస్థలం. తండ్రి పంకజ్ షా చిరు వ్యాపారి కాగా షా నాలుగేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే రోజూ గంటన్నరకు పైగా ప్రయాణం చేసి ముంబై నగరంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో పృథ్వీ సాధన చేసేవాడు. కొడుకును ఎలాగైనా క్రికెటర్‌ను చేయాలన్న తండ్రి పట్టుదల, అందుకు తగినట్లుగా ఎప్పుడూ శ్రమకు వెనుకాడని పృథ్వీ తత్వం కలగలిసి కఠోర కోచింగ్ కొనసాగింది. చివరకు ఇతని ప్రతిభను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే ఒకరు మైదానం దగ్గర్లో ఉండేందుకు ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్ తమ క్రికెట్ జట్టులో చేర్చుకొని ఉచిత విద్య అందించడంతో పాటు అదనంగా స్కాలర్‌షిప్ కూడా ఇవ్వడంతో పృథ్వీకి ఇతర విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. ఆ తర్వాత అవకాశం దొరికిన ప్రతీసారి అతను దానిని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ముంబై అండర్–19 తరఫున చెలరేగిన తర్వాత భారత అండర్–19 జట్టులోకి ఎంపికైన షా, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment