ఈసారి మిల్లర్... | David Miller Blitz Lights Up Clash Between Punjab and Bangalore | Sakshi
Sakshi News home page

ఈసారి మిల్లర్...

Published Sat, May 10 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

ఈసారి మిల్లర్...

ఈసారి మిల్లర్...

మిల్లర్
 29 బంతుల్లో 66
 8 ఫోర్లు, 3 సిక్సర్లు
 
 మ్యాక్స్‌వెల్‌ను మరిపిస్తూ విజృంభణ
 బంతితో బెంబేలెత్తించిన సందీప్ శర్మ
 అరంగేట్రంలోనే రాణించిన శివమ్ శర్మ
 పంజాబ్ చేతిలో మళ్లీ చిత్తయిన బెంగళూరు
 ప్లే ఆఫ్‌కు కింగ్స్ ఎలెవన్!
 
 ఒకరు కాకపోతే ఒకరు... మ్యాక్స్‌వెల్ కాకపోతే మిల్లర్... టి20 క్రికెట్‌లో హిట్టింగ్‌కు పరాకాష్ట. సిక్సర్లు కొట్టడం అంటే మంచినీళ్లు తాగడమే అనుకుంటున్నారు. మరోసారీ అదే జోరు... మ్యాక్స్‌వెల్ ఉన్నంత సేపు ఫటఫట్‌లాడిస్తే... మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీళ్లకు తోడు బౌలర్ సందీప్ శర్మ... ఈసారి కూడా కోహ్లి, గేల్‌లను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఫలితం... పంజాబ్ హోరులో రాయల్ చాలెంజర్స్ కొట్టుకుపోయింది.
 
 బెంగళూరు: క్రిస్ గేల్, కోహ్లి వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే ఔట్ చేయడమన్నది ఏ బౌలర్‌కైనా ఓ కల లాంటిదే. మరి వీరిద్దరినీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఒకే ఓవర్లో అవుట్ చేస్తే... అది కూడా ఒకే సీజన్‌లో జరిగితే... కచ్చితంగా అది అద్భుతమే. పంజాబ్ యువ పేసర్ సందీప్ శర్మ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్‌లో బెంగళూరుతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లోనూ గేల్, కోహ్లిలను ఒకే ఓవర్లో డగౌట్‌కు పంపించి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
 

తొలుత బ్యాట్స్‌మెన్ చెలరేగి పంజాబ్‌కు భారీస్కోరును అందిస్తే... ఆ తరువాత బౌలర్లు అంతకుమించిన విజృంభణతో బెంగళూరును కుప్పకూల్చారు. ఫలితంగా పంజాబ్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మిల్లర్ (29 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు తోడు సెహ్వాగ్ (24 బంతుల్లో 30; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించారు.

అనంతరం భారీ లక్ష్యఛేదనలో విఫలమైన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. సందీప్ శర్మ (3/25) మూడు వికెట్లతో టాప్ ఆర్డర్‌ను కూల్చగా, బాలాజీ, శివమ్ శర్మ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. డివిలియర్స్ (26 బంతుల్లో 53; 1 ఫోర్, 5 సిక్స్‌లు) , స్టార్క్ (23 బంతుల్లో 29)లు మాత్రమే పోరాడారు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన యువ స్పిన్నర్ శివమ్‌శర్మ ఆకట్టుకున్నాడు. సందీప్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రస్తుతం 16 పాయింట్లు తమ ఖాతాలో జమ చేసుకున్న పంజాబ్... ఇక ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించినట్లే.
 
 మిల్లర్ మెరుపులు
 పంజాబ్‌కు ఎప్పటిలాగే సెహ్వాగ్ శుభారంభాన్నిచ్చాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. ఇదే ఊపులో ఓవర్‌కో ఫోర్ చొప్పున సాధిస్తూ మన్‌దీప్ (21)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవర్‌లో మన్‌దీప్ ఔటైనా.. పవర్ ప్లేలో పంజాబ్‌కు 64 పరుగులు లభించాయి. ఆ వెంటనే యజువేంద్ర చాహల్ బౌలింగ్‌కు వస్తూనే సెహ్వాగ్‌ను ఔట్ చేశాడు.
 
 ఈ దశలో తొలి బంతినే బౌండరీకి తరలించిన విధ్వంసక బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్.. యువరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. అయితే చాహల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద స్టార్క్ చేతికి చిక్కాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ను తొందరగా ఔట్ చేశామన్న ఆనందం బెంగళూరుకు ఎంతో సేపు మిగలలేదు. ఈసారి డేవిడ్ మిల్లర్ ఏకంగా సునామీనే సృష్టించాడు. ఆరోన్ వేసిన పదో ఓవర్లో మూడు ఫోర్లతో తన విజృంభణ ప్రారంభించాడు. స్టార్క్ వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో మూడు ఫోర్లు సాధించాడు.
 
 రెండు ఓవర్లపాటు చాహల్, ఆల్బీ మోర్కెల్‌లు కట్టడి చేసినా.. 16వ ఓవర్లో మిల్లర్ మళ్లీ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ సాధించి హర్షల్ పటేల్‌కు చుక్కలు చూపించాడు. సాహా కూడా ఓ సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు నమోదయ్యాయి. అయితే మిల్లర్, సాహాలు వరుస ఓవర్లలో ఔట్ కావడం, చివరి ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో పంజాబ్ జోరు కాస్త తగ్గింది.
 
 సందీప్ మ్యాజిక్..
 కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు మళ్లీ సందీప్‌శర్మ దెబ్బకు విలవిల్లాడింది. తన రెండో ఓవర్ తొలి బంతికే కీపర్ క్యాచ్ ద్వారా ప్రమాదకర గేల్ (4)ను వెనక్కిపంపిన సందీప్.. మరుసటి బంతికే కోహ్లి (0)నీ అదేవిధంగా ఔట్ చేసి బెంగళూరును కోలుకోలేని దెబ్బతీశాడు. సచిన్ రాణా.. హ్యాట్రిక్‌ను నిరాకరించినా, తిరిగి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పార్థివ్ (13)నూ డగౌట్‌కు చేర్చి సందీప్ మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఆ వెంటనే రాణా (18)ను హర్హల్ పటేల్ ఔట్ చేయడం, యువరాజ్ (3) ఎప్పటిలాగే ఇలా వచ్చి అలా వెళ్లడంతో రాయల్ చాలెంజర్స్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రెండు సిక్స్‌లతో మెరుపులు మెరిపించిన ఆల్బీ మోర్కెల్ (16) కూడా వెంటనే వెనుదిరిగాడు.
 
మరోవైపు డివిలియర్స్ భారీసిక్సర్లతో విరుచుకుపడ్డాడు.అతనికి స్టార్క్ నుంచి చక్కని సహకారం లభించడంతో ఇద్దరూ కలిసి ఏదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే లక్ష్యానికి దూరం పెరిగిపోతుండడంతో మరో షాట్ కోసం ప్రయత్నించి డివిలియర్స్ ఔటయ్యాడు. 125 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన బెంగళూరు మళ్లీ కోలుకోలేదు.
 
 స్కోరు వివరాలు
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కోహ్లి (బి) చాహల్ 30, మన్‌దీప్‌సింగ్ (సి) ఆల్బీ మోర్కెల్ (బి) హర్షల్ పటేల్ 21, మ్యాక్స్‌వెల్ (సి) స్టార్క్ (బి) చాహల్ 25, మిల్లర్ (సి) చాహల్ (బి) ఆరోన్ 66, బెయిలీ (సి) పార్థివ్ (బి) ఆల్బీ మోర్కెల్ 1, సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 17, జాన్సన్ (నాటౌట్) 16, అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 2, శివమ్ శర్మ (బి) స్టార్క్ 4, బాలాజీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 198.
 వికెట్ల పతనం: 1-60, 2-68, 3-93, 4-116, 5-170, 6-184, 7-189, 8-193.
 బౌలింగ్: స్టార్క్ 4-0-43-2, ఆల్బీ మోర్కెల్ 4-0-20-1, ఆరోన్ 4-0-35-1, హర్షల్ పటేల్ 3-0-56-2, చాహల్ 4-0-23-2, యువరాజ్ 1-0-19-0.
 
రాయల్ చాలెంజర్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) సాహా (బి) సందీప్ శర్మ 4, పార్థివ్ (సి) మన్‌దీప్ (బి) సందీప్ శర్మ 13, కోహ్లి (సి) సాహా (బి) సందీప్ శర్మ 0, రాణా (బి) అక్షర్‌పటేల్ 18, డివిలియర్స్ (సి) అక్షర్ పటేల్ (బి) బాలాజీ 53, యువరాజ్ (సి) సెహ్వాగ్ (బి) శివమ్ శర్మ 3, మోర్కెల్ (సి) బెయిలీ (బి) శివమ్ శర్మ 16, స్టార్క్ (సి) మిల్లర్ (బి) బాలాజీ 29, హర్షల్ పటేల్ (సి) సాహా (బి) జాన్సన్ 6, ఆరోన్ (నాటౌట్) 17, చాహల్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 166.
 
వికెట్ల పతనం: 1-8, 2-8, 3-26, 4-39, 5-50, 6-76, 7-125, 8-133, 9-153.
 బౌలింగ్: సందీప్ శర్మ 4-0-25-3, జాన్సన్ 4-0-25-1, బాలాజీ 3-0-43-2, అక్షర్ పటేల్ 4-0-22-1, శివమ్ శర్మ 4-0-26-2, మ్యాక్స్‌వెల్ 1-0-24-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement