సింధు & సైనా | Saina Nehwal Versus PV Sindhu In Quarters | Sakshi
Sakshi News home page

సింధు & సైనా

Published Fri, Mar 31 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

సింధు & సైనా

సింధు & సైనా

నేడు అమీతుమీ తేల్చుకోనున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌
సమీర్‌ వర్మ మరో సంచలన విజయం
ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ


న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పీవీ సింధు... ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సంతరించుకుంటున్న సైనా నెహ్వాల్‌... ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఈ ఇద్దరు భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ముఖాముఖి పోరులో తలపడనున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 21–16, 23–21తో ప్రపంచ 87వ ర్యాంకర్‌ సెనా కవాకామి (జపాన్‌)పై గెలుపొందగా... ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సైనా నెహ్వాల్‌ 21–14, 21–12తో ప్రపంచ 34వ ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా, సింధు తలపడనుండటం ఇది రెండోసారి. గతంలో 2014 సయ్యద్‌ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ ఫైనల్లో ఏకైకసారి సింధుతో ఆడిన సైనా 21–14, 21–17తో ఓడించింది. అయితే ఈ ఏడాది పీబీఎల్‌ సెమీఫైనల్లో భాగంగా సైనాతో (అవధ్‌ వారియర్స్‌) ఆడిన సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు (చెన్నై స్మాషర్స్‌) 11–7, 11–8తో గెలుపొందడం విశేషం.

‘శుక్రవారం సింధుతో జరిగే మ్యాచ్‌లో ఎలాంటి ఫలితమైనా రావచ్చు. ఎవరు తక్కువ తప్పిదాలు చేస్తారో వారినే విజయం వరిస్తుందని భావిస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని అనుకుంటున్నాను. పీబీఎల్‌లో గేమ్‌లో 11 పాయిం ట్లే ఉన్నాయి. గాయం నుంచి కోలుకుంటున్న దశలో పీబీఎల్‌లో సింధుతో ఆడాను’ అని సైనా వ్యాఖ్యానించింది. ‘మా ఇద్దరి మధ్య మ్యాచ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మెరుగ్గా ఆడేవాళ్లకే ఈ మ్యాచ్‌లో విజయం దక్కుతుందని చెప్పగలను’ అని సింధు తెలిపింది.

ఆశలన్నీ సమీర్‌ వర్మపైనే...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున సమీర్‌ వర్మ ఒక్కడే మిగిలాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ 21–17, 21–15తో ప్రపంచ 15వ ర్యాంకర్‌ యున్‌ హు (హాంకాంగ్‌)పై సంచలన విజయం సాధించాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)పై సమీర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో 26వ ర్యాంకర్‌ అండెర్స్‌ అంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)తో సమీర్‌ వర్మ ఆడతాడు.

శ్రీకాంత్, సౌరభ్‌ వర్మ పరాజయం
మరోవైపు భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సౌరభ్‌ వర్మ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు. శ్రీకాంత్‌ 7–21, 12–21తో విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో, సాయిప్రణీత్‌ 14–21, 16–21తో చు తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, సౌరభ్‌ వర్మ 19–21, 21–14, 20–22తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్‌ (భారత్‌) 13–21, 11–21తో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది.

సిక్కి రెడ్డి జంట ఓటమి
డబుల్స్‌ విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 15–21, 10–21తో పుత్తితా సుపజిరకుల్‌–సపిసిరి తెరతానాచయ్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 18–21, 19–21తో డ్రెమిన్‌–దిమోవా (రష్యా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.  

నేటి క్వార్టర్‌ ఫైనల్స్‌మధ్యాహ్నం గం. 2.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement