BAI
-
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: థామస్ కప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ విఫలమయ్యాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 2ఎ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నలుగురు చొప్పున ఉన్న నాలుగు గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన నలుగురే తదుపరి ట్రయల్స్ దశకు అర్హత పొందుతారు. 2ఎ గ్రూప్‌లో కిరణ్ జార్జి (కేరళ) అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందగా... సాయిప్రణీత్ రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ జార్జితో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 21–23, 21–11, 16–21తో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా సింగిల్స్ కోసం లక్ష్య సేన్, శ్రీకాంత్... ఇటీవల కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ప్రణయ్‌ను ‘బాయ్’ నేరుగా భారత జట్టులోకి ఎంపిక చేసింది. మిగిలిన ఒక బెర్త్ కోసం కిరణ్ జార్జి, రవి, సమీర్ వర్మ, ప్రియాన్షు తలపడతారు. -
AP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పున్నయ్యచౌదరి, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మచౌదరి చెప్పారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం రెండెకరాలను కేటాయించడం హర్షణీయమన్నారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ సుధాకర్‌రెడ్డి పేరున ఏర్పాటు చేసే ఈ అకాడమీకి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ అకాడమీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే అకాడమీకి సీఈవోగా సుధాకర్‌రెడ్డి సతీమణి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సావిత్రి వ్యవహరించనున్నారు. అకాడమీకి స్థలం కేటాయించిన సీఎం జగన్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఆన్లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆన్లైన్ పాఠాలకు డిమాండ్ పెరిగిపోయింది. అటు స్కూలు పిల్లలు దగ్గర్నుంచి, ఇటు క్రీడాకారుల వరకూ అంతా ఆన్లైన్లో తమ ట్రైనింగ్ క్లాస్‌ను వింటున్నారు. ఇలా ఆన్లైన్ పాఠాలు నిర్వహించడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ( సాయ్), భారత బ్యాడ్మింటన్ అసోసియన్(బాయ్)లు నడుంబిగించగా మధ్యలో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బాయ్, సాయ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ ఆన్లైన్ శిక్షణలో 500 నుంచి 700 వరకూ పాల్గొన్నారు. ఇది బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతోంది. దీనికి ఇండోనేసియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గ నిర్దేశకం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ.. ఒక్కసారిగా స్క్రీన్‌పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో క్లాస్ చెబుతున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్ వెంటనే లాగౌట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాయ్’ ఐటీ వింగ్ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్న సమయంలో అశ్లీల చిత్రాలు రావడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. తమ జూమ్ సెషన్ హ్యాక్ కాకపోయినా అశ్లీల చిత్రాలు రావడం సాయ్ ఐటీ డిపార్ట్మెంట్కు తలపోటుగా మారింది. -
డచ్, జర్మన్ టోర్నీలకు సామియా, గాయత్రి
న్యూఢిల్లీ: జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్న హైదరాబాదీ అమ్మాయిలు సామియా ఇమాద్ ఫారుఖీ, పుల్లెల గాయత్రిలు విదేశీ టోర్నీలకు ఎంపికయ్యారు. డచ్, జర్మన్ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే జూనియర్ జట్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) బుధవారం ఎంపిక చేసింది. మొత్తం 20 మందితో కూడిన బాలబాలికల జట్లను ప్రకటించింది. ఇందులో 10 మంది చొప్పున బాలురు, బాలికలు ఉన్నారు. అయితే ఈ 20 మందిలో ఆరుగురు షట్లర్లు తెలంగాణ వారే కావడం గమనార్హం. మరొకరు ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాయిచరణ్ కావడంతో తెలుగువారే ఏడుగురున్నారు. డచ్ టోర్నమెంట్ ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు... అనంతరం జర్మన్ ఈవెంట్ మార్చి 7 నుంచి 10 వరకు జరుగనున్నాయి. బాలికల సింగిల్స్‌లో భారత కోచ్ గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి, సామియాలతో పాటు స్మిత్ తొష్నివాల్ (మహారాష్ట్ర), అమోలిక సింగ్ (ఉత్తరప్రదేశ్) ఎంపికవగా, బాలుర సింగిల్స్‌లో సాయిచరణ్ (ఏపీ), మైస్నమ్ మిరబా (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్), సతీశ్ కుమార్ (తమిళనాడు)లు ఉన్నారు. తెలంగాణ కుర్రాడు బొక్కా నవనీత్ బాలుర డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. వర్షిణి బాలికల డబుల్స్‌లో బండి సాహితి మిక్స్డ్ డబుల్స్ జట్టులో ఎంపికవగా... విష్ణువర్ధన్ గౌడ్‌కు బాలుర డబుల్స్ జట్టులో చోటు దక్కింది. విజయవాడ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో గత నెలలో నిర్వహించిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా షట్లర్లను ఎంపిక చేసినట్లు ‘బాయ్’ వెల్లడించింది. విజేతగా నిలిచిన వారికి 500 పాయింట్లు, రన్నరప్‌కు 425 పాయింట్లు, సెమీఫైనలిస్ట్‌లకు 350 పాయింట్లు, క్వార్టర్, ప్రిక్వార్టర్ ఫైనలిస్ట్‌లకు వరుసగా 275, 192 పాయింట్లు కేటాయించారు. దీంతో హైదరాబాదీ సామియాకు 1125 పాయింట్లు దక్కాయి. -
యోనెక్స్‌తో ‘బాయ్’ రూ. 75 కోట్ల ఒప్పందం
న్యూఢిల్లీ: క్రీడా ఉత్పత్తుల తయారీ సంస్థ యోనెక్స్ సన్‌రైజ్‌తో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 75 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ‘బాయ్’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని టోర్నమెంట్లకు యోనెక్స్ సంస్థ తమ ఉత్పత్తులను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా మూడేళ్ల పాటు ‘బాయ్’ నిర్వహించే టోర్నీలకు ఆ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ అంశంపై ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ... ‘భారత బ్యాడ్మింటన్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న యోనెక్స్ సన్రైజ్కు ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఒప్పందం వల్ల ఆర్థిక స్థిరత్వం లభించనుంది. దీంతో ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గొప్ప పురోగతి సాధించవచ్చు’ అని అన్నారు. కార్యదర్శి అజయ్ సింఘానియా స్పందిస్తూ... ‘మన దేశంలో బ్యాడ్మింటన్ విస్తరించడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడనుంది’ అని తెలిపారు. -
బీఏఐ అధ్యక్షుడిగా పులహండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన భారత నిర్మాణదారుల సంఘం(బీఏఐ) అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన పులహండి ఎన్నికయ్యారు. ఐదుగురు వైస్‌ప్రెసిడెంట్లు ఉండే ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా చెరువు రామకోటయ్య ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామకోటయ్య అన్నారు. దేశవ్యాప్తంగా బీఏఐకి 165 శాఖలున్నాయనీ, వీటిలో 18,000 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌ట్రావెలర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఈఎస్ఐ కార్పొరేషన్ మెంబర్‌గా సేవలందిస్తున్నట్లు తెలిపారు. -
సింధు ఫిర్యాదుపై ఇండిగో స్పందన..బాయ్ రియాక్షన్!
-
సింధు ఫిర్యాదుపై ఇండిగో స్పందన..బాయ్ రియాక్షన్!
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేసిన ఫిర్యాదుపై ఇండిగో విమానయాన సంస్థ ఆచితూచి స్పందించింది. సింధుకు చేదు అనుభవం ఎదురైన ఘటనలో తమ సిబ్బంది తప్పు ఎంత మాత్రం లేదని, ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించామని చెప్పుకొచ్చింది. విమానంలో తమ బాధ్యతను మాత్రమే సిబ్బంది నిర్వర్తించారని, అంతే తప్ప ఎవరితో అనుచితంగా ప్రవర్తించలేదని ఇండిగో తెలిపింది. హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణిస్తుండగా ఇండిగో విమానంలో ఎయిర్‌లైన్స్ ఉద్యోగి ఒకరు అమర్యాదగా ప్రవర్తించారని సింధు ట్విట్టర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సింధుకు నెటిజన్లంతా మద్దతుగా నిలిచారు. ఇండిగో గ్రౌండ్ సిబ్బంది అజితేష్ తనతో రూడ్‌గా బిహేవ్ చేశాడన్నది సింధు ఆరోపించారు. ప్యాసింజర్స్‌తో మర్యాదగా వ్యవహరించొద్దని ఎయిర్ హోస్టెస్ అషిమా హెచ్చరించినా.. అతడు పట్టించుకోలేదని సింధు పేర్కొన్నారు. ఆమెతోనూ అజితేష్ అనుచితంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలాంటి వాళ్ల కారణంగా పెద్ద సంస్థలకు కూడా చెడ్డపేరు వస్తుందని సింధు పేర్కొంది. ఈ వివాదంపై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అధ్యక్షుడు హిమంత్ బిస్వా శర్మ స్పందించారు. పీవీ సింధుతో తాను సమావేశమై.. ఘటన గురించి చర్చించానని, అసలు ఏం జరిగిందో సింధు వివరించిందని, దీనిపై ఏం చేయాలనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హిమంత బిస్వా తెలిపారు. -
జ్వాల సెకండ్ ఇన్నింగ్స్
భారత డబుల్స్ కోచ్ బాధ్యతలు న్యూఢిల్లీ: దేశంలో బ్యాడ్మింటన్ క్రీడను మరింతగా అభివృద్ధి చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కొత్త అడుగు వేసింది. సీనియర్, జూనియర్ విభాగాలతో పాటు సింగిల్స్, డబుల్స్ కేటగిరీలకూ ప్రత్యేకంగా కోచ్‌లను నియమించింది. సీనియర్ స్థాయిలో పురుషుల సింగిల్స్‌కు దేశంలోని వివిధ జోన్ల నుంచి కొత్తగా 19మంది కోచ్‌లను ఎంపిక చేసిన ‘బాయ్’... డబుల్స్ విభాగంలో 12 మందిని నియమించింది. వీరితో పాటు మహిళల డబుల్స్‌కూ నలుగురు కోచ్‌లను ప్రకటించింది. వీరంతా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో మహిళల డబుల్స్ విభాగంలో ఎన్నో ఘనతలను సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మహిళల డబుల్స్ కోచ్‌గా ఎంపికయ్యారు. జ్వాలతో పాటు మధుమిత బిస్త్, ప్రద్యా్న గాద్రె, ఓలి డెకా మహిళా డబుల్స్ షట్లర్లకు శిక్షణనిస్తారు. కొత్తగా కోచ్ పదవి దక్కించుకున్న వారిలో భారత మాజీ క్రీడాకారులు అరవింద్, అనూప్ శ్రీధర్, చేతన్ ఆనంద్, దీపాంకర్ భట్టాచార్జి పురుషుల సింగిల్స్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. డబుల్స్ విభాగంలో అక్షయ్ దివాల్కర్, అరుణ్ విష్ణు, థామస్, రూపేశ్ కుమార్‌లతో పాటు విజయ్‌దీప్ సింగ్, ఉదయ్ పవార్ కోచ్‌లుగా ఉంటారు. కోచ్‌లతో పాటు ‘బాయ్’ ఏర్పాటు చేసిన సలహాదారుల బృందంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరిఫ్‌కు చోటు దక్కింది. ఆరిఫ్‌తో పాటు ఈ బృందలో సంజీవ్ సచ్దేవ్, రోషన్ లాల్ నహర్, గంగూలీ ప్రసాద్ ఉంటారు. జూనియర్ స్థాయిలోనూ ‘బాయ్’ 21 మంది పురుషులు, 10మంది మహిళా కోచ్‌లను నియమించింది. ఇందులో హైదరాబా ద్‌కు చెందిన గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ ఆటగాడు జేబీఎస్ విద్యాధర్ కూడా ఉన్నారు. -
బ్యాడ్మింటన్ జట్టు మేనేజర్‌గా రఘుకిరణ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం (ఏపీబీఏ) కార్యదర్శి చెరుకూరి రఘుకిరణ్‌కు అరుదైన అవకాశం లభించింది. ఆయన చైనీస్ తైపీలో పర్యటించే భారత బ్యాడ్మింటన్ బృందానికి మేనేజర్‌గా ఎన్నికయ్యారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నూతన అధ్యక్షులు హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన రఘుకిరణ్ గత 10 ఏళ్లుగా బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రఘుకిరణ్ భారత జట్టుకు మేనేజర్‌గా ఎంపికవడం పట్ల ఏపీబీఏ అధ్యక్షుడు టి.జి. వెంకటేశ్, ఉపాధ్యక్షులు రాయపాటి రంగారావు, ఎం. ద్వారకనాథ్, సంయుక్త కార్యదర్శి పి. అంకమ్మ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళా క్రీడాకారులు యోనెక్స్ ఓపెన్ చైనీస్‌తైపీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొననున్నారు. నేటి (మంగళవారం) నుంచి జూలై 2 వరకు చైనీస్ తైపీలో ఈ టోర్నీ జరుగుతుంది. పురుషుల విభాగంలో సౌరభ్ వర్మ, హర్షీల్ డానీ, అభిషేక్, సిరిల్ వర్మ, సి. రాహుల్ యాదవ్, హేమంత్ గౌడ... మహిళల కేటగిరీలో కె. శ్రీకృష్ణ ప్రియ, సీహెచ్ ఉత్తేజిత రావు, తన్వి లాడ్ ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. -
పాకిస్తాన్‌కు వెళ్లేది లేదు: బాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ను ఒంటరి చేసే వ్యూహంలో విజయవంతమైనట్టే.. క్రీడల్లోనూ భారత్ ఆ దేశంతో దాదాపుగా తెగదెంపులు చేసుకుంటోంది. ఇప్పటికే ఐసీసీ టోర్నీల్లో తమ జట్టును పాక్ ఉన్న గ్రూపులో ఆడించకూడదని బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే. తాజాగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఈ జాబితాలో చేరింది. ఈనెల 18 నుంచి 21 వరకు ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. అరుుతే ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాల్గొనడం లేదని బాయ్ స్పష్టం చేసింది. -
బాడ్మింటన్ క్రీడాకారులకు నగదు పురస్కారాలు
న్యూఢిల్లీ: బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మంగళవారం బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లకు నగదు పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ వేదికల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వరల్డ్ నెం. 2 సైనానెహ్వాల్, కామన్ వెల్త్ గేమ్స్ లో ఛాంపియన్‌గా నిలిచిన కశ్యప్ ఇద్దరికీ చెరి అయిదు లక్షల రూపాయల బహుమతిని ఇస్తున్నట్టుగా బీఎఐ అధ్యక్షులు అఖిలేష్ దాస్ ప్రకటించారు. గత జనవరిలో లక్నో లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలసిందే. -
విమర్శిస్తే జీవితకాల నిషేధమా?:జ్వాల
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన మాటల్ని, సూచనల్ని తప్పుగా అర్థం చేసుకుంటోందని డబుల్స్ స్టార్ గుత్తాజ్వాల వాపోయింది. కేవలం విమర్శించినంత మాత్రానా జీవితకాల నిషేధం విధిస్తారా అని ఆమె ప్రశ్నించింది. ‘ముక్కుసూటిగా మాట్లాడటం నా నైజం. నా మాటల్లో తప్పేముంది. ఇంతదానికే నిషేధమంటే హాస్యాస్పదంగా లేదు! నేనేమీ కల్పించుకొని చెప్పలేదు... కల్పితాలు చెప్పలేదు’ అని పేర్కొంది. ‘బాయ్’ తనను ఎందుకు శత్రువుగా చూస్తుందో అర్థం కావడం లేదని ఆమె చెప్పింది. ‘బ్యాడ్మింటనే నా లోకం. ఇందులో ఉన్నతస్థాయికి ఎదగాలనేదే నా ఆశయం. దీని కోసం నేను రోజుకు 8 గంటలు కష్టపడతా. నాకు తెలిసిందల్లా బ్యాడ్మింటన్ ఆడటమే. రాజకీయాలు చేయడం రాదు. నేను ఎవరికైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నానని వారనుకుంటే ఇంతకుమించిన మూర్ఖత్వం మరోటి లేదు’ అని ఆమె చెప్పింది. సద్విమర్శల్ని అర్థం చేసుకునేవారు క్రీడా సమాఖ్యలో లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని జ్వాల పేర్కొంది.