సింధు, గోపీచంద్‌లకు పురస్కారాలు
ఘనంగా టీఎస్‌జేఏ అవార్డుల వేడుక
హైదరాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎస్‌జేఏ) తొలి అవార్డుల వేడుక నగరంలో ఘనంగా జరిగింది. సోమాజిగూడలోని ‘ది పార్క్’ హోటల్‌లో శనివారం జరిగిన ఈ వేడుకలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, చెస్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక ఈ ఈవెంట్‌కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో 2016 సంవత్సరంలో విశేషంగా రాణించిన క్రీడాకారులకు అవార్డులను అందజేశారు. ఏడాది కాలంగా అద్భుతంగా రాణిస్తోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘ కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెలుచుకున్నారు. మహిళల విభాగంలో ‘సీనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సానియా మీర్జా (టెన్నిస్) ఎంపికవ్వగా... పురుషుల విభాగంలో మొహమ్మద్ సిరాజ్ (క్రికెట్) ఈ అవార్డును అందుకున్నాడు.
ఎన్.శివలాల్ యాదవ్ (క్రికెట్)కు జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. ఉమెన్ అచీవర్ అవార్డులను ద్రోణవల్లి హారిక (చెస్), ఎస్. అపూర్వ (క్యారమ్), జ్వాల (బ్యాడ్మింటన్), మిథాలీ రాజ్ (క్రికెట్) అందుకున్నారు. ఐపీఎల్–9 సీజన్‌లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. సీనియర్స్‌తో పాటు పలు క్రీడల్లో రాణించిన జూనియర్స్‌కు కూడా అవార్డులు అందజేశారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావు గౌడ్, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, టూరిజం కార్యదర్శి బి. వెంకటేశంలతోపాటు పలువురు క్రీడా ప్రముఖలు ఎస్‌పీ మిశ్రా (టెన్నిస్), సయ్యద్ ఆరిఫ్ (బ్యాడ్మింటన్), మీర్ ఖాసిమ్ అలీ (టేబుల్ టెన్నిస్), వెంకటపతి రాజు, విజయ్ మోహన్ రాజ్, నోషిర్ మెహతా (క్రికెట్), హెచ్‌సీఏ అధ్యక్షులు వివేక్, బీసీసీఐ గేమ్ డెవలప్‌మెంట్ జీఎం ఎంవీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర అవార్డు విజేతల వివరాలు
బెస్ట్ మేల్ జూనియర్: సిరిల్ వర్మ (బ్యాడ్మింటన్).
బెస్ట్ ఫిమేల్ జూనియర్: గాయత్రి గోపిచంద్ (బ్యాడ్మింటన్), సౌమ్య (ఫుట్‌బాల్).
మోస్ట్ ప్రామిసింగ్ స్పోర్ట్స్ పర్సన్: గీతాంజలి (రోయింగ్).
యంగ్ అచీవర్: రుత్విక శివాని (బ్యాడ్మింటన్).
స్కూల్ ఆఫ్ ద ఇయర్: తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్.
బెస్ట్ అసోసియేషన్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం.
కంట్రిబ్యూటర్ ఆఫ్ ద ఇయర్: మొహమ్మద్ సలీమ్.
ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్: ఎస్‌పీ మిశ్రా (టెన్నిస్), సయ్యద్ ఆరిఫ్ (బ్యాడ్మింటన్), నార్మన్ ఐజాక్ (బాస్కెట్‌బాల్).