గణాంకాలే ప్రాతిపదిక కాదు
గణాంకాలే ప్రాతిపదిక కాదు
Published Mon, Aug 19 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 35 వేల పరుగులు... వంద సెంచరీలు సాధించిన ఘనత సచిన్ టెండూల్కర్ సొంతం. అయితే గణాంకాలే అతడిని గొప్పవాడిగా చేయలేదు. కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొని నిలిచి అతను జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఇప్పుడు అదే తరహాలో ఈ మాస్టర్ క్రికెటర్ భవిష్యత్తు కోసం దిశా నిర్దేశం చేస్తున్నాడు. ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి ఎంపిక చేసే ముందు సెలక్టర్లు దూరదృష్టితో ఆలోచించాలని సచిన్ అభిప్రాయపడ్డాడు. కేవలం అతను సాధించిన స్కోర్లు, ఇతర గణాంకాలపై ఆధారపడకుండా ఆ క్రికెటర్ సామర్థ్యం, ఒత్తిడిని ఎదుర్కోగలిగే స్వభావాన్ని బట్టి చోటు కల్పించాలని అన్నాడు.
‘టీమ్ సెలక్షన్ అంటే స్కోరు బోర్డుపైనే ఆధారపడటం కాదు. భారీగా పరుగులు చేసిన ఆటగాడిని సెలక్టర్లు ఎంపిక చేయవచ్చు. అయితే అది సరిపోదు. దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేసి అంతర్జాతీయస్థాయిలో రాణించలేకపోయిన అనేక మంది ఆటగాళ్లను నేను ఇన్నేళ్లలో చూశాను’ అని సచిన్ విశ్లేషించాడు. ఆటగాడు కొన్ని మ్యాచుల్లో విఫలమైనా... అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొని ఆడగల సామర్థ్యం కనిపిస్తే అతడిని ఎంపిక చేయాలని సచిన్ వ్యాఖ్యానించాడు. శనివారం రాత్రి జరిగిన కర్ణాటక స్టేట్ క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో తన మాజీ సహచరులు గంగూలీ, ద్రవిడ్‌లతో కలిసి సచిన్ పాల్గొన్నాడు.
జిడ్డుగా ఆడితే కుదరదు...
టి20 క్రికెట్ కారణంగానే టెస్టుల్లోనూ వేగం పెరిగి ఎక్కువ మ్యాచుల్లో ఫలితాలు వస్తున్నాయని సచిన్ అన్నాడు. ఏ ఆటలోనూ లేని విధంగా క్రికెట్‌లోనే మూడు ఫార్మాట్‌లు ఉన్నాయని, అది ఆటను మరింత రసవత్తరంగా మారుస్తోందన్నాడు. సీనియర్ల ఆటను చూసి నేర్చుకున్నా కుర్రాళ్లు తమ సొంత శైలిలో ఆడాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
‘ఏ ఇద్దరి టెక్నిక్ ఒకే తరహాలో ఉండదు. ఆటలో ప్రాథమికాంశాలే ముఖ్యం. విజయవంతం కావడంలో అదే ముఖ్యం’ అని అన్నాడు. టెస్టుల్లో ఎక్కువ శాతం ఫలితాలు రావడం, వన్డేల్లో 350-400 మధ్య పరుగులు రావడానికి టి20లు నేర్పిన దూకుడే కారణమని సౌరవ్ చెప్పాడు. ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని, వాటిని మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళితేనే మంచి ఫలితాలు దక్కుతాయని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
Advertisement
Advertisement