పట్టు వదిలేశారు
* ప్రొ కబడ్డీలో టైటాన్స్‌కు మూడో ఓటమి
* పట్నా పైరైట్స్ హ్యాట్రిక్ విజయం
సాక్షి, హైదరాబాద్: గతేడాది భాగ్యనగరంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-2లో తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ ఈసారి మాత్రం నాలుగో సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-35 స్కోరుతో పట్నా పైరేట్స్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ 39వ నిమిషంలో కూడా ఒక పాయింట్ ముందంజలో ఉన్న టైటాన్స్ వరుసగా మూడు పాయింట్లు ఇచ్చి చేజేతులా ఓడింది.
ఈ సీజన్‌లో టైటాన్స్ ఆడిన మూడు మ్యాచ్‌లూ ఓడిపోగా... డిఫెండింగ్ చాంపియన్ పట్నా ఆడిన మూడూ గెలిచింది. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 11 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున ‘రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రదీప్ నర్వాల్ కూడా 11 పాయింట్లు సాధించాడు.
పోటాపోటీగా...
మ్యాచ్ 14వ నిమిషం వరకు పైరేట్స్ ఆధిక్యంలో ఉంది. అయితే ఈ దశలో స్కోరును సమం చేసిన తెలుగు జట్టు ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లతో ముందంజ వేసింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 19-13 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో కూడా ఆకట్టుకున్న టైటాన్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఒక దశలో 8 పాయింట్లుతో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివరి రెండు నిమిషాల్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 26-18తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది.
ప్రొ కబడ్డీలో నేడు
బెంగళూరు బుల్స్ X పుణెరి పల్టాన్
రాత్రి 8 గంటల నుంచి
తెలుగు టైటాన్స్ X బెంగాల్ వారియర్స్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం