
సింధు, సైనాలపైనే దృష్టి
నేటి నుంచి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో పీవీ సింధు... తనకెంతో కలిసొచ్చిన వేదికపై మళ్లీ మెరిపించాలనే పట్టుదలతో సైనా నెహ్వాల్... మంగళవారం మొదలయ్యే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ ‘డ్రా’ ప్రకారం సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ తొలి రెండు రౌండ్‌లను దాటితే క్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ‘ఢిల్లీ నాకెంతో ప్రత్యేకం. ఇక్కడే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాను. 2015లో ఇండియా ఓపెన్ గెలిచాను. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాను.
అంతా కలిసొచ్చిన వేదికపై సొంత అభిమానుల మధ్య ఆడనుండటం నూతనోత్సాహాన్ని ఇస్తుంది. ఈసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను’ అని సైనా వ్యాఖ్యానించింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అరుంధతి పంతవానె (భారత్)తో సింధు; చియా సిన్ లీ (చైనీస్ తైపీ)తో సైనా తలపడతారు. సింధు, సైనాలతోపాటు టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్), నొజోమి ఒకుహారా (జపాన్), సుంగ్ జీ హున్ (కొరియా) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు.