ఎదురులేని ముంబై | mumbai indians win by 8 wickets | Sakshi
Sakshi News home page

ఎదురులేని ముంబై

Published Fri, Apr 21 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

ఎదురులేని ముంబై

ఎదురులేని ముంబై

వరుసగా ఐదో విజయం
చిత్తుగా ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌
చెలరేగిన బట్లర్, నితీశ్‌ రాణా
ఆమ్లా శతకం వృథా


హషీమ్‌ ఆమ్లా.. పక్కా టెస్టు ఆటగాడు.. అసలు ఇలాంటి ఆటగాడికి ఐపీఎల్‌లో చోటు ఎలా దక్కిందో.. ఇవీ సగటు క్రికెట్‌ అభిమాని అతడిపై చేసే కామెంట్స్‌. అయితే అలాంటి వారికి సమాధానంగా అన్నట్టు పొట్టి ఫార్మాట్‌లోనూ తనదైన క్లాస్‌ ఇన్నింగ్స్‌కు చోటుంటుందని ఈ ఓపెనర్‌ నిరూపించాడు. అతడి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ చూసి ఔరా.. ఆడుతోంది ఆమ్లానేనా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఒక్క సిక్స్‌ కొడితే గ్రేట్‌ అనుకునే తన బ్యాట్‌ నుంచి ఏకంగా ఆరు సిక్సర్లు బుల్లెట్‌ వేగంతో స్టాండ్స్‌ను ముద్దాడగా.. 58 బంతుల్లోనే కెరీర్‌లో తొలి టి20 శతకాన్ని అందుకుని జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. ఇందులో 51 పరుగులు ఒక్క మలింగ బౌలింగ్‌లోనే సాధించడం విశేషం.

అయితే జోస్‌ బట్లర్‌ సంచలన ఇన్నింగ్స్‌కు తోడు పార్థివ్, నితీశ్‌ రాణాల మెరుపు ఆటతో ముంబై ఇండియన్స్‌ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే కింగ్స్‌ ఎలెవన్‌ను చిత్తు చేసి వరుసగా ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై మళ్లీ అగ్రస్థానానికి చేరింది.

ఇండోర్‌: ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 15.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాటు నితీశ్‌ రాణా (34 బంతుల్లో 62 నాటౌట్‌; 7 సిక్సర్లు) టోర్నీలో మూడో అర్ధ సెంచరీ సాధించగా పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 198 పరుగులు చేసింది. హషీమ్‌ ఆమ్లా (60 బంతుల్లో 104 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) టి20 కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మెక్లీనగన్‌కు రెండు, కృనాల్‌.. బుమ్రాలకు చెరో వికెట్‌ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 15.3 ఓవర్లలో రెండు వికెట్లకు 199 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు బట్లర్‌కు దక్కింది. పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి.

ఆమ్లా సూపర్‌ శతకం
సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన షాన్‌ మార్‌‡్ష (21 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఉన్నంతసేపు బౌండరీలతో మెరిశాడు. ఆరో ఓవర్‌లో తను వెనుదిరగ్గా వృద్ధిమాన్‌ సాహా (15 బంతుల్లో 11) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే ఆమ్లా, కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను ఉరకలెత్తించారు. 34 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన మ్యాక్స్‌వెల్‌ మరుసటి ఓవర్‌లో మెక్లీనగన్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 6,6,4,4,6తో రెచ్చిపోవడంతో 28 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్‌లో ఆమ్లా ఒక్కసారిగా జూలు విదిల్చి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి 22 పరుగులు అందించాడు. ఈ రెండు ఓవర్లలోనే జట్టుకు 50 పరుగులు రావడం విశేషం. 17వ ఓవర్‌లో బుమ్రా తన అప్పర్‌ కట్‌తో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్‌ చేసి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడిని  విడదీశాడు. అప్పటికే మూడో వికెట్‌కు 33 బంతుల్లోనే 83 పరుగులు జత చేరాయి. తర్వాత ఓవర్‌లో స్టొయినిస్‌ (1) అవుట్‌ అయినా చివరి ఓవర్‌లో ఆమ్లా వరుసగా రెండు సిక్సర్లు బాది టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తి చేశాడు.

బట్లర్, రాణా తుఫాన్‌ ఇన్నింగ్స్‌
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు సంచలన ఆరంభం లభించింది. ఓపెనర్లు పార్థివ్‌ పటేల్, బట్లర్‌ మెరుపు ఆటతో పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరి ధాటికి పవర్‌ప్లేలో ముంబై తమ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికంగా 82 పరుగులు సాధించింది. ఇందులో ఆరు మాత్రమే డాట్‌ బంతులుండగా.. 14 బౌండరీలు బాదారంటే వీరిద్దరి జోరును అర్థం చేసుకోవచ్చు. స్టొయినిస్‌ వేసిన ఆరో ఓవర్‌లో పార్థివ్‌ వరుసగా 6,4 బాదినా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత బట్లర్‌కు నితీశ్‌ రాణా జత చేరడంతో స్కోరు అదే వేగంతో దూసుకెళ్లింది.

24 బంతుల్లో బట్లర్‌ అర్ధ సెంచరీ చేశాడు. 12వ ఓవర్‌లో రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదగా ఆ తర్వాతి ఓవర్‌లో బట్లర్‌ కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో చేయాల్సిన రన్‌రేట్‌ బాగా తగ్గిపోయింది. అయితే 13వ ఓవర్‌లో బట్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు మోహిత్‌ శర్మ తెరదించడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అప్పటికే మ్యాచ్‌ ముంబై చేతుల్లోకి రావడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. 15వ ఓవర్‌లో రాణా ఓ సిక్సర్‌తో 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేయగా హార్ధిక్‌ పాండ్యా (4 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇదే ఓవర్‌లో వరుసగా 6,4,4 కొట్టడంతో చివరి ఐదు ఓవర్లలో లక్ష్యం 8 పరుగులకు చేరింది. దీంతో మరో 27 బంతులుండగానే ముంబై సునాయాసంగా నెగ్గింది.


ఐపీఎల్‌లో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన. 2014లో రాజస్తాన్‌ రాయల్స్‌పై 190 పరుగులు ఛేదించింది.

ఇన్నింగ్స్‌లో ఒక్క మలింగ బౌలింగ్‌లోనే ఆమ్లా 51 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధికం. గతంలో ఉమేశ్‌ బౌలింగ్‌లో కోహ్లి 52 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో నేడు 
కోల్‌కతా  & గుజరాత్‌
వేదిక: కోల్‌కతా, రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement