India Open Super Series badminton tournament
-
India Open 2024: క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 21–15తో చింగ్ యావో లు–పో హాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 20–22, 21–14, 21–14తో గెలుపొందాడు. -
India Open: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సహచర షట్లర్ అస్మిత చాలిహపై 21-7, 21-18 తేడాలో సునాయస విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్ సింధు.. ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెమీస్ పోరులో సింధు.. ఆరవ సీడ్ థాయ్‌లాండ్ క్రీడాకారిణి సుపానిడా కేటేథోంగ్తో తలపడనుంది. కాగా, ఈ టోర్నీలో కరోనా మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు వైరస్ బారిన పడ్డారు. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
India Open: సైనాపై మాల్విక సంచలన విజయం... క్వార్టర్స్‌లో సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ టోర్నీలో ఇవాళ భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో సునాయస విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు భంగపాటు ఎదురైంది. రెండో రౌండ్లో సింధు.. ఐరా శర్మను 21-10, 21-10 తేడాతో సునాయసంగా ఓడించగా, సైనా నెహ్వాల్.. ప్రపంచ 111వ ర్యాంకర్ మాల్విక బన్సోద్ చేతిలో 17-21, 9-21 తేడాతో ఓటమి పాలైంది. కాగా, ఇండియా ఓపెన్‌లో ఇవాళ కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. సైనాపై మాల్విక సంచలన విజయం... టాప్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లో షాక్ ఎదురైంది. భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్ 21–17, 21–9తో నాలుగో సీడ్ సైనాపై సంచలన విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో వర్ధమాన షట్లర్ మాల్విక ప్రత్యర్థిపై చెలరేగిపోయింది. 2017నుంచి చూస్తే సైనా ఒక భారత ప్లేయర్ చేతిలో ఓడటం ఇదే రెండో సారి (మరో సారి సింధు చేతిలో) మాత్రమే. సింధు 21–10, 21–10తో ఐరా శర్మ (భారత్)పై నెగ్గి సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, కేయూర 10–21, 10–21తో ఆకర్షి కశ్యప్ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ వాకోవర్‌తో, మూడో సీడ్ లక్ష్యసేన్ 21–12, 21–15తో ఫెలిక్స్ బురెస్టెండ్ (స్వీడెన్)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల డబుల్స్‌లో అశ్వినికి వైరస్ సోకడంతో భాగస్వామి సిక్కిరెడ్డికి, త్రిషాకు కరోనాతో పుల్లెల గాయత్రికి నిరాశ తప్పలేదు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–9, 21–18తో శ్యామ్ ప్రసాద్–సుంజీత్ జంటపై గెలిచి క్వార్టర్స్ చేరారు. చదవండి: ఈ కుర్రాడిని ఫీగా వదిలేయండి.. పంత్‌పై సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్ -
సైనా జోరుకు సింధు బ్రేకులు!
-
సైనా జోరుకు సింధు బ్రేకులు!
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ల పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పీవీ సింధునే విజయం వరించింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-16, 22-20 తేడాతో ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సింధు సెమిఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 47 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలి గేమ్‌లో 7-7తో సమానంగా ఉండగా.. సైనా వరుస తప్పిదాలతో సింధు ఆధిక్యాన్ని 15-9కి పెంచుకుంది. ఇదే క్రమంలో మరిన్ని పాయింట్లు తొలి గేమ్‌ను సింధు సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో తొలుత సైనా 11-7తో ఓ దశలో ఆధిక్యానికి వెళ్లింది. వెంటనే కోలుకున్న సింధు.. సైనాతో పోటాపోటీగా పాయింట్లు సాధించగా 19-19, 20-20తో హోరాహోరీ పోరు సాగింది. ఈ క్రమంలో సింధు రెండు వరుసా పాయింట్లతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్ నెగ్గి సెమిఫైనల్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా, సింధు తలపడనుండటం ఇది కేవలం రెండోసారి మాత్రమే. అయితే మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ఈ విజయంతో సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. గతంలో 2014 సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ ఫైనల్లో సింధును 21–14, 21–17తో సైనా ఓడించింది. -
సింధు & సైనా
⇒నేడు అమీతుమీ తేల్చుకోనున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ ⇒సమీర్ వర్మ మరో సంచలన విజయం ⇒ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పీవీ సింధు... ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుకుంటున్న సైనా నెహ్వాల్... ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ ఇద్దరు భారత బ్యాడ్మింటన్ స్టార్స్ ముఖాముఖి పోరులో తలపడనున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21–16, 23–21తో ప్రపంచ 87వ ర్యాంకర్ సెనా కవాకామి (జపాన్)పై గెలుపొందగా... ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21–14, 21–12తో ప్రపంచ 34వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా, సింధు తలపడనుండటం ఇది రెండోసారి. గతంలో 2014 సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ ఫైనల్లో ఏకైకసారి సింధుతో ఆడిన సైనా 21–14, 21–17తో ఓడించింది. అయితే ఈ ఏడాది పీబీఎల్ సెమీఫైనల్లో భాగంగా సైనాతో (అవధ్ వారియర్స్) ఆడిన సింగిల్స్ మ్యాచ్‌లో సింధు (చెన్నై స్మాషర్స్) 11–7, 11–8తో గెలుపొందడం విశేషం. ‘శుక్రవారం సింధుతో జరిగే మ్యాచ్‌లో ఎలాంటి ఫలితమైనా రావచ్చు. ఎవరు తక్కువ తప్పిదాలు చేస్తారో వారినే విజయం వరిస్తుందని భావిస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని అనుకుంటున్నాను. పీబీఎల్‌లో గేమ్‌లో 11 పాయిం ట్లే ఉన్నాయి. గాయం నుంచి కోలుకుంటున్న దశలో పీబీఎల్‌లో సింధుతో ఆడాను’ అని సైనా వ్యాఖ్యానించింది. ‘మా ఇద్దరి మధ్య మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మెరుగ్గా ఆడేవాళ్లకే ఈ మ్యాచ్‌లో విజయం దక్కుతుందని చెప్పగలను’ అని సింధు తెలిపింది. ఆశలన్నీ సమీర్ వర్మపైనే... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున సమీర్ వర్మ ఒక్కడే మిగిలాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–17, 21–15తో ప్రపంచ 15వ ర్యాంకర్ యున్ హు (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై సమీర్ గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో 26వ ర్యాంకర్ అండెర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ ఆడతాడు. శ్రీకాంత్, సౌరభ్ వర్మ పరాజయం మరోవైపు భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 7–21, 12–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో, సాయిప్రణీత్ 14–21, 16–21తో చు తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, సౌరభ్ వర్మ 19–21, 21–14, 20–22తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ (భారత్) 13–21, 11–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. సిక్కి రెడ్డి జంట ఓటమి డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 15–21, 10–21తో పుత్తితా సుపజిరకుల్–సపిసిరి తెరతానాచయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 18–21, 19–21తో డ్రెమిన్–దిమోవా (రష్యా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ⇒నేటి క్వార్టర్ ఫైనల్స్మధ్యాహ్నం గం. 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
సింధు, సైనాలపైనే దృష్టి
నేటి నుంచి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో పీవీ సింధు... తనకెంతో కలిసొచ్చిన వేదికపై మళ్లీ మెరిపించాలనే పట్టుదలతో సైనా నెహ్వాల్... మంగళవారం మొదలయ్యే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ ‘డ్రా’ ప్రకారం సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ తొలి రెండు రౌండ్లను దాటితే క్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ‘ఢిల్లీ నాకెంతో ప్రత్యేకం. ఇక్కడే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాను. 2015లో ఇండియా ఓపెన్ గెలిచాను. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాను. అంతా కలిసొచ్చిన వేదికపై సొంత అభిమానుల మధ్య ఆడనుండటం నూతనోత్సాహాన్ని ఇస్తుంది. ఈసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను’ అని సైనా వ్యాఖ్యానించింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అరుంధతి పంతవానె (భారత్)తో సింధు; చియా సిన్ లీ (చైనీస్ తైపీ)తో సైనా తలపడతారు. సింధు, సైనాలతోపాటు టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్), నొజోమి ఒకుహారా (జపాన్), సుంగ్ జీ హున్ (కొరియా) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. -
మెయిన్ ‘డ్రా’కు రుత్విక
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రుత్విక అజేయంగా నిలిచింది. తొలి రౌండ్లో రుత్విక 21-9, 21-16తో మరో తెలుగమ్మాయి గుమ్మడి వృశాలిని ఓడించగా... రెండో రౌండ్లో 21-16, 21-18తో గ్రేస్ గేబ్రియల్ (నైజిరియా)పై గెలిచింది. రుత్వికతోపాటు భారత్‌కే చెందిన తన్వీ లాడ్, రితూపర్ణ దాస్, అరుణ ప్రభుదేశాయ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి సౌరభ్ వర్మ ఒక్కడే మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు.