కబడ్డీ... కబడ్డీ...
నేటి నుంచి
హైదరాబాద్‌లో
ప్రొ కబడ్డీ లీగ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి కబడ్డీ సందడి మొదలైంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు నేటి నుంచి నాలుగు రోజుల పాటు గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను ఢీకొంటుంది. ఓవరాల్‌గా ఈ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్ జట్టు 2015లో సెమీస్‌కు చేరి తమ ఉత్తమ ప్రదర్శనను చూపింది.
ఈసారైనా తొలి టైటిల్ సాధించాలనే భావనలో ఉన్న టైటాన్స్.. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈనేపథ్యంలో సొంత ప్రేక్షకుల మద్దతుతో బోణీ కొట్టాలనే కసితో బరిలోకి దిగబోతోంది. రైడింగ్‌లో కెప్టెన్ రాహుల్ చౌధరి, ఆల్‌రౌండర్ సందీప్ నర్వాల్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది. పట్నా తమ ధాటిని కొనసాగిస్తూ ఆడిన రెండింట్లో నూ గెలిచి జోరు మీదుంది. దీంతో పూర్తి స్థాయిలో రాణిస్తే తప్ప టైటాన్స్‌కు విజయం దక్కదు.
దబాంగ్ ఢిల్లీ బోణీ
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఎట్టకేలకు బోణీ చేసింది. శనివారం జరిగిన తమ నాలుగో మ్యాచ్‌లో 32-24తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ జట్టు 33-28తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. ప్రస్తుతం పుణేరి జట్టు 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ప్రొ కబడ్డీలో నేడు
తెలుగు టైటాన్స్ x పట్నా పైరేట్స్
రాత్రి 8 గంటల నుంచి
బెంగాల్ వారియర్స్ x యు ముంబా
రాత్రి 9 గంటల నుంచి