వైజాగ్ లో ప్రొ కబడ్డీ
♦ 30న లీగ్ ప్రారంభం
♦ తొలి మ్యాచ్‌లో టైటాన్స్,
♦ యు ముంబా ఢీ
న్యూఢిల్లీ: వరుసగా రెండేళ్ల పాటు అభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌కు మరోసారి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి ఈ లీగ్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఇకనుంచి కబడ్డీ లీగ్ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ లీగ్ 30న హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్టేడియం అందుబాటులో లేకపోవడంతో వేదికను విశాఖపట్నంకు మార్చారు.
ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో తెలుగు టైటాన్స్ జట్టు తలపడుతుంది. 2014 తొలి సీజన్‌లోనూ వైజాగ్‌లోనే మ్యాచ్‌లు జరిగాయి. మార్చి 5న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో సీజన్ ముగుస్తుంది. మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో 26 మంది విదేశీ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు. జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్‌తో పాటు ఆటగాళ్లు నవనీత్, అనూప్, కాశీలింగ ఇందులో పాల్గొన్నారు. ఈసారి టైటిల్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు అభిషేక్ బచ్చన్ తెలిపారు.