బ్యాడ్మింటన్ జట్టు మేనేజర్‌గా రఘుకిరణ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం (ఏపీబీఏ) కార్యదర్శి చెరుకూరి రఘుకిరణ్‌కు అరుదైన అవకాశం లభించింది. ఆయన చైనీస్ తైపీలో పర్యటించే భారత బ్యాడ్మింటన్ బృందానికి మేనేజర్‌గా ఎన్నికయ్యారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నూతన అధ్యక్షులు హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన రఘుకిరణ్ గత 10 ఏళ్లుగా బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
రఘుకిరణ్ భారత జట్టుకు మేనేజర్‌గా ఎంపికవడం పట్ల ఏపీబీఏ అధ్యక్షుడు టి.జి. వెంకటేశ్, ఉపాధ్యక్షులు రాయపాటి రంగారావు, ఎం. ద్వారకనాథ్, సంయుక్త కార్యదర్శి పి. అంకమ్మ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళా క్రీడాకారులు యోనెక్స్ ఓపెన్ చైనీస్‌తైపీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొననున్నారు. నేటి (మంగళవారం) నుంచి జూలై 2 వరకు చైనీస్ తైపీలో ఈ టోర్నీ జరుగుతుంది. పురుషుల విభాగంలో సౌరభ్ వర్మ, హర్షీల్ డానీ, అభిషేక్, సిరిల్ వర్మ, సి. రాహుల్ యాదవ్, హేమంత్ గౌడ... మహిళల కేటగిరీలో కె. శ్రీకృష్ణ ప్రియ, సీహెచ్ ఉత్తేజిత రావు, తన్వి లాడ్ ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.