మొహాలీ: ఐపీఎల్ 7లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలివన్ 16 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ నాయర్(11) పరుగులకే పెవిలియన్ కు చేరి రాజస్థాన్ అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం రహానే(23) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. రహానే అవుటయిన వెంటనే వాట్సన్ (0) కే పెవిలియన్ కు చేరి రాజస్థాన్ కు మరో షాక్ ఇచ్చాడు. అప్పటికే రనే రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ భారీ షాట్లకు పోయి వరుస వికెట్లు కోల్పోయింది. చివర్లో రాజస్థాన్ ఆటగాళ్లలో బ్రాడ్ హోడ్జ్(31), ఫలక్ నర్ (35) పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. కాగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రాజస్థాన్ 163 పరుగుల మాత్రమే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో పటేల్ కు మూడు వికెట్లు లభించగా, రిషి ధావన్, కరణ్ వీర్ సింగ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, వాహ్రాలు ధాటిగా ఆరంభించారు. అయితే సెహ్వాగ్ (18; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అనంతరం వాహ్రాకు జతకలిసిన రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరివురూ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వాహ్రా(25), మార్ష్(40) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. చివర్లో సాహా(27), మిల్లర్(29), బెయిలీ(26) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. నేటి మ్యాచ్ లో ఓటమి పాలైన రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టం చేసుకుని మరోమ్యాచ్ వరకూ ఆగాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది.