డి కాక్ మెరుపులు
►దక్షిణాఫ్రికా 314
► న్యూజిలాండ్‌తో మూడో టెస్టు
హామిల్టన్: చేతి వేలి గాయంతో బాధపడుతున్నప్పటికీ క్వింటాన్ డి కాక్ (118 బంతుల్లో 90; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.2 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 148 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో ఏడో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన డి కాక్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి.
కెప్టెన్ డు ప్లెసిస్ (108 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... చివర్లో రబడా (31 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. హెన్రీకి నాలుగు, వాగ్నర్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో కాస్త ముందుగానే ఆటను నిలిపివేశారు. క్రీజులో ఓపెనర్లు లాథమ్ (82 బంతుల్లో 42 బ్యాటింగ్; 8 ఫోర్లు), రావల్ (71 బంతుల్లో 25 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు.