
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) హైదరాబాద్ జట్లు సీనియర్, జూనియర్ స్థాయిలో టైటిళ్లు సాధించాయి. సీనియర్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 3 పరుగులతో కేఐఓసీ బెంగళూరుపై విజయం సాధించింది. తొలుత ఈసీడీజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ (43), ఉస్మాన్ (37), నదీమ్ (29) రాణించారు. అనంతరం కేఐఓసీ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి ఓడింది. ఈసీడీజీ బౌలర్లలో అభినవ్, నదీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జూనియర్ జట్టు తొమ్మిది వికెట్లతో కేఐఓసీ బెంగళూరు జూనియర్స్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేఐఓసీ బెంగళూరు జట్టు 19 ఓవర్లలో 97 పరుగులు చేసి ఆలౌటైంది. రాహిల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఈసీడీజీ జట్టు 10.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగులు చేసి గెలుపొందింది. యశ్ మిశ్రా (58 నాటౌట్), రోనక్ (30 నాటౌట్) రాణించారు.
జూనియర్ విభాగంలో అద్భుత ప్రతిభ చాటిన యశ్ మిశ్రాకు బెస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ట్రోఫీ దక్కింది. సీనియర్ విభాగంలో.. అభినవ్‌కు బెస్ట్ ఆల్‌రౌండర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment