ఫైనల్లో సింధు
మకావు: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు తన కెరీర్‌లో మరో టైటిల్‌పై గురి పెట్టింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు సెమీఫైనల్లో అలవోక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సింధు 21-14, 21-15తో గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 91వ ర్యాంకర్ కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. రెండో సెమీఫైనల్లో కిమ్ హ్యో మిన్ 15-21, 24-22, 21-10తో ఏడో సీడ్ సున్ యు (చైనా)పై సంచలన విజయం సాధించింది.
ఇప్పటికి రెండు (మకావు ఓపెన్, మలేసియా ఓపెన్) గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్స్ నెగ్గిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, ఉబెర్ కప్‌లో కాంస్యం సాధించింది.
గతంలో బుసానన్‌తో ఆడిన నాలుగు పర్యాయాల్లోనూ నెగ్గిన సింధుకు ఐదోసారి కూడా అంతగా పోటీ ఎదురుకాలేదు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పదునైన స్మాష్‌లతో ఆకట్టుకుంది. తొలి గేమ్ ఆరంభంలో బుసానన్ 5-2తో ముందంజ వేసినా సింధు తేరుకున్నాక పరిస్థితి మారిపోయింది. స్కోరును సమం చేయడంతోపాటు సింధు 13-9తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత స్కోరు 15-14 వద్ద ఉన్నపుడు ఒక్కసారిగా చెలరేగిన ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. స్కోరు 12-12 వద్ద సమంగా ఉన్నపుడు సింధు మళ్లీ విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18-12తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌లో విజయాన్ని దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత యువతార హెచ్‌ఎస్ ప్రణయ్ 16-21, 21-16, 12-21తో వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ సంధించిన స్మాష్‌లకు వింగ్ కీ వోంగ్ అద్భుతమైన డిఫెన్స్‌తో జవాబిచ్చాడు. మూడో గేమ్‌లో సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో వింగ్ కీ వోంగ్ పైచేయి సాధించి ప్రణయ్ ఆశలను వమ్ము చేశాడు.