నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీమిండియా ఓపెనర్ మురళి విజయ్, నయావాల్ పుజారాలు శతకాలకు కెప్టెన్ కోహ్లి అర్ధ శతకం తోడవ్వడంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌కు 107 పరుగుల ఆధిక్యం లభించింది.
తొలిరోజు సింగిల్ డిజిట్‌కే రాహుల్ వికెట్ కొల్పోయినా భారత్‌కు మరో ఓపెనర్ విజయ్, పుజారాలు అండగా నిలిచారు. సెంచరీలతో లంక బౌలర్లను చెడుగుడు ఆడారు. రెండో రోజు 11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్, పుజారాలు బలమైన పునాది వేశారు. అసలైన టెస్టుమ్యాచ్ మజాను క్రికెట్ అభిమానులకు రుచి చూపించారు.
తొలుత మురళి విజయ్ 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో అధిక సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా విజయ్ గుర్తింపు పొందాడు. పటిష్టంగా క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని రంగనా హెరాత్ విడగొట్టాడు. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అనవసర షాట్‌కు ప్రయత్నించిన విజయ్ 128(221 బంతులు; 11 ఫోర్లు, ఒక సిక్సు) క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పుజారా తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించగా కోహ్లి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ దశలో 246 బంతులు ఎదుర్కొన్న పుజారా కెరీర్‌లో 14 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత వేగం పెంచిన కోహ్లి 66 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌లో 15 హాఫ్ సెంచరీ సాధించాడు. రెండోరోజు ఆటముగిసే సమయానికి క్రీజులో పుజారా 121 (284 బంతులు, 13 ఫోర్లు), కోహ్లి 54 (70 బంతులు, 6 ఫోర్లు)లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment