
పట్నాపై పుణేరి పల్టన్ పైచేయి
ప్రొ కబడ్డీ లీగ్
లక్నో: పట్నా పైరేట్స్ రైడర్ పర్దీప్ నర్వాల్ అద్భుతంగా రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 47–42 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ఈ లీగ్‌లో పుణేరి జట్టుకిది నాలుగో విజయం. రైడింగ్‌లో అదరగొట్టిన పట్నా... డిఫెండర్ల వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. పర్దీప్ 24 సార్లు రైడింగ్‌కు వెళ్లి 19 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఓవరాల్‌గా ఇరు జట్లు రెండు సార్లు ఆలౌటయ్యాయి. అయితే పుణేరి పల్టన్ ఆటగాళ్లు టాకిల్‌లో రాణించడంతో విజయం దక్కింది. టాకిల్‌లో పట్నా 6 పాయింట్లు సాధిస్తే... పల్టన్ జట్టు 12 పాయింట్లు చేసింది.
ఇదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. రైడింగ్‌లో పుణేరి (29)తో పోలిస్తే... పట్నా (31)దే పైచేయి. పల్టన్ ఆటగాళ్లలో డిఫెండర్ జియావుర్ రెహమాన్ (6) ఆకట్టుకున్నాడు. రైడింగ్‌లో రాజేశ్ మోండల్ 10 పాయింట్లు చేశాడు. దీపక్ హుడా 9, సందీప్ నర్వాల్ 5, మోను 5 పాయింట్లు సాధించారు. అనంతరం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 24–22తో యూపీ యోధపై గెలిచింది. నేడు లీగ్‌కు విశ్రాంతి రోజు. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్, యూపీ యోధతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.