సొంతగడ్డపై పులిలా... | IPL 7: Mumbai Indians’ losing streak ends at home | Sakshi
Sakshi News home page

సొంతగడ్డపై పులిలా...

Published Sun, May 4 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

సొంతగడ్డపై పులిలా...

సొంతగడ్డపై పులిలా...

 ఒత్తిడిని జయించిన  ముంబై ఇండియన్స్
 ఐపీఎల్-7లో తొలి విజయం
 పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు చెక్
 పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్
 
 యూఏఈలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాభవ భారంతో స్వదేశానికి వచ్చిన ముంబై ఇండియన్స్... సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో పులిలా  ఆడింది. ముఖ్యంగా ఇన్నాళ్లూ విఫలమైన బ్యాట్స్‌మెన్ తొలిసారి సమష్టిగా కదం తొక్కడంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు తొలి ఓటమిని రుచి చూపించింది.
 
 ముంబై: గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వాంఖడేలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఈ ఏడాది ఆరంభం బాగోకపోయినా... ముంబైకి రాగానే జట్టుకు పాత రికార్డు ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నాళ్లూ ఆడిన జట్టు ఇదేనా... అని ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా నాణ్యమైన ఆటతీరుతో అదరగొట్టింది. చివరి ఓవర్లలో ఉండే ఒత్తిడిని అధిగమించి ఐపీఎల్-7లో బోణీ చేసింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. పంజాబ్‌కు ఈ సీజన్‌లో ఇది తొలి ఓటమి.
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 168 పరుగులు చేసింది. పుజారా (19), సెహ్వాగ్ (1) త్వరగా అవుటైనా... వృద్ధిమాన్ సాహా (47 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో పంజాబ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తనదైన శైలిలో వేగంగా పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో హర్భజన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 
 ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. గౌతమ్ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కోరీ అండర్సన్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో ఒత్తిడి పెరిగినా... పొలార్డ్ (12 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తారే (6 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా రాణించారు.  సందీప్ శర్మ, రిషి ధావన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోరీ అండర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 జోరు తగ్గినా మంచి స్కోరు
 ళినాణ్యమైన షాట్లతో పుజారా పంజాబ్‌కు మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ డెరైక్ట్ హిట్‌తో సెహ్వాగ్ రనౌట్ కావడం, పుజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పంజాబ్ తడబడింది.
 
  సాహా, మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేయడంతో పరుగుల వేగం తగ్గింది. క్రమంగా వేగం పెంచిన మ్యాక్స్‌వెల్ భారీషాట్‌కు వెళ్లి హర్భజన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
 
  సాహా క్రమంగా వేగం పెంచి బౌండరీలతో స్కోరును పరుగులెత్తించాడు. బెయిలీ (15), మిల్లర్ (16) స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. 19వ ఓవర్లో జహీర్ గాయపడ్డా... స్లాగ్ ఓవర్లలో మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వేగంగా ఆడకపోయినా... పంజాబ్ పోరాడగలిగే స్కోరు  సాధించింది.
 
 ఎట్టకేలకు నిలకడ
 ళి ముంబై ఓపెనర్ డంక్‌తో పాటు రాయుడును కూడా సందీప్‌శర్మ తన వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో ముంబైకి షాక్ తగిలింది. కానీ ఓపెనర్‌గా వచ్చిన గౌతమ్ అద్భుతంగా ఆడాడు. రోహిత్ కూడా నిలకడగా ఆడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో 49 పరుగులు వచ్చాయి. రోహిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత రిషి ధావన్ బౌలింగ్‌లో గౌతమ్ అవుటయ్యాడు.  ఆ తర్వాత రోహిత్, అండర్సన్ కలిసి నాలుగో వికెట్‌కు 53 పరుగులు రాబట్టారు. అయితే 14 నుంచి 17వ ఓవర్ వరకు నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే రావడం... రోహిత్, అండర్సన్  అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది.
 
 ళి మూడు ఓవర్లలో విజయానికి 41 పరుగులు అవసరం కాగా... బాలాజీ వేసిన 18వ ఓవర్లో తారే చెలరేగడంతో 16 పరుగులు వచ్చాయి. జాన్సన్ వేసిన 19వ ఓవర్లో పొలార్డ్ విరుచుకుపడి 20 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో పొలార్డ్ తొలి బంతికే సిక్సర్ బాది జట్టును గెలిపించాడు.
 
స్కోరు వివరాలు
 పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: పుజారా (సి) గౌతమ్ (బి) అండర్సన్ 19; సెహ్వాగ్ రనౌట్ 1; సాహా నాటౌట్ 59; మ్యాక్స్‌వెల్ (సి) డంక్ (బి) హర్భజన్ 45; బెయిలీ (సి) అండర్సన్ (బి) హర్భజన్ 15; మిల్లర్ (సి) డంక్ (బి) మలింగ 16; జాన్సన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 6, వైడ్లు 5, నోబాల్ 1) 13; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 168.
 వికెట్ల పతనం: 1-13; 2-24; 3-93; 4-130; 5-165.
 
 బౌలింగ్: జహీర్ ఖాన్ 3.3-0-28-0; బుమ్రాహ్ 4-0-25-0; అండర్సన్ 2-0-17-1; మలింగ 4-0-25-1; హర్భజన్ 4-0-34-2; పొలార్డ్ 2.3-0-32-0.
 
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) సాహా (బి) సందీప్ 5; గౌతమ్ ఎల్బీడబ్ల్యు (బి) ధావన్ 33; రాయుడు ఎల్బీడబ్ల్యు (బి) సందీప్ 8; రోహిత్ (సి) సాహా (బి) బాలాజీ 39; అండర్సన్ (సి) మిల్లర్ (బి) ధావన్ 35; పొలార్డ్ నాటౌట్ 28; తారే నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 3) 6; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 170.
 వికెట్ల పతనం: 1-6; 2-23; 3-70; 4-123; 5-126.
 
 బౌలింగ్: సందీప్ శర్మ 3.1-0-29-2; బాలాజీ 4-0-38-1; జాన్సన్ 4-0-37-0; అక్షర్ పటేల్ 4-0-40-0; రిషి ధావన్ 4-0-23-2.
 
 వాంఖడే ‘బ్లూ’మయం
 అందరికీ విద్య అనే నినాదంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా... శనివారం వాంఖడేలో జరిగిన మ్యాచ్‌కు 19 వేల మంది వీధి బాలలను తీసుకొచ్చారు. వీళ్లతో పాటు ప్రేక్షకులంతా కూడా ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించడంతో... స్టేడియం బ్లూమయమైంది. ఈ పిల్లల కోసం 425 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 2000 మంది వాలంటీర్లు లక్ష ఆహార ప్యాకెట్లను పిల్లలకు పంచారు. ముంబైలోని వివిధ ఎన్‌జీఓల సహకారంతో గత ఐదేళ్లలో 50వేల మంది వీధి బాలలకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ముంబై జట్టు ఓనర్ నీతా అంబానీ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement