‘సిల్వర్’ సింధు గోల్డెన్ డీల్!
హైదరాబాద్: ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కాసుల పంట కొనసాగుతోంది. ‘సిల్వర్’ సింధు రూ. 50 కోట్లు విలువ చేసే గోల్డెన్ డీల్ పై సంతకాలు చేసినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. వ్యాపార సంస్థలతో ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్న క్రికెటేతర ప్లేయర్ గా సింధు ఘనత సాధించింది. ఆమెతో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ’బేస్ లైన్’ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
సింధు సంతకం చేసిన బెస్ట్ డీల్ ఇదేనని ’బేస్ లైన్’ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు తుహిన్ మిశ్రా తెలిపారు. ‘సింధుకు పెరుగుతున్న పాపులారిటీని వినియోగించుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఆమె బ్రాండ్ వేల్యూను అత్యధిస్థాయికి పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఒలింపిక్స్ అద్భుత విజయం సాధించిన తర్వాత సింధు చూసిన అణకువ, విలువ ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్లింద’ని మిశ్రా అన్నారు.
ఇక నుంచి సింధు బ్రాండ్ ప్రొఫెలింగ్, లైసెన్సింగ్, ఎండార్స్ మెంట్స్ ను ‘బేస్ లైన్’ పర్యవేక్షించనుంది. సింధు తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని ఇప్పటివరకు 16 కంపెనీలు సంప్రదించాయని మిశ్రా వెల్లడించారు. తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు దాదాపు ఖరారయ్యాయని తెలిపారు. వచ్చే వారంలో ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముందన్నారు. కంపెనీలు పేర్లు ఇప్పుడు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. సింధు ప్రాక్టీసుకు భంగం కలగకుండా ఆమెతో వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేయిస్తామని చెప్పారు.
కోలా బ్రాండ్స్ కు ప్రచారం చేయడానికి నిరాకరించిన తన కోచ్ పుల్లెల గోపీచంద్ బాటలో నడవాలని సింధు నిర్ణయించుకుంది. యువతపై ప్రతికూల ప్రభావం చూపే ఉత్పత్తులకు ప్రచారం చేయకూడదని ఆమె భావిస్తోంది. ఎండార్స్ మెంట్స్ తో సింధుకు ఎంత మొత్తంలో డబ్బు ముడుతుందో చెప్పేందుకు మిశ్రా నిరాకరించారు.