‘కింగ్స్’ ఎవరో..! | IPL 7, Qualifier 2: Kings XI Punjab vs Chennai Super Kings | Sakshi
Sakshi News home page

‘కింగ్స్’ ఎవరో..!

Published Fri, May 30 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

‘కింగ్స్’ ఎవరో..!

‘కింగ్స్’ ఎవరో..!

నేడు క్వాలిఫయర్-2
  పంజాబ్‌తో చెన్నై అమీతుమీ
  ప్రతీకారానికి ధోని సేన సిద్ధం
 రాత్రి 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 ఐపీఎల్‌లో లీగ్ దశలో అత్యంత భారీ స్కోర్లు నమోదైన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్లే ప్రత్యర్థులు. పంజాబ్, చెన్నైల మధ్య ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అభిమానులకు కావలసినంత పరుగుల వినోదం. 200 బాదడం ఇంత సులభమా అనేలా ఆ రెండు మ్యాచ్‌లూ జరిగాయి. అయితే ఫలితం మాత్రం రెండుసార్లూ పంజాబ్ ైవె పే వచ్చింది. కానీ ఇప్పుడు జరగబోయేది నాకౌట్ సమరం. ఇక్కడ ఏ మాత్రం తడబడ్డా ఇంటికి చేరాలి. ఒత్తిడిని జయించేవారే అసలైన ‘కింగ్స్’గా నిలబడతారు. నేడు జరిగే క్వాలిఫయర్‌లో గెలిచిన కింగ్స్ జట్టే ఆదివారం కోల్‌కతాతో టైటిల్ కోసం పోరాడుతుంది.
 
 ముంబై: ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటిదాకా అందరికంటే నిలకడగా ఆడిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్... అలాంటి జట్టును ఈ సీజన్‌లో రెండుసార్లు చావు దెబ్బతీసిన జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్... ఈ రెండు జట్ల మధ్య మరో సమరం అంటే అభిమానులకు పండగే. మ్యాక్స్‌వెల్ మళ్లీ గాడిలో పడతాడా? అతడిని స్పిన్నర్ అశ్విన్ ఈసారైనా ఆపుతాడా? చెన్నై జట్టులోని నలుగురు విదేశీ హిట్టర్‌లను పంజాబ్ బౌలర్లు నియంత్రించగలరా? అన్నింటికీ మించి తమను రెండు సార్లు నిరాశపరిచిన బెయిలీ బృందంపై ధోనిసేన ప్రతీకారం తీర్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే నేడు (శుక్రవారం) వాంఖడే మైదానంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌ను వీక్షించాల్సిందే.
 
  లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ జట్టు క్వాలిఫయర్‌లో కోల్‌కతా చేతిలో కంగుతింది. అయితే ఓడినా ఫైనల్‌కు చేరే మరో అవకాశం ఉండటం వల్ల ఆ జట్టు కాస్త ఊరట చెందింది. మరోవైపు ధోని బృందం చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబైని చిత్తుచేసి ఆత్మవిశ్వాసం పెంచుకుంది.
 
 సమష్టిగా ముందుకు..
 చెన్నై జట్టుకు ఈ సీజన్‌లో ఓపెనర్ డ్వేన్ స్మిత్ నుంచి చక్కటి ఆరంభం లభించింది. అత్యధిక పరుగుల జాబితాలో ఇప్పటికే తను రెండో స్థానం (559)లో ఉన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల నుంచి మెకల్లమ్ స్థానంలో ఓపెనింగ్ చేస్తున్న డు ప్లెసిస్ త్వరగానే కుదురుకున్నాడు. ముంబైపై తొలి వికెట్‌కు ఈ జోడి 6.2 ఓవర్లలో 60 పరుగులను జోడించింది. నేటి మ్యాచ్‌లోనూ వీరితోనే ముందుకెళ్లవచ్చు.
 
  ఓవరాల్‌గా వీరి బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. రైనా బుధవారం నాటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మిడిల్‌లో డేవిడ్ హస్సీ, మెకల్లమ్, జడేజా రాణిస్తుండగా ఫినిషింగ్‌లో ధోని తన మార్క్‌ను చాటుకుంటున్నాడు. పేస్ బౌలింగ్ లో మోహిత్ శర్మ నంబర్‌వన్ (పర్పుల్ క్యాప్)గా ఉండగా స్పిన్‌లో అశ్విన్, జడేజా కీలక పాత్ర వ హిస్తున్నారు. కానీ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అశ్విన్ తేలిపోయాడు. మ్యాక్స్‌వెల్ అతడి స్పిన్‌ను తుత్తునియలు చేశాడు. తానుఎదుర్కొన్న 24 బంతుల్లో 64 పరుగులు పిండుకున్నాడు. ఈసారి ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేసి మ్యాక్స్‌ను అడ్డుకుంటానని అశ్విన్ సవాల్ విసిరాడు.
 
 బ్యాటింగే బలం
 విధ్వంసకర బ్యాటింగ్‌కు పంజాబ్ పెట్టింది పేరు. ఇప్పటికే ఈ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులకు ఇష్టుడైన మ్యాక్స్‌వెల్‌తో పాటు డేవిడ్ మిల్లర్, బెయిలీ, యువ సంచలనం మనన్ వోహ్రా, సాహా తమదైన ఆటతీరుతో జట్టుకు విజయాలు సాధించిపెట్టారు. సీనియర్ ఆటగాడు సెహ్వాగ్ కూడా జట్టుకు సహాయపడుతున్నాడు. ఇదంతా ఓవైపు.. కోల్‌కతాతో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 164 పరుగుల టార్గెట్‌ను కూడా ఛేదించకపోవడం వీరిని ఆందోళనలో పడేస్తోంది.
 
 మ్యాక్స్, మిల్లర్ విఫలమవడం జట్టును దెబ్బతీసింది. లోపాలను సరిదిద్దుకుని చెన్నైపై ఎప్పటిలాగే చెలరేగాలని బ్యాటింగ్ విభాగం ప్రణాళిక రచిస్తోంది. మిచెల్ జాన్సన్ మినహా స్టార్ బౌలర్ లేని ఈ జట్టు బౌలింగ్ విభాగం ఆశ్చర్యకరంగా లీగ్‌లో ప్రత్యర్థికి కొరకరాని విధంగా మారింది. సందీప్ శర్మ (17 వికెట్లు), స్పిన్నర్ అక్షర్ పటేల్ (16), బాలాజీ (12) ఆకట్టుకుంటున్నారు. కోల్‌కతాపై సందీప్, బాలాజీలకు విశ్రాంతినిచ్చినా ఈ మ్యాచ్‌లో వారిని ఆడించనున్నారు. ఆరంభంలోనే చెన్నై వికెట్లు తీసి ఒత్తిడి పెంచితేనే మ్యాచ్‌పై పంజాబ్ ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది.
 ఆ రెండు మ్యాచ్‌లు..
 ఐపీఎల్-7లో చెన్నై, పంజాబ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు అభిమానులకు కనుల పండుగగా నిలిచాయి. పరుగులు వరదలా పారిన ఈ మ్యాచ్‌లో చెన్నైకి అడ్డుగా నిలబడింది మ్యాక్స్‌వెల్ విధ్వసంకర ఆటతీరే. ఓసారి ఆ మ్యాచ్‌లను గుర్తుకు తెచ్చుకుంటే...
 
 అబుదాబిలో జరిగిన వీరి తొలి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై... స్మిత్ (43 బంతుల్లో 66; 6 ఫోర్లు; 3 సిక్సర్లు), మెకల్లమ్ (45 బంతుల్లో 67; 4 ఫోర్లు; 5 సిక్సర్లు) ఆటతీరుతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలుపు ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు.
 
 అయితే అనూహ్యమైన ఆటతీరుతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 43 బంతుల్లో 95 పరుగులు (15 ఫోర్లు; 2 సిక్సర్లు) చేసి ధోని సేనకు షాకిచ్చాడు. తను అవుటయ్యాక మ్యాచ్ చెన్నై వైపు మొగ్గుచూపినా మిల్లర్ (37 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఏడు బంతులుండగానే పంజాబ్ మ్యాచ్‌ను గెలుచుకుంది.
 ఇక కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పరిస్థితి మరీ ఘోరం.
 
 ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంట్లోనూ మ్యాక్స్‌వెల్ హీరోగా నిలిచాడు. ఈసారి 38 బంతుల్లోనే 90 పరుగులు (6 ఫోర్లు; 8 సిక్సర్లు) చేసి జట్టు భారీ స్కోరులో భాగస్వామి అయ్యాడు. బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. బదులుగా చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 187 పరుగులకే చేతులెత్తేసింది. డుప్లెసిస్ (25 బంతుల్లో 52; 7 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే ఆకట్టుకున్నాడు.
 
 6 చెన్నై గెలిస్తే ఫైనల్‌కు వెళ్లడం ఆరోసారి
 
 1 పంజాబ్ ఫైనల్‌కు వెళితే ఇదే తొలిసారి
 
 జట్లు (అంచనా):
 చెన్నై: ధోని (కెప్టెన్), స్మిత్, డు ప్లెసిస్, రైనా, మెకల్లమ్, హస్సీ, జడేజా, అశ్విన్, మోహిత్, పాండే, నెహ్రా.
 
 పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, అక్షర్, ధావన్, జాన్సన్, సందీప్, బాలాజీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement