
సైనా జోరుకు సింధు బ్రేకులు!
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ల పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పీవీ సింధునే విజయం వరించింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-16, 22-20 తేడాతో ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సింధు సెమిఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 47 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలి గేమ్‌లో 7-7తో సమానంగా ఉండగా.. సైనా వరుస తప్పిదాలతో సింధు ఆధిక్యాన్ని 15-9కి పెంచుకుంది. ఇదే క్రమంలో మరిన్ని పాయింట్లు తొలి గేమ్‌ను సింధు సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో తొలుత సైనా 11-7తో ఓ దశలో ఆధిక్యానికి వెళ్లింది. వెంటనే కోలుకున్న సింధు.. సైనాతో పోటాపోటీగా పాయింట్లు సాధించగా 19-19, 20-20తో హోరాహోరీ పోరు సాగింది. ఈ క్రమంలో సింధు రెండు వరుసా పాయింట్లతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్ నెగ్గి సెమిఫైనల్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా, సింధు తలపడనుండటం ఇది కేవలం రెండోసారి మాత్రమే. అయితే మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ఈ విజయంతో సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. గతంలో 2014 సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ ఫైనల్లో సింధును 21–14, 21–17తో సైనా ఓడించింది.