T 20 cricket
-
ఆస్ట్రేలియాకు అన్ని అస్త్రాలతో...
సాక్షి క్రీడా విభాగం గత ఏడాది కాలంగా టి20 క్రికెట్లో భారత తుది జట్టు ఎంపిక, ప్రయోగాలు చూస్తే వరల్డ్‌కప్ టీమ్ ఎలా ఉండనుందనే అంచనా వచ్చేస్తుంది. 2021 ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత టీమ్ ఆలోచనాధోరణిలో మార్పు తెచ్చే ప్రయత్నం జరిగింది. గెలిచినా, ఓడినా ప్రయోగాలు చేయడం ఖాయమని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టంగా చెప్పాడు. గత వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా 29 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో 22 గెలిచి, 6 మాత్రమే ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇందులో న్యూజిలాండ్, వెస్టిండీస్ (2 సార్లు), ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై సిరీస్ విజయాలు ఉన్నాయి. ఆసియా కప్‌లో అనూహ్యంగా ఫైనల్ చేరడంలో జట్టు విఫలమైంది. ఈ అన్ని సిరీస్‌లను చూస్తే కీలక ఆటగాళ్ల విశ్రాంతితో పాటు వరల్డ్‌కప్ కోసం ఒక ప్రయత్నం చేసినట్లుగా యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం కూడా స్పష్టంగా కనిపించింది. దాని ప్రకారమే జట్టు ఎంపిక జరిగింది. అందుకే హుడా! జట్టులో దీపక్ హుడా ఎంపికపై కొంత చర్చ జరుగుతోంది. అయితే శ్రేయస్ అయ్యర్‌తో పోలిస్తే బౌలింగ్ కూడా చేయగల నైపుణ్యం ఉండటం హుడా అవకాశాలను పెంచింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా గాయంతో దూరం కావడంతో హుడాకు ప్రాధాన్యత లభించింది. జడేజా తరహాలోనే లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నా... హుడా మెరుగైన బ్యాటింగ్‌కే మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఇవ్వడం ఆసియా కప్‌లో కనిపించింది. గత కొంత కాలంగా ‘ఫినిషర్’ అంటూ ప్రోత్సహిస్తూ వచ్చిన దినేశ్ కార్తీక్‌కు సహజంగానే టీమ్‌లో చోటు లభించింది. ఐపీఎల్ స్థాయిలో అద్భుతాలు చేయకపోయినా, తనకు అవకాశం ఇచ్చిన ప్రతీసారి కార్తీక్ తన విలువను చూపించగలిగాడు. తరోబాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో భారత్ స్కోరు 127/5గా ఉంటే... 19 బంతుల్లో 41 పరుగులు చేసి కార్తీక్ స్కోరును 190 పరుగులకు చేర్చడం అతని పాత్ర ఏమిటో స్పష్టంగా చూపించింది. మరో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. నిజానికి అతని ప్రదర్శన గొప్పగా ఉండటం లేదు కానీ రోహిత్ దీనిపై వివరణ ఇచ్చాడు. టాప్–6లో ఒక్క ఎడంచేతి వాటం బ్యాటర్ కూడా లేకపోవడం వల్ల పంత్‌కు అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడూ టీమ్‌లో అలాంటి బ్యాటర్ అవసరం ఉంది కాబట్టి పంత్‌ను కాదనలేని పరిస్థితి. షమీ వస్తాడా! ప్రస్తుతానికి వరల్డ్‌కప్ స్టాండ్‌బైగానే మొహమ్మద్ షమీ ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఆడించి బీసీసీఐ అతని తాజా ఆటను పరిశీలించాలని భావిస్తోంది. గత వరల్డ్‌కప్ తర్వాత ఒక్క టి20 మ్యాచ్ ఆడకపోయినా అనుభవంతో పాటు పదునైన పేస్ కారణంగా షమీ వైపు సెలక్టర్లు చూశారు. అందుబాటులో ఉన్న పేసర్లలో ఉమ్రాన్, అవేశ్ ఖాన్ విఫలం కాగా, ప్రసిధ్ కృష్ణ గాయపడ్డాడు. భువనేశ్వర్, హర్షల్ పటేల్ దాదాపు ఒకే తరహా బౌలర్లు కాగా, ఆసీస్ గడ్డపై బౌన్స్‌పై రాణించే ‘హిట్ ద డెక్’ తరహా ఫాస్ట్ బౌలర్ అవసరం జట్టుకు ఉంది. దాంతో మళ్లీ చూపు షమీపై పడింది. జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబర్ 23 వరకు సమయం ఉండటంతో ఏదైనా జరగొచ్చు. అశ్విన్ ఎంపికపై కూడా సందేహాలు మొదలయ్యాయి. అయితే వరల్డ్కప్లాంటి ఈవెంట్లో అనుభవం ఏ దశలోనైనా పనికొస్తుంది. రవి బిష్ణోయ్‌తో పోలిస్తే అదే అశ్విన్‌కు అనుకూలించింది. పైగా ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉంటే ఆఫ్‌స్టంప్ నుంచి బయటకు వెళ్లే అశ్విన్ బంతి ప్రమాదకారి కాగలదు. ఈ నేపథ్యంలో అతనికి మరో వరల్డ్‌కప్ అవకాశం వచ్చింది. మిగతా ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎలాంటి చర్చకు తావు లేని చోట ఈ జట్టు ప్రపంచకప్‌లో సత్తా చాటగలదని ఆశించవచ్చు. 2007లో తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆరు మెగా టోర్నీలు జరిగినా టీమిండియాకు కలిసి రాలేదు. మొదటి ప్రపంచకప్ తర్వాతే ఐపీఎల్ వచ్చి అద్భుతాలు చేసినా, మెరుపులాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చినా విశ్వ వేదికపై మాత్రం భారత్‌కు మళ్లీ ట్రోఫీ దక్కలేదు. 2021 టోర్నీలో సెమీస్ కూడా చేరడంలో విఫలమైన భారత బృందం ఏడాది లోపే కొత్త కెప్టెన్ నాయకత్వంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టి20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించిన జట్టు ఎంపిక ఏ రకంగా ఉంది? ఈ బృందం అభిమానుల ఆశలు, అంచనాలు నిలబెట్టగలదా! -
కెప్టెన్సీ విషయంలో హిట్ వికెట్ అయిన కోహ్లీ
-
మరో గెలుపుపై గురి
ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికాతో తొలి టి20లో రికార్డు ఛేదనతో అదరగొట్టిన భారత మహిళల జట్టు శుక్రవారం ఇక్కడ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తిలతో పాటు కొత్తమ్మాయి జెమీమా రోడ్రిగ్స్ కూడా రాణించడంతో మొదటి మ్యాచ్‌లో మన జట్టు ఏడు వికెట్లతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో భారత్ ముందంజ వేస్తుంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఓపెనర్ స్మృతి మంధాన కూడా సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. ఆఫ్ స్పిన్నర్ అనూజ పాటిల్ గత మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఎక్కువగా కెప్టెన్ నికెర్క్ పైనే ఆధారపడుతోంది. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మెరుగైతే తప్ప భారత్‌ను ఓడించలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఈసీడీజీ జట్లకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) హైదరాబాద్ జట్లు సీనియర్, జూనియర్ స్థాయిలో టైటిళ్లు సాధించాయి. సీనియర్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 3 పరుగులతో కేఐఓసీ బెంగళూరుపై విజయం సాధించింది. తొలుత ఈసీడీజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ (43), ఉస్మాన్ (37), నదీమ్ (29) రాణించారు. అనంతరం కేఐఓసీ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి ఓడింది. ఈసీడీజీ బౌలర్లలో అభినవ్, నదీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జూనియర్ జట్టు తొమ్మిది వికెట్లతో కేఐఓసీ బెంగళూరు జూనియర్స్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేఐఓసీ బెంగళూరు జట్టు 19 ఓవర్లలో 97 పరుగులు చేసి ఆలౌటైంది. రాహిల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఈసీడీజీ జట్టు 10.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగులు చేసి గెలుపొందింది. యశ్ మిశ్రా (58 నాటౌట్), రోనక్ (30 నాటౌట్) రాణించారు. జూనియర్ విభాగంలో అద్భుత ప్రతిభ చాటిన యశ్ మిశ్రాకు బెస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ట్రోఫీ దక్కింది. సీనియర్ విభాగంలో.. అభినవ్‌కు బెస్ట్ ఆల్‌రౌండర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు దక్కాయి. -
టీ20 మ్యాచ్‌లు ఉన్నాయంటే చాలు...
క్రికెట్ అంటే ఒకప్పుడు ప్యాషన్.. ఇప్పుడు వ్యసనం.! ప్రధానంగా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయంటే చాలు బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిలో ముఖ్యంగా యువతనే ఉంటోంది. ఎక్కడపడితే అక్కడే అడ్డాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బంతిబంతికి పందెం కాస్తూ రూ.వేలల్లో పోగొట్టుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగా చితికిపోతున్నారు. పోలీసులు కూడా వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా బెట్టింగ్ సాగుతోంది. కామారెడ్డి క్రైం: ప్రస్తుతం క్రికెట్ అంటే ఏస్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ప్రధానంగా యువతలోనే క్రికెట్ మోజు వెర్రివెతలు వేస్తోంది. ఆటను ఆటలా చూడలేకపోతున్నారు. యువత బెట్టింగ్ మోజులో పడి పెడదారులు తొక్కుతున్నారు. టీ20 క్రికెట్ మొదలైందంటే చాలు బెట్టింగ్ మాయలో పడి వేలల్లో నష్టపోతున్నారు. చిన్న వయసులో ఎంతోమందికి ఇదొక వ్యసనంగా మారుతోంది. ఈ చర్య ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు క్రికెట్ మాచ్ ఉందంటే టీవీల ముందు బైఠాయించి ఇంటికే పరిమితమయ్యేవారు. బెట్టింగ్‌ల కారణంగా ఇటీవలి కాలంలో అందరూ ప్రత్యేక అడ్డాలు వెతుక్కుంటున్నారు. ఎక్కడపడితే అక్కడే పందాలు కాస్తున్నారు. దీంతో కొందరు యువకులు అప్పులబారిన పడుతున్న సందర్భాలున్నాయి. క్రికెట్‌పై యువతలో ఉన్న మోజును కొందరు నిర్వాహకులు తప్పుడు మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇటీవల క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయినా కామారెడ్డిలో పదుల సంఖ్యలో బెట్టింగ్ బృందాలున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్ వంటి పట్టణాలు, మండలాల్లోని యువతకు బెట్టింగ్ నిర్వాహకులు గాలం వేస్తున్నారు. అలాంటివారిపై పోలీసు శాఖ నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిఘా పెంచాల్సిందే.. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్తో కలిగే నష్టాలపై సరైన అవగాహన లేక యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆర్థికంగా సమస్య లు తలెత్తితే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నా రు. బెట్టింగ్ కారణంగా భవిష్యత్తును పాడు చేసుకో కుండా ఉండాలంటే వారికి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. బంతి బంతికి బెట్టింగ్.. బెట్టింగ్ వ్యవహారం రకరకాలుగా సాగుతోంది. టీవీలో వచ్చే మ్యాచ్‌లో ఈరోజు ఎవరు గెలుసారో అనేది మాత్రమే కాకుండా, బంతిబంతికి ఏం జరుగుతుందో అనే విషయంపై బెట్టింగ్ చేస్తున్నారు. బెట్టింగ్ ముఠాలే కాకుండా చాలాచోట్ల యువకులు తామే స్వయంగా గ్రూప్‌గా ఏర్పడి పందాలు కాస్తున్నారు. ఇది వరకు బెట్టింగ్ నిర్వహించడం అంటే ప్రత్యేకంగా అడ్డాలు ఉండేవి. ఇటీవలి కాలంలో ఎక్కడి పడితే అక్కడే బృందాలుగా కూర్చుని ఫోన్ల ద్వారా నిర్వాహకులతో మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 7న జరిగిన భారత్–న్యూజిల్యాండ్ టీ20 మ్యాచ్‌పై కూడా జోరుగా బెట్టింగ్ సాగినట్లు సమాచారం. నష్టపోతున్న యువత... జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గతంలో బెట్టింగ్‌లో పాల్గొని నష్టపోయిన ఓ యువకుడు అప్పులు బారిన పడి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు ఆయా గ్రామాల్లో మరెన్నో చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్ కోసం ఇండ్లు, హోటళ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాల్లో అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ బెట్టింగ్ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పలుసార్లు పోలీసులు దాడులు చేయగా జిల్లా కేంద్రంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో టీ20 క్రికెట్ మ్యాచ్‌లు వచ్చే సమయాల్లో క్రికెట్ ఛానళ్లను పెట్టడం లేదు. -
టి20 కూడా ఇంగ్లండ్‌దే
న్యూజిలాండ్‌పై 56 పరుగుల విజయం మాంచెస్టర్ : యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన మోర్గాన్ సేన... ఏకైక టి20లోనూ మెకల్లమ్ బృందాన్ని మట్టికరిపించింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగులతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతున్న జో రూట్ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. స్టోక్స్ (24 నాటౌట్), హేల్స్ (27) రాణించారు. కివీస్ బౌలర్లలో శాంటర్, మెక్లీనగన్ రెండేసి వికెట్లు తీశారు. న్యూజిలాండ్ జట్టు 16.2 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. విలియమ్సన్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), బ్రెండన్ మెకల్లమ్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. 46 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున తొలి అంతర్జాతీయ టి20 ఆడిన విల్లీ, వుడ్ మూడేసి వికెట్లు తీశారు. రూట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఈసారి మిల్లర్...
మిల్లర్ 29 బంతుల్లో 66 8 ఫోర్లు, 3 సిక్సర్లు మ్యాక్స్‌వెల్‌ను మరిపిస్తూ విజృంభణ బంతితో బెంబేలెత్తించిన సందీప్ శర్మ అరంగేట్రంలోనే రాణించిన శివమ్ శర్మ పంజాబ్ చేతిలో మళ్లీ చిత్తయిన బెంగళూరు ప్లే ఆఫ్‌కు కింగ్స్ ఎలెవన్! ఒకరు కాకపోతే ఒకరు... మ్యాక్స్‌వెల్ కాకపోతే మిల్లర్... టి20 క్రికెట్లో హిట్టింగ్‌కు పరాకాష్ట. సిక్సర్లు కొట్టడం అంటే మంచినీళ్లు తాగడమే అనుకుంటున్నారు. మరోసారీ అదే జోరు... మ్యాక్స్‌వెల్ ఉన్నంత సేపు ఫటఫట్లాడిస్తే... మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీళ్లకు తోడు బౌలర్ సందీప్ శర్మ... ఈసారి కూడా కోహ్లి, గేల్‌లను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఫలితం... పంజాబ్ హోరులో రాయల్ చాలెంజర్స్ కొట్టుకుపోయింది. బెంగళూరు: క్రిస్ గేల్, కోహ్లి వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే ఔట్ చేయడమన్నది ఏ బౌలర్‌కైనా ఓ కల లాంటిదే. మరి వీరిద్దరినీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఒకే ఓవర్లో అవుట్ చేస్తే... అది కూడా ఒకే సీజన్లో జరిగితే... కచ్చితంగా అది అద్భుతమే. పంజాబ్ యువ పేసర్ సందీప్ శర్మ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్లో బెంగళూరుతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లోనూ గేల్, కోహ్లిలను ఒకే ఓవర్లో డగౌట్‌కు పంపించి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్స్‌మెన్ చెలరేగి పంజాబ్‌కు భారీస్కోరును అందిస్తే... ఆ తరువాత బౌలర్లు అంతకుమించిన విజృంభణతో బెంగళూరును కుప్పకూల్చారు. ఫలితంగా పంజాబ్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మిల్లర్ (29 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు తోడు సెహ్వాగ్ (24 బంతుల్లో 30; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో విఫలమైన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. సందీప్ శర్మ (3/25) మూడు వికెట్లతో టాప్ ఆర్డర్‌ను కూల్చగా, బాలాజీ, శివమ్ శర్మ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. డివిలియర్స్ (26 బంతుల్లో 53; 1 ఫోర్, 5 సిక్స్‌లు) , స్టార్క్ (23 బంతుల్లో 29)లు మాత్రమే పోరాడారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన యువ స్పిన్నర్ శివమ్శర్మ ఆకట్టుకున్నాడు. సందీప్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రస్తుతం 16 పాయింట్లు తమ ఖాతాలో జమ చేసుకున్న పంజాబ్... ఇక ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించినట్లే. మిల్లర్ మెరుపులు పంజాబ్‌కు ఎప్పటిలాగే సెహ్వాగ్ శుభారంభాన్నిచ్చాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. ఇదే ఊపులో ఓవర్‌కో ఫోర్ చొప్పున సాధిస్తూ మన్దీప్ (21)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో మన్దీప్ ఔటైనా.. పవర్ ప్లేలో పంజాబ్‌కు 64 పరుగులు లభించాయి. ఆ వెంటనే యజువేంద్ర చాహల్ బౌలింగ్‌కు వస్తూనే సెహ్వాగ్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో తొలి బంతినే బౌండరీకి తరలించిన విధ్వంసక బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్.. యువరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. అయితే చాహల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద స్టార్క్ చేతికి చిక్కాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ను తొందరగా ఔట్ చేశామన్న ఆనందం బెంగళూరుకు ఎంతో సేపు మిగలలేదు. ఈసారి డేవిడ్ మిల్లర్ ఏకంగా సునామీనే సృష్టించాడు. ఆరోన్ వేసిన పదో ఓవర్లో మూడు ఫోర్లతో తన విజృంభణ ప్రారంభించాడు. స్టార్క్ వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో మూడు ఫోర్లు సాధించాడు. రెండు ఓవర్లపాటు చాహల్, ఆల్బీ మోర్కెల్‌లు కట్టడి చేసినా.. 16వ ఓవర్లో మిల్లర్ మళ్లీ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ సాధించి హర్షల్ పటేల్‌కు చుక్కలు చూపించాడు. సాహా కూడా ఓ సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు నమోదయ్యాయి. అయితే మిల్లర్, సాహాలు వరుస ఓవర్లలో ఔట్ కావడం, చివరి ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో పంజాబ్ జోరు కాస్త తగ్గింది. సందీప్ మ్యాజిక్.. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు మళ్లీ సందీప్‌శర్మ దెబ్బకు విలవిల్లాడింది. తన రెండో ఓవర్ తొలి బంతికే కీపర్ క్యాచ్ ద్వారా ప్రమాదకర గేల్ (4)ను వెనక్కిపంపిన సందీప్.. మరుసటి బంతికే కోహ్లి (0)నీ అదేవిధంగా ఔట్ చేసి బెంగళూరును కోలుకోలేని దెబ్బతీశాడు. సచిన్ రాణా.. హ్యాట్రిక్‌ను నిరాకరించినా, తిరిగి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పార్థివ్ (13)నూ డగౌట్‌కు చేర్చి సందీప్ మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే రాణా (18)ను హర్హల్ పటేల్ ఔట్ చేయడం, యువరాజ్ (3) ఎప్పటిలాగే ఇలా వచ్చి అలా వెళ్లడంతో రాయల్ చాలెంజర్స్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రెండు సిక్స్‌లతో మెరుపులు మెరిపించిన ఆల్బీ మోర్కెల్ (16) కూడా వెంటనే వెనుదిరిగాడు. మరోవైపు డివిలియర్స్ భారీసిక్సర్లతో విరుచుకుపడ్డాడు.అతనికి స్టార్క్ నుంచి చక్కని సహకారం లభించడంతో ఇద్దరూ కలిసి ఏదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే లక్ష్యానికి దూరం పెరిగిపోతుండడంతో మరో షాట్ కోసం ప్రయత్నించి డివిలియర్స్ ఔటయ్యాడు. 125 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన బెంగళూరు మళ్లీ కోలుకోలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కోహ్లి (బి) చాహల్ 30, మన్‌దీప్‌సింగ్ (సి) ఆల్బీ మోర్కెల్ (బి) హర్షల్ పటేల్ 21, మ్యాక్స్‌వెల్ (సి) స్టార్క్ (బి) చాహల్ 25, మిల్లర్ (సి) చాహల్ (బి) ఆరోన్ 66, బెయిలీ (సి) పార్థివ్ (బి) ఆల్బీ మోర్కెల్ 1, సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 17, జాన్సన్ (నాటౌట్) 16, అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 2, శివమ్ శర్మ (బి) స్టార్క్ 4, బాలాజీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1-60, 2-68, 3-93, 4-116, 5-170, 6-184, 7-189, 8-193. బౌలింగ్: స్టార్క్ 4-0-43-2, ఆల్బీ మోర్కెల్ 4-0-20-1, ఆరోన్ 4-0-35-1, హర్షల్ పటేల్ 3-0-56-2, చాహల్ 4-0-23-2, యువరాజ్ 1-0-19-0. రాయల్ చాలెంజర్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) సాహా (బి) సందీప్ శర్మ 4, పార్థివ్ (సి) మన్దీప్ (బి) సందీప్ శర్మ 13, కోహ్లి (సి) సాహా (బి) సందీప్ శర్మ 0, రాణా (బి) అక్షర్‌పటేల్ 18, డివిలియర్స్ (సి) అక్షర్ పటేల్ (బి) బాలాజీ 53, యువరాజ్ (సి) సెహ్వాగ్ (బి) శివమ్ శర్మ 3, మోర్కెల్ (సి) బెయిలీ (బి) శివమ్ శర్మ 16, స్టార్క్ (సి) మిల్లర్ (బి) బాలాజీ 29, హర్షల్ పటేల్ (సి) సాహా (బి) జాన్సన్ 6, ఆరోన్ (నాటౌట్) 17, చాహల్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-8, 2-8, 3-26, 4-39, 5-50, 6-76, 7-125, 8-133, 9-153. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-25-3, జాన్సన్ 4-0-25-1, బాలాజీ 3-0-43-2, అక్షర్ పటేల్ 4-0-22-1, శివమ్ శర్మ 4-0-26-2, మ్యాక్స్‌వెల్ 1-0-24-0.