Punjab Kings Eleven
-
‘ఆరు యార్కర్లు వేయాల్సిందే’
దుబాయ్: రెండు సూపర్ ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ విజయంలో పేసర్ మొహమ్మద్ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. తొలి సూపర్ ఓవర్ వేసిన అతను వరుస యార్కర్లతో రోహిత్, డికాక్‌లను ఇబ్బంది పెట్టడంతో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దాంతో ‘టై’ కావడంతో ఫలితం రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తన బౌలింగ్ వ్యూహంపై షమీకి ముందే స్పష్టత ఉన్నట్లు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ‘సూపర్ ఓవర్ కోసం సాధారణంగా ఎవరూ సిద్ధంగా ఉండరు. అలాంటి సమయంలో బౌలర్ ధైర్యాన్ని, అతని నమ్మకాన్ని మనం నమ్మాలి. తాను ఆరు బంతులు కూడా యార్కర్లుగా వేసేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనిలాంటి సీనియర్లు మ్యాచ్‌లు గెలిపించడం ఎంతో అవసరం’ అని రాహుల్ అన్నాడు. టోర్నీలో సూపర్ ఓవర్లో ఒకసారి ఓడిన తాము ఈసారి మ్యాచ్ గెలవడం సంతోషమే అయినా... ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు అతను వ్యాఖ్యానించాడు. తీవ్ర నిరాశలో రోహిత్... మరోవైపు ఈ పరాజయం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను తీవ్రంగా నిరాశపర్చింది. మ్యాచ్ తర్వాత ప్రసారకర్తలతో మాట్లాడేందుకు రాని రోహిత్, ఆ తర్వాత మీడియా సమావేశానికి కూడా పొలార్డ్‌ను పంపించాడు. ‘మేం గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయామనే విషయాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇదేమీ జీవితంలో అతి పెద్ద సమస్య కాదు. దీనిని మరచి ముందుకు సాగాలి. పరాజయం తర్వాత రోహిత్ బాగా బాధపడుతున్నాడని నాకు తెలిసింది. అయితే అతనో పోరాటయోధుడు అనే విషయం మరచిపోవద్దు’ అని కీరన్ పొలార్డ్ వెల్లడించాడు. నాకు కోపం తెప్పించింది: గేల్ రెండో సూపర్ ఓవర్లో సిక్సర్‌తో చెలరేగి గెలిపించిన క్రిస్ గేల్ మాట్లాడుతూ...అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లడమే తనకు నచ్చలేదని అన్నాడు. పంజాబ్ రెగ్యులర్ టైమ్‌లోనే మ్యాచ్‌ను గెలవాల్సిందని అభిప్రాయపడిన అతను, తాను ఒత్తిడికి లోను కాలేదని స్పష్టం చేశాడు. ‘సూపర్ ఓవర్లో ఆడే సమయంలో నేనేమీ ఒత్తిడికి లోను కాలేదు. అయితే అలాంటి స్థితికి మ్యాచ్ రావడమే నాకు ఆగ్రహం కలిగించింది. నిజానికి సూపర్ ఓవర్లో మొదటి బాల్ ఎవరు ఆడాలని మయాంక్ అడిగితే ఆశ్చర్యపోయా. ఎప్పుడైనా ‘బాస్’ ఆడాల్సిందేనని, తొలి బంతిని సిక్స్ కొడతాను చూడని కూడా అతనితో చెప్పా’ అని గేల్ వెల్లడించాడు. -
గెలిచిన మ్యాచ్‌లో కోహ్లికి భారీ ఫైన్
మొహాలి : ఐపీఎల్లో ఎట్టకేలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆరు వరుస పరాజయాల తర్వాత కోహ్లి పట్టుదల, డివిలియర్స్ మెరుపులు.. రాయల్ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. బౌలర్లు కాస్త రాణించడం.. బ్యాటింగ్‌లో టాపార్డర్ దుమ్మురేపడం.. ఆఖర్లో స్టొయినిస్ ధనాధన్ బ్యాటింగ్.. అన్ని కలిసొచ్చి.. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయాన్ని అందుకుంది. అయితే, ఏడో మ్యాచ్‌లో ఎట్టకేలకు గెలిచినప్పటికీ.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఒకింత చేదు వార్త ఇది. ఈ మ్యాచ్‌లో బెంగళూరులో స్లో ఓవర్‌రేట్‌కు కారణమయ్యారు. మినిమమ్ ఓవర్ రేట్‌ను బెంగళూరు బౌలర్లు పాటించకపోవడంతో జట్టు కెప్టెన్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను బెంగళూరు జట్టు ఉల్లంఘించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ జట్టు 8 వికెట్లతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (64 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు. -
లయన్స్‌పై ‘పంజా’బ్
►26 పరుగులతో కింగ్స్ ఎలెవన్ విజయం ►హషీమ్ ఆమ్లా అర్ధ సెంచరీ ►దినేశ్ కార్తీక్ ఒంటరి పోరాటం రాజ్‌కోట్: వరుసగా నాలుగు ఓటముల అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోలుకుంది. ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 26 పరుగుల తేడాతో నెగ్గింది. హషీమ్ ఆమ్లా (40 బంతుల్లో 65; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో అర్ధ సెంచరీతో చెలరేగగా... అక్షర్ పటేల్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ మెరుపులతో అలరించాడు. సొంత వేదికపై లయన్స్ జట్టుకిది వరుసగా రెండో ఓటమి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ రైనా (24 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. కరియప్ప, అక్షర్, సందీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆమ్లా జోరు...: కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పేసర్ నాథూ సింగ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ వోహ్రా (2)ను అవుట్ చేశాడు. ఈ క్యాచ్‌ను అందుకున్న దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో వంద మందిని అవుట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. నాథూ తన రెండో ఓవర్లో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వగలిగాడు. ఆరో ఓవర్లో ఆమ్లా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 50 పరుగులు చేయగలిగింది. ఇదే జోరుతో 30 బంతుల్లో ఆమ్లా మరో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు వరుసగా సిక్స్, ఫోర్ బాది జోరు మీదున్న మార్ను టై దెబ్బతీశాడు. 14వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ రెండు సిక్సర్లతో విరుచుకుపడినా అదే ఓవర్లో ఆమ్లా అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో మ్యాక్స్ కూడా పెవిలియన్‌కు చేరాడు.19వ ఓవర్లోఅక్షర్ రెండు సిక్సర్లు, ఫోర్‌తో రెచ్చిపోయి అదే ఓవర్లో అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రావడంతో పంజాబ్ మంచి స్కోరు చేసింది. లయన్స్ తడబాటు: లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ జట్టులో దినేశ్ కార్తీక్ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. తొలి ఓవర్లోనే మెకల్లమ్ (6) అవుటవ్వడంతోపాటు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. రైనా వేగంగా ఆడే ప్రయత్నంలో బౌండరీ లైన్ దగ్గర మ్యాక్స్‌వెల్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా (9), డ్వేన్ స్మిత్ (4), అక్షదీప్ వరుస ఓవర్లలో అవుట్ కాగా... అటు రన్‌రేట్ కూడా భారీగా పెరిగిపోవడంతో లయన్స్ కోలుకోలేకపోయింది. మరోవైపు గాయం కారణంగా లయన్స్ జట్టు సభ్యుడు డ్వేన్ బ్రేవో ఐపీఎల్–10 నుంచి వైదొలిగాడు. -
ఎదురులేని ముంబై
-
ఎదురులేని ముంబై
► వరుసగా ఐదో విజయం ► చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ► చెలరేగిన బట్లర్, నితీశ్ రాణా ► ఆమ్లా శతకం వృథా హషీమ్ ఆమ్లా.. పక్కా టెస్టు ఆటగాడు.. అసలు ఇలాంటి ఆటగాడికి ఐపీఎల్లో చోటు ఎలా దక్కిందో.. ఇవీ సగటు క్రికెట్ అభిమాని అతడిపై చేసే కామెంట్స్. అయితే అలాంటి వారికి సమాధానంగా అన్నట్టు పొట్టి ఫార్మాట్లోనూ తనదైన క్లాస్ ఇన్నింగ్స్‌కు చోటుంటుందని ఈ ఓపెనర్ నిరూపించాడు. అతడి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఔరా.. ఆడుతోంది ఆమ్లానేనా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఒక్క సిక్స్ కొడితే గ్రేట్ అనుకునే తన బ్యాట్ నుంచి ఏకంగా ఆరు సిక్సర్లు బుల్లెట్ వేగంతో స్టాండ్స్‌ను ముద్దాడగా.. 58 బంతుల్లోనే కెరీర్లో తొలి టి20 శతకాన్ని అందుకుని జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. ఇందులో 51 పరుగులు ఒక్క మలింగ బౌలింగ్‌లోనే సాధించడం విశేషం. అయితే జోస్ బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌కు తోడు పార్థివ్, నితీశ్ రాణాల మెరుపు ఆటతో ముంబై ఇండియన్స్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే కింగ్స్ ఎలెవన్‌ను చిత్తు చేసి వరుసగా ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై మళ్లీ అగ్రస్థానానికి చేరింది. ఇండోర్: ఐపీఎల్ పదో సీజన్లో ముంబై ఇండియన్స్ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 15.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఓపెనర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాటు నితీశ్ రాణా (34 బంతుల్లో 62 నాటౌట్; 7 సిక్సర్లు) టోర్నీలో మూడో అర్ధ సెంచరీ సాధించగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 198 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (60 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) టి20 కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మెక్లీనగన్‌కు రెండు, కృనాల్.. బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో రెండు వికెట్లకు 199 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు బట్లర్‌కు దక్కింది. పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఆమ్లా సూపర్ శతకం సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన షాన్ మార్‡్ష (21 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఉన్నంతసేపు బౌండరీలతో మెరిశాడు. ఆరో ఓవర్లో తను వెనుదిరగ్గా వృద్ధిమాన్ సాహా (15 బంతుల్లో 11) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే ఆమ్లా, కెప్టెన్ మ్యాక్స్‌వెల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఉరకలెత్తించారు. 34 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన మ్యాక్స్‌వెల్ మరుసటి ఓవర్లో మెక్లీనగన్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 6,6,4,4,6తో రెచ్చిపోవడంతో 28 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్లో ఆమ్లా ఒక్కసారిగా జూలు విదిల్చి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి 22 పరుగులు అందించాడు. ఈ రెండు ఓవర్లలోనే జట్టుకు 50 పరుగులు రావడం విశేషం. 17వ ఓవర్లో బుమ్రా తన అప్పర్ కట్‌తో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేసి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీశాడు. అప్పటికే మూడో వికెట్‌కు 33 బంతుల్లోనే 83 పరుగులు జత చేరాయి. తర్వాత ఓవర్లో స్టొయినిస్ (1) అవుట్ అయినా చివరి ఓవర్లో ఆమ్లా వరుసగా రెండు సిక్సర్లు బాది టి20 కెరీర్లో తొలి శతకాన్ని పూర్తి చేశాడు. బట్లర్, రాణా తుఫాన్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు సంచలన ఆరంభం లభించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్, బట్లర్ మెరుపు ఆటతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరి ధాటికి పవర్‌ప్లేలో ముంబై తమ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 82 పరుగులు సాధించింది. ఇందులో ఆరు మాత్రమే డాట్ బంతులుండగా.. 14 బౌండరీలు బాదారంటే వీరిద్దరి జోరును అర్థం చేసుకోవచ్చు. స్టొయినిస్ వేసిన ఆరో ఓవర్లో పార్థివ్ వరుసగా 6,4 బాదినా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత బట్లర్‌కు నితీశ్ రాణా జత చేరడంతో స్కోరు అదే వేగంతో దూసుకెళ్లింది. 24 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ చేశాడు. 12వ ఓవర్లో రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదగా ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో చేయాల్సిన రన్‌రేట్ బాగా తగ్గిపోయింది. అయితే 13వ ఓవర్లో బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌కు మోహిత్ శర్మ తెరదించడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అప్పటికే మ్యాచ్ ముంబై చేతుల్లోకి రావడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. 15వ ఓవర్లో రాణా ఓ సిక్సర్‌తో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా హార్ధిక్ పాండ్యా (4 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇదే ఓవర్లో వరుసగా 6,4,4 కొట్టడంతో చివరి ఐదు ఓవర్లలో లక్ష్యం 8 పరుగులకు చేరింది. దీంతో మరో 27 బంతులుండగానే ముంబై సునాయాసంగా నెగ్గింది. ►ఐపీఎల్లో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన. 2014లో రాజస్తాన్ రాయల్స్‌పై 190 పరుగులు ఛేదించింది. ► ఇన్నింగ్స్‌లో ఒక్క మలింగ బౌలింగ్‌లోనే ఆమ్లా 51 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్లో ఇది రెండో అత్యధికం. గతంలో ఉమేశ్ బౌలింగ్‌లో కోహ్లి 52 పరుగులు చేశాడు. ఐపీఎల్లో నేడు కోల్‌కతా & గుజరాత్ వేదిక: కోల్‌కతా, రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బెంగళూరుకు మన్దీప్
బెంగళూరు: పంజాబ్ కింగ్స్ ఎలెవ న్ బ్యాట్స్‌మన్ మన్దీప్ సింగ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. దీంతో ఈ సీజన్లో తను బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడు నిలకడగా రాణిస్తున్నాడు. తనతో పాటు రాజస్తాన్ నుంచి బౌలర్ ఇక్బాల్ అబ్దుల్లాను కూడా బెంగళూరు టీమ్ తీసుకుంది. శుక్రవారంతో ఈ రెండో ట్రేడింగ్ విండో ముగియగా.. ఇప్పటిదాకా ఆరుగురు ఆటగాళ్లు ట్రేడింగ్‌లో తమ పాత జట్ల నుంచి మారారు. -
‘కింగ్స్’ ఎవరో..!
నేడు క్వాలిఫయర్-2 పంజాబ్‌తో చెన్నై అమీతుమీ ప్రతీకారానికి ధోని సేన సిద్ధం రాత్రి 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఐపీఎల్లో లీగ్ దశలో అత్యంత భారీ స్కోర్లు నమోదైన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్లే ప్రత్యర్థులు. పంజాబ్, చెన్నైల మధ్య ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అభిమానులకు కావలసినంత పరుగుల వినోదం. 200 బాదడం ఇంత సులభమా అనేలా ఆ రెండు మ్యాచ్‌లూ జరిగాయి. అయితే ఫలితం మాత్రం రెండుసార్లూ పంజాబ్ ైవె పే వచ్చింది. కానీ ఇప్పుడు జరగబోయేది నాకౌట్ సమరం. ఇక్కడ ఏ మాత్రం తడబడ్డా ఇంటికి చేరాలి. ఒత్తిడిని జయించేవారే అసలైన ‘కింగ్స్’గా నిలబడతారు. నేడు జరిగే క్వాలిఫయర్‌లో గెలిచిన కింగ్స్ జట్టే ఆదివారం కోల్‌కతాతో టైటిల్ కోసం పోరాడుతుంది. ముంబై: ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటిదాకా అందరికంటే నిలకడగా ఆడిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్... అలాంటి జట్టును ఈ సీజన్లో రెండుసార్లు చావు దెబ్బతీసిన జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్... ఈ రెండు జట్ల మధ్య మరో సమరం అంటే అభిమానులకు పండగే. మ్యాక్స్‌వెల్ మళ్లీ గాడిలో పడతాడా? అతడిని స్పిన్నర్ అశ్విన్ ఈసారైనా ఆపుతాడా? చెన్నై జట్టులోని నలుగురు విదేశీ హిట్టర్లను పంజాబ్ బౌలర్లు నియంత్రించగలరా? అన్నింటికీ మించి తమను రెండు సార్లు నిరాశపరిచిన బెయిలీ బృందంపై ధోనిసేన ప్రతీకారం తీర్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే నేడు (శుక్రవారం) వాంఖడే మైదానంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌ను వీక్షించాల్సిందే. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ జట్టు క్వాలిఫయర్‌లో కోల్‌కతా చేతిలో కంగుతింది. అయితే ఓడినా ఫైనల్‌కు చేరే మరో అవకాశం ఉండటం వల్ల ఆ జట్టు కాస్త ఊరట చెందింది. మరోవైపు ధోని బృందం చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబైని చిత్తుచేసి ఆత్మవిశ్వాసం పెంచుకుంది. సమష్టిగా ముందుకు.. చెన్నై జట్టుకు ఈ సీజన్లో ఓపెనర్ డ్వేన్ స్మిత్ నుంచి చక్కటి ఆరంభం లభించింది. అత్యధిక పరుగుల జాబితాలో ఇప్పటికే తను రెండో స్థానం (559)లో ఉన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల నుంచి మెకల్లమ్ స్థానంలో ఓపెనింగ్ చేస్తున్న డు ప్లెసిస్ త్వరగానే కుదురుకున్నాడు. ముంబైపై తొలి వికెట్‌కు ఈ జోడి 6.2 ఓవర్లలో 60 పరుగులను జోడించింది. నేటి మ్యాచ్‌లోనూ వీరితోనే ముందుకెళ్లవచ్చు. ఓవరాల్‌గా వీరి బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. రైనా బుధవారం నాటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మిడిల్లో డేవిడ్ హస్సీ, మెకల్లమ్, జడేజా రాణిస్తుండగా ఫినిషింగ్‌లో ధోని తన మార్క్‌ను చాటుకుంటున్నాడు. పేస్ బౌలింగ్ లో మోహిత్ శర్మ నంబర్‌వన్ (పర్పుల్ క్యాప్)గా ఉండగా స్పిన్‌లో అశ్విన్, జడేజా కీలక పాత్ర వ హిస్తున్నారు. కానీ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అశ్విన్ తేలిపోయాడు. మ్యాక్స్‌వెల్ అతడి స్పిన్‌ను తుత్తునియలు చేశాడు. తానుఎదుర్కొన్న 24 బంతుల్లో 64 పరుగులు పిండుకున్నాడు. ఈసారి ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేసి మ్యాక్స్‌ను అడ్డుకుంటానని అశ్విన్ సవాల్ విసిరాడు. బ్యాటింగే బలం విధ్వంసకర బ్యాటింగ్‌కు పంజాబ్ పెట్టింది పేరు. ఇప్పటికే ఈ సీజన్లో అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులకు ఇష్టుడైన మ్యాక్స్‌వెల్‌తో పాటు డేవిడ్ మిల్లర్, బెయిలీ, యువ సంచలనం మనన్ వోహ్రా, సాహా తమదైన ఆటతీరుతో జట్టుకు విజయాలు సాధించిపెట్టారు. సీనియర్ ఆటగాడు సెహ్వాగ్ కూడా జట్టుకు సహాయపడుతున్నాడు. ఇదంతా ఓవైపు.. కోల్‌కతాతో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 164 పరుగుల టార్గెట్‌ను కూడా ఛేదించకపోవడం వీరిని ఆందోళనలో పడేస్తోంది. మ్యాక్స్, మిల్లర్ విఫలమవడం జట్టును దెబ్బతీసింది. లోపాలను సరిదిద్దుకుని చెన్నైపై ఎప్పటిలాగే చెలరేగాలని బ్యాటింగ్ విభాగం ప్రణాళిక రచిస్తోంది. మిచెల్ జాన్సన్ మినహా స్టార్ బౌలర్ లేని ఈ జట్టు బౌలింగ్ విభాగం ఆశ్చర్యకరంగా లీగ్‌లో ప్రత్యర్థికి కొరకరాని విధంగా మారింది. సందీప్ శర్మ (17 వికెట్లు), స్పిన్నర్ అక్షర్ పటేల్ (16), బాలాజీ (12) ఆకట్టుకుంటున్నారు. కోల్‌కతాపై సందీప్, బాలాజీలకు విశ్రాంతినిచ్చినా ఈ మ్యాచ్‌లో వారిని ఆడించనున్నారు. ఆరంభంలోనే చెన్నై వికెట్లు తీసి ఒత్తిడి పెంచితేనే మ్యాచ్‌పై పంజాబ్ ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు మ్యాచ్‌లు.. ఐపీఎల్-7లో చెన్నై, పంజాబ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు అభిమానులకు కనుల పండుగగా నిలిచాయి. పరుగులు వరదలా పారిన ఈ మ్యాచ్‌లో చెన్నైకి అడ్డుగా నిలబడింది మ్యాక్స్‌వెల్ విధ్వసంకర ఆటతీరే. ఓసారి ఆ మ్యాచ్‌లను గుర్తుకు తెచ్చుకుంటే... అబుదాబిలో జరిగిన వీరి తొలి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై... స్మిత్ (43 బంతుల్లో 66; 6 ఫోర్లు; 3 సిక్సర్లు), మెకల్లమ్ (45 బంతుల్లో 67; 4 ఫోర్లు; 5 సిక్సర్లు) ఆటతీరుతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలుపు ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే అనూహ్యమైన ఆటతీరుతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 43 బంతుల్లో 95 పరుగులు (15 ఫోర్లు; 2 సిక్సర్లు) చేసి ధోని సేనకు షాకిచ్చాడు. తను అవుటయ్యాక మ్యాచ్ చెన్నై వైపు మొగ్గుచూపినా మిల్లర్ (37 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఏడు బంతులుండగానే పంజాబ్ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పరిస్థితి మరీ ఘోరం. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంట్లోనూ మ్యాక్స్‌వెల్ హీరోగా నిలిచాడు. ఈసారి 38 బంతుల్లోనే 90 పరుగులు (6 ఫోర్లు; 8 సిక్సర్లు) చేసి జట్టు భారీ స్కోరులో భాగస్వామి అయ్యాడు. బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. బదులుగా చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 187 పరుగులకే చేతులెత్తేసింది. డుప్లెసిస్ (25 బంతుల్లో 52; 7 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే ఆకట్టుకున్నాడు. 6 చెన్నై గెలిస్తే ఫైనల్‌కు వెళ్లడం ఆరోసారి 1 పంజాబ్ ఫైనల్‌కు వెళితే ఇదే తొలిసారి జట్లు (అంచనా): చెన్నై: ధోని (కెప్టెన్), స్మిత్, డు ప్లెసిస్, రైనా, మెకల్లమ్, హస్సీ, జడేజా, అశ్విన్, మోహిత్, పాండే, నెహ్రా. పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, అక్షర్, ధావన్, జాన్సన్, సందీప్, బాలాజీ. -
రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
మొహాలీ: ఐపీఎల్ 7లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలివన్ 16 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ నాయర్(11) పరుగులకే పెవిలియన్ కు చేరి రాజస్థాన్ అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం రహానే(23) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. రహానే అవుటయిన వెంటనే వాట్సన్ (0) కే పెవిలియన్ కు చేరి రాజస్థాన్ కు మరో షాక్ ఇచ్చాడు. అప్పటికే రనే రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ భారీ షాట్లకు పోయి వరుస వికెట్లు కోల్పోయింది. చివర్లో రాజస్థాన్ ఆటగాళ్లలో బ్రాడ్ హోడ్జ్(31), ఫలక్ నర్ (35) పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. కాగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రాజస్థాన్ 163 పరుగుల మాత్రమే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో పటేల్ కు మూడు వికెట్లు లభించగా, రిషి ధావన్, కరణ్ వీర్ సింగ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, వాహ్రాలు ధాటిగా ఆరంభించారు. అయితే సెహ్వాగ్ (18; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అనంతరం వాహ్రాకు జతకలిసిన రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరివురూ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వాహ్రా(25), మార్ష్(40) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. చివర్లో సాహా(27), మిల్లర్(29), బెయిలీ(26) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. నేటి మ్యాచ్ లో ఓటమి పాలైన రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టం చేసుకుని మరోమ్యాచ్ వరకూ ఆగాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. -
ఐపీఎల్ 7: రాజస్థాన్ రాయల్స్ విజయలక్ష్యం 180
మొహాలీ: ఐపీఎల్ 7లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలివన్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, వాహ్రాలు ధాటిగా ఆరంభించారు. అయితే సెహ్వాగ్ (18; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అనంతరం వాహ్రాకు జతకలిసిన మార్ష్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరివురూ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వాహ్రా(25), మార్ష్(40) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. చివర్లో సాహా (27), మిల్లర్(29), బెయిలీ(26) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరుచుకోవాలంటే నేటి మ్యాచ్ లో గెలవాల్సిన అవసరం ఉంది. -
ఈసారి మిల్లర్...
మిల్లర్ 29 బంతుల్లో 66 8 ఫోర్లు, 3 సిక్సర్లు మ్యాక్స్‌వెల్‌ను మరిపిస్తూ విజృంభణ బంతితో బెంబేలెత్తించిన సందీప్ శర్మ అరంగేట్రంలోనే రాణించిన శివమ్ శర్మ పంజాబ్ చేతిలో మళ్లీ చిత్తయిన బెంగళూరు ప్లే ఆఫ్‌కు కింగ్స్ ఎలెవన్! ఒకరు కాకపోతే ఒకరు... మ్యాక్స్‌వెల్ కాకపోతే మిల్లర్... టి20 క్రికెట్లో హిట్టింగ్‌కు పరాకాష్ట. సిక్సర్లు కొట్టడం అంటే మంచినీళ్లు తాగడమే అనుకుంటున్నారు. మరోసారీ అదే జోరు... మ్యాక్స్‌వెల్ ఉన్నంత సేపు ఫటఫట్లాడిస్తే... మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీళ్లకు తోడు బౌలర్ సందీప్ శర్మ... ఈసారి కూడా కోహ్లి, గేల్‌లను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఫలితం... పంజాబ్ హోరులో రాయల్ చాలెంజర్స్ కొట్టుకుపోయింది. బెంగళూరు: క్రిస్ గేల్, కోహ్లి వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే ఔట్ చేయడమన్నది ఏ బౌలర్‌కైనా ఓ కల లాంటిదే. మరి వీరిద్దరినీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఒకే ఓవర్లో అవుట్ చేస్తే... అది కూడా ఒకే సీజన్లో జరిగితే... కచ్చితంగా అది అద్భుతమే. పంజాబ్ యువ పేసర్ సందీప్ శర్మ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్లో బెంగళూరుతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లోనూ గేల్, కోహ్లిలను ఒకే ఓవర్లో డగౌట్‌కు పంపించి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్స్‌మెన్ చెలరేగి పంజాబ్‌కు భారీస్కోరును అందిస్తే... ఆ తరువాత బౌలర్లు అంతకుమించిన విజృంభణతో బెంగళూరును కుప్పకూల్చారు. ఫలితంగా పంజాబ్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మిల్లర్ (29 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు తోడు సెహ్వాగ్ (24 బంతుల్లో 30; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో విఫలమైన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. సందీప్ శర్మ (3/25) మూడు వికెట్లతో టాప్ ఆర్డర్‌ను కూల్చగా, బాలాజీ, శివమ్ శర్మ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. డివిలియర్స్ (26 బంతుల్లో 53; 1 ఫోర్, 5 సిక్స్‌లు) , స్టార్క్ (23 బంతుల్లో 29)లు మాత్రమే పోరాడారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన యువ స్పిన్నర్ శివమ్శర్మ ఆకట్టుకున్నాడు. సందీప్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రస్తుతం 16 పాయింట్లు తమ ఖాతాలో జమ చేసుకున్న పంజాబ్... ఇక ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించినట్లే. మిల్లర్ మెరుపులు పంజాబ్‌కు ఎప్పటిలాగే సెహ్వాగ్ శుభారంభాన్నిచ్చాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. ఇదే ఊపులో ఓవర్‌కో ఫోర్ చొప్పున సాధిస్తూ మన్దీప్ (21)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో మన్దీప్ ఔటైనా.. పవర్ ప్లేలో పంజాబ్‌కు 64 పరుగులు లభించాయి. ఆ వెంటనే యజువేంద్ర చాహల్ బౌలింగ్‌కు వస్తూనే సెహ్వాగ్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో తొలి బంతినే బౌండరీకి తరలించిన విధ్వంసక బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్.. యువరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. అయితే చాహల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద స్టార్క్ చేతికి చిక్కాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ను తొందరగా ఔట్ చేశామన్న ఆనందం బెంగళూరుకు ఎంతో సేపు మిగలలేదు. ఈసారి డేవిడ్ మిల్లర్ ఏకంగా సునామీనే సృష్టించాడు. ఆరోన్ వేసిన పదో ఓవర్లో మూడు ఫోర్లతో తన విజృంభణ ప్రారంభించాడు. స్టార్క్ వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో మూడు ఫోర్లు సాధించాడు. రెండు ఓవర్లపాటు చాహల్, ఆల్బీ మోర్కెల్‌లు కట్టడి చేసినా.. 16వ ఓవర్లో మిల్లర్ మళ్లీ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ సాధించి హర్షల్ పటేల్‌కు చుక్కలు చూపించాడు. సాహా కూడా ఓ సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు నమోదయ్యాయి. అయితే మిల్లర్, సాహాలు వరుస ఓవర్లలో ఔట్ కావడం, చివరి ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో పంజాబ్ జోరు కాస్త తగ్గింది. సందీప్ మ్యాజిక్.. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు మళ్లీ సందీప్‌శర్మ దెబ్బకు విలవిల్లాడింది. తన రెండో ఓవర్ తొలి బంతికే కీపర్ క్యాచ్ ద్వారా ప్రమాదకర గేల్ (4)ను వెనక్కిపంపిన సందీప్.. మరుసటి బంతికే కోహ్లి (0)నీ అదేవిధంగా ఔట్ చేసి బెంగళూరును కోలుకోలేని దెబ్బతీశాడు. సచిన్ రాణా.. హ్యాట్రిక్‌ను నిరాకరించినా, తిరిగి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పార్థివ్ (13)నూ డగౌట్‌కు చేర్చి సందీప్ మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే రాణా (18)ను హర్హల్ పటేల్ ఔట్ చేయడం, యువరాజ్ (3) ఎప్పటిలాగే ఇలా వచ్చి అలా వెళ్లడంతో రాయల్ చాలెంజర్స్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రెండు సిక్స్‌లతో మెరుపులు మెరిపించిన ఆల్బీ మోర్కెల్ (16) కూడా వెంటనే వెనుదిరిగాడు. మరోవైపు డివిలియర్స్ భారీసిక్సర్లతో విరుచుకుపడ్డాడు.అతనికి స్టార్క్ నుంచి చక్కని సహకారం లభించడంతో ఇద్దరూ కలిసి ఏదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే లక్ష్యానికి దూరం పెరిగిపోతుండడంతో మరో షాట్ కోసం ప్రయత్నించి డివిలియర్స్ ఔటయ్యాడు. 125 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన బెంగళూరు మళ్లీ కోలుకోలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కోహ్లి (బి) చాహల్ 30, మన్‌దీప్‌సింగ్ (సి) ఆల్బీ మోర్కెల్ (బి) హర్షల్ పటేల్ 21, మ్యాక్స్‌వెల్ (సి) స్టార్క్ (బి) చాహల్ 25, మిల్లర్ (సి) చాహల్ (బి) ఆరోన్ 66, బెయిలీ (సి) పార్థివ్ (బి) ఆల్బీ మోర్కెల్ 1, సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 17, జాన్సన్ (నాటౌట్) 16, అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 2, శివమ్ శర్మ (బి) స్టార్క్ 4, బాలాజీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1-60, 2-68, 3-93, 4-116, 5-170, 6-184, 7-189, 8-193. బౌలింగ్: స్టార్క్ 4-0-43-2, ఆల్బీ మోర్కెల్ 4-0-20-1, ఆరోన్ 4-0-35-1, హర్షల్ పటేల్ 3-0-56-2, చాహల్ 4-0-23-2, యువరాజ్ 1-0-19-0. రాయల్ చాలెంజర్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) సాహా (బి) సందీప్ శర్మ 4, పార్థివ్ (సి) మన్దీప్ (బి) సందీప్ శర్మ 13, కోహ్లి (సి) సాహా (బి) సందీప్ శర్మ 0, రాణా (బి) అక్షర్‌పటేల్ 18, డివిలియర్స్ (సి) అక్షర్ పటేల్ (బి) బాలాజీ 53, యువరాజ్ (సి) సెహ్వాగ్ (బి) శివమ్ శర్మ 3, మోర్కెల్ (సి) బెయిలీ (బి) శివమ్ శర్మ 16, స్టార్క్ (సి) మిల్లర్ (బి) బాలాజీ 29, హర్షల్ పటేల్ (సి) సాహా (బి) జాన్సన్ 6, ఆరోన్ (నాటౌట్) 17, చాహల్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-8, 2-8, 3-26, 4-39, 5-50, 6-76, 7-125, 8-133, 9-153. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-25-3, జాన్సన్ 4-0-25-1, బాలాజీ 3-0-43-2, అక్షర్ పటేల్ 4-0-22-1, శివమ్ శర్మ 4-0-26-2, మ్యాక్స్‌వెల్ 1-0-24-0. -
సొంతగడ్డపై పులిలా...
ఒత్తిడిని జయించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-7లో తొలి విజయం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు చెక్ పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ యూఏఈలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాభవ భారంతో స్వదేశానికి వచ్చిన ముంబై ఇండియన్స్... సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో పులిలా ఆడింది. ముఖ్యంగా ఇన్నాళ్లూ విఫలమైన బ్యాట్స్‌మెన్ తొలిసారి సమష్టిగా కదం తొక్కడంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు తొలి ఓటమిని రుచి చూపించింది. ముంబై: గత ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వాంఖడేలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఈ ఏడాది ఆరంభం బాగోకపోయినా... ముంబైకి రాగానే జట్టుకు పాత రికార్డు ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నాళ్లూ ఆడిన జట్టు ఇదేనా... అని ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా నాణ్యమైన ఆటతీరుతో అదరగొట్టింది. చివరి ఓవర్లలో ఉండే ఒత్తిడిని అధిగమించి ఐపీఎల్-7లో బోణీ చేసింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. పంజాబ్‌కు ఈ సీజన్లో ఇది తొలి ఓటమి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 168 పరుగులు చేసింది. పుజారా (19), సెహ్వాగ్ (1) త్వరగా అవుటైనా... వృద్ధిమాన్ సాహా (47 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో పంజాబ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తనదైన శైలిలో వేగంగా పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో హర్భజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. గౌతమ్ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కోరీ అండర్సన్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో ఒత్తిడి పెరిగినా... పొలార్డ్ (12 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తారే (6 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా రాణించారు. సందీప్ శర్మ, రిషి ధావన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోరీ అండర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జోరు తగ్గినా మంచి స్కోరు ళినాణ్యమైన షాట్లతో పుజారా పంజాబ్‌కు మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ డెరైక్ట్ హిట్‌తో సెహ్వాగ్ రనౌట్ కావడం, పుజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పంజాబ్ తడబడింది. సాహా, మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేయడంతో పరుగుల వేగం తగ్గింది. క్రమంగా వేగం పెంచిన మ్యాక్స్‌వెల్ భారీషాట్‌కు వెళ్లి హర్భజన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సాహా క్రమంగా వేగం పెంచి బౌండరీలతో స్కోరును పరుగులెత్తించాడు. బెయిలీ (15), మిల్లర్ (16) స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. 19వ ఓవర్లో జహీర్ గాయపడ్డా... స్లాగ్ ఓవర్లలో మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వేగంగా ఆడకపోయినా... పంజాబ్ పోరాడగలిగే స్కోరు సాధించింది. ఎట్టకేలకు నిలకడ ళి ముంబై ఓపెనర్ డంక్‌తో పాటు రాయుడును కూడా సందీప్‌శర్మ తన వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో ముంబైకి షాక్ తగిలింది. కానీ ఓపెనర్‌గా వచ్చిన గౌతమ్ అద్భుతంగా ఆడాడు. రోహిత్ కూడా నిలకడగా ఆడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో 49 పరుగులు వచ్చాయి. రోహిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత రిషి ధావన్ బౌలింగ్‌లో గౌతమ్ అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్, అండర్సన్ కలిసి నాలుగో వికెట్‌కు 53 పరుగులు రాబట్టారు. అయితే 14 నుంచి 17వ ఓవర్ వరకు నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే రావడం... రోహిత్, అండర్సన్ అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. ళి మూడు ఓవర్లలో విజయానికి 41 పరుగులు అవసరం కాగా... బాలాజీ వేసిన 18వ ఓవర్లో తారే చెలరేగడంతో 16 పరుగులు వచ్చాయి. జాన్సన్ వేసిన 19వ ఓవర్లో పొలార్డ్ విరుచుకుపడి 20 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో పొలార్డ్ తొలి బంతికే సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: పుజారా (సి) గౌతమ్ (బి) అండర్సన్ 19; సెహ్వాగ్ రనౌట్ 1; సాహా నాటౌట్ 59; మ్యాక్స్‌వెల్ (సి) డంక్ (బి) హర్భజన్ 45; బెయిలీ (సి) అండర్సన్ (బి) హర్భజన్ 15; మిల్లర్ (సి) డంక్ (బి) మలింగ 16; జాన్సన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 6, వైడ్లు 5, నోబాల్ 1) 13; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1-13; 2-24; 3-93; 4-130; 5-165. బౌలింగ్: జహీర్ ఖాన్ 3.3-0-28-0; బుమ్రాహ్ 4-0-25-0; అండర్సన్ 2-0-17-1; మలింగ 4-0-25-1; హర్భజన్ 4-0-34-2; పొలార్డ్ 2.3-0-32-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) సాహా (బి) సందీప్ 5; గౌతమ్ ఎల్బీడబ్ల్యు (బి) ధావన్ 33; రాయుడు ఎల్బీడబ్ల్యు (బి) సందీప్ 8; రోహిత్ (సి) సాహా (బి) బాలాజీ 39; అండర్సన్ (సి) మిల్లర్ (బి) ధావన్ 35; పొలార్డ్ నాటౌట్ 28; తారే నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 3) 6; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 170. వికెట్ల పతనం: 1-6; 2-23; 3-70; 4-123; 5-126. బౌలింగ్: సందీప్ శర్మ 3.1-0-29-2; బాలాజీ 4-0-38-1; జాన్సన్ 4-0-37-0; అక్షర్ పటేల్ 4-0-40-0; రిషి ధావన్ 4-0-23-2. వాంఖడే ‘బ్లూ’మయం అందరికీ విద్య అనే నినాదంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా... శనివారం వాంఖడేలో జరిగిన మ్యాచ్‌కు 19 వేల మంది వీధి బాలలను తీసుకొచ్చారు. వీళ్లతో పాటు ప్రేక్షకులంతా కూడా ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించడంతో... స్టేడియం బ్లూమయమైంది. ఈ పిల్లల కోసం 425 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 2000 మంది వాలంటీర్లు లక్ష ఆహార ప్యాకెట్లను పిల్లలకు పంచారు. ముంబైలోని వివిధ ఎన్జీఓల సహకారంతో గత ఐదేళ్లలో 50వేల మంది వీధి బాలలకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ముంబై జట్టు ఓనర్ నీతా అంబానీ చేపట్టారు.