
సన్ ‘రైజ్’ కాలేదు
►సొంతగడ్డపై హైదరాబాద్‌కు తొలి ఓటమి
►సాధారణ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన వార్నర్ బృందం
►జైదేవ్ ఉనాద్కట్ హ్యాట్రిక్‌తో రైజింగ్ పుణే జయభేరి
►బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లున్నాయి. ఉప్పల్‌లో ఉప్పెనల్లే రెచ్చిపోతున్న హైదరాబాద్‌కు ఇదేమంత కష్టం కాదు. కానీ...! విచిత్రం ఆ ఓవర్లో ఒక్క పరుగైనా చేయలేదు! కారణం జైదేవ్ ఉనాద్కట్ ‘హ్యాట్రిక్’ బౌలింగ్. ఫలితం హైదరాబాద్ పరాజయం.
హైదరాబాద్: ఈ సీజన్‌లో సొంతగడ్డపై పరాజయమన్నదే ఎరుగని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ తక్కువ స్కోరు మ్యాచ్‌లో ఓడిపోయింది. రైజింగ్ పుణే బౌలర్ ఉనాద్కట్ (5/30) హ్యాట్రిక్ వికెట్ల వలలో విలవిల్లాడింది. ఐపీఎల్–10లో ఇది మూడో హ్యాట్రిక్. సూపర్ జెయింట్‌కు ఎనిమిదో విజయం. ప్లే–ఆఫ్‌కు దాదాపు బెర్తును ఖాయం చేసుకునే స్థితికి చేరుకుంది పుణే. రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓడింది. తద్వారా ప్లే–ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంది వార్నర్ సేన. మొదట పుణే 20ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేయగా... హైదరాబాద్ 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమైంది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
యువరాజ్ రాణించినా...
149 పరుగుల సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ను స్టోక్స్ (3/30) చావుదెబ్బ తీశాడు. కీలకమైన శిఖర్ ధావన్ (19), విలియమ్సన్ (4) వికెట్లతో పాటు డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్)లనూ అతనే ఔట్ చేశాడు. తర్వాత యువరాజ్ (43 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాసిక్ ఇన్నింగ్స్‌తో లక్ష్యం చేర్చే బాధ్యతను తీసుకున్నా... పొంచివున్న ఉనాద్కట్ ముప్పును తప్పించలేకపోయాడు. ఒక దశలో 117/4తో పటిష్టస్థితిలో ఉన్న హైదరాబాద్ నెత్తిన అదే స్కోరుపై పిడుగువేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో యువీని, నమన్ (9)ను ఔట్ చేసిన ఉనాద్కట్ పుణేకు గెలుపు దారి చూపాడు.
హ్యాట్రిక్ సాగిందిలా...
ఇక తన మరుసటి ఓవర్, ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు ఉనాద్కట్ సిద్ధమయ్యాడు. తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి స్టోక్స్ క్యాచ్‌తో బిపుల్ శర్మ (8) ఔట్. మూడో బంతికి రిటర్న్ క్యాచ్‌తో రషీద్ ఖాన్ డకౌట్. నాలుగో బంతిని భువనేశ్వర్ (0) గాల్లోకి లేపాడు... మనోజ్ తివారి క్యాచ్! అంతే హ్యాట్రిక్. మిగతా రెండు బంతులకూ ఉనాద్కట్ పరుగులివ్వలేదు.దీంతో మెయిడిన్ హ్యాట్రిక్ ఓవర్‌గా నిలిచింది.
స్టోక్స్ మెరుపులు...
అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన రైజింగ్ పుణే ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. సన్‌రైజర్స్ ఆటగాడు బిపుల్ శర్మ ఓపెనర్లిద్దరినీ దెబ్బమీద దెబ్బ తీశాడు. మొదట బిపుల్ డైరెక్ట్ త్రోతో రాహుల్ త్రిపాఠి (1)ని రనౌట్ చేశాడు. అప్పుడు జట్టు స్కోరు 6 పరుగులే! కాసేపటికి బిపుల్ బౌలింగ్‌లో రహానే (22) యువరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో స్మిత్ (39 బంతుల్లో 34), స్టోక్స్ (25 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) జాగ్రత్తగా ఆడారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక... రెండు పరుగుల వ్యవధిలో ఇద్దరూ నిష్క్రమించారు. జట్టు స్కోరు 99 వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్టోక్స్ క్లీన్‌బౌల్డ్ కాగా... 101 పరుగుల వద్ద స్మిత్‌ను సిద్ధార్థ్ కౌల్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన ధోని (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడినా... సిద్ధార్థ్ కౌల్ వైవిధ్యమైన బంతులతో పుణే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ధోనితో పాటు క్రిస్టియాన్ (4), ఠాకూర్‌లను ఔట్ చేశాడు.
►17 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’లు. బాలాజీ, ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్, చండిలా, నరైన్, ప్రవీణ్ తాంబే, వాట్సన్, అక్షర్ పటేల్, బద్రీ, టై, ఉనాద్కట్ ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు.