లయన్స్‌పై ‘పంజా’బ్
►26 పరుగులతో కింగ్స్ ఎలెవన్ విజయం
►హషీమ్ ఆమ్లా అర్ధ సెంచరీ
►దినేశ్ కార్తీక్ ఒంటరి పోరాటం
రాజ్‌కోట్: వరుసగా నాలుగు ఓటముల అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోలుకుంది. ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 26 పరుగుల తేడాతో నెగ్గింది. హషీమ్ ఆమ్లా (40 బంతుల్లో 65; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో అర్ధ సెంచరీతో చెలరేగగా... అక్షర్ పటేల్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ మెరుపులతో అలరించాడు. సొంత వేదికపై లయన్స్ జట్టుకిది వరుసగా రెండో ఓటమి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ రైనా (24 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. కరియప్ప, అక్షర్, సందీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆమ్లా జోరు...: కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పేసర్ నాథూ సింగ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ వోహ్రా (2)ను అవుట్ చేశాడు. ఈ క్యాచ్‌ను అందుకున్న దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లో వంద మందిని అవుట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. నాథూ తన రెండో ఓవర్‌లో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వగలిగాడు. ఆరో ఓవర్‌లో ఆమ్లా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 50 పరుగులు చేయగలిగింది. ఇదే జోరుతో 30 బంతుల్లో ఆమ్లా మరో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు వరుసగా సిక్స్, ఫోర్ బాది జోరు మీదున్న మార్‌ను టై దెబ్బతీశాడు. 14వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ రెండు సిక్సర్లతో విరుచుకుపడినా అదే ఓవర్‌లో ఆమ్లా అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మ్యాక్స్ కూడా పెవిలియన్‌కు చేరాడు.19వ ఓవర్‌లోఅక్షర్ రెండు సిక్సర్లు, ఫోర్‌తో రెచ్చిపోయి అదే ఓవర్‌లో అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రావడంతో పంజాబ్ మంచి స్కోరు చేసింది.
లయన్స్ తడబాటు: లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ జట్టులో దినేశ్ కార్తీక్ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. తొలి ఓవర్‌లోనే మెకల్లమ్ (6) అవుటవ్వడంతోపాటు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. రైనా వేగంగా ఆడే ప్రయత్నంలో బౌండరీ లైన్ దగ్గర మ్యాక్స్‌వెల్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా (9), డ్వేన్ స్మిత్ (4), అక్షదీప్ వరుస ఓవర్లలో అవుట్ కాగా... అటు రన్‌రేట్ కూడా భారీగా పెరిగిపోవడంతో లయన్స్ కోలుకోలేకపోయింది. మరోవైపు గాయం కారణంగా లయన్స్ జట్టు సభ్యుడు డ్వేన్ బ్రేవో ఐపీఎల్–10 నుంచి వైదొలిగాడు.