కరాటే కిడ్ టు కెప్టెన్
జూన్ 21న బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తుది జట్టులో రహానే స్థానం కోల్పోయాడు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఏకంగా భారత జట్టు కెప్టెన్‌గా మారిపోయాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ముంబై నుంచి కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. వివాదాలకు దూరంగా తన పనేదో చేసుకుంటూ వెళ్లే రహానే.. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడు. కొత్త వ్యక్తులతో అంత త్వరగా కలసిపోలేని రహానే భారత కెప్టెన్‌గా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి..
బంగ్లాదేశ్‌తో వన్డేలో అజింక్య రహానేను జట్టులోకి తీసుకోకపోవడంతో అతనికి గాయం అయ్యిండొచ్చని అందరూ భావించారు. అయితే కావాలనే తప్పించారనే విషయం తెలియగానే షాకవడం అభిమానుల వంతైంది. అయినా రహానే టాలెంట్ అతణ్ని నిలబెట్టింది. వారం తిరగకముందే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా మారాడు. దీంతో సెలక్టర్లు అతనిపై ఉంచిన నమ్మకమేంటో మనకు అర్థమవుతోంది. కోహ్లికి వారసుడిగా రహానేను ఇప్పటినుంచే తయారుచేయాలని భావిస్తున్నారు. ఎవరిని ఒక్క మాట కూడా అనలేని రహానే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలడా అని కొందరు అంటున్నా అవసరమోచ్చినప్పుడు తన అభిప్రాయాలను చెప్పడంలో మోహమాటపడడు అని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు.
తండ్రి భయం..
రహానే కుటుంబం ముంబై మెట్రోపాలిటన్‌లో ఒక మూలన ఉన్న డొంబ్లివాలీలో నివాసం ఉండేది. చిన్నప్పుడు రహానే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇలా ఉంటే అందరూ ఏడిపిస్తారనే భయంతో రహానే తండ్రి అతణ్ని కరాటే స్కూల్‌లో చేర్చాడు. 9 ఏళ్ల వయసులో కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టిన రహానే.. మెల్లగా రాటుదేలాడు. అతని జీవితంలో అన్ని సవాళ్లకు ఎదురు నిలబడి పోరాడడంలో, దృఢంగా మారడంలో ఆ శిక్షణ ఎంతో ఉపయోగపడింది. కరాటే స్కూల్‌లో కూడా మృదుస్వభావిగానే ఉన్నా ప్రత్యర్థిపై అటాక్ చేసే విషయంలో మాత్రం ఎలాంటి వెనకడుగు వేసేవాడు కాదు. ప్రస్తుతం బౌలర్లపై విరుచుకుపడుతున్నట్లు. రిజర్వ్‌గా ఉండడం వల్ల చెప్పిన పనిని చాలా ఏకాగ్రతతో చేసేవాడు. కరాటేతో అతడు దృఢంగా తయారవడంతో తన కంటే పెద్ద వారితో క్రికెట్‌లో పోటీ పడడానికి భయపడేవాడు కాదు.
సచిన్, కాంబ్లీలతో ఆడాలని..
తన వీధిలో క్రికెట్ స్టార్‌గా మారిన రహానేను అతని తండ్రి.. డొంబ్లివాలీలోని ఒక క్రికెట్ క్యాంప్‌లో చేర్చాడు. అక్కడి ట్రైనర్ రెండు ఫొటోలని రహానేకు చూపించి వారిని గుర్తించమని అడగగా, వాటిల్లోని వ్యక్తుల పేర్లు చెప్పడమే కాకుండా వారితో ఆడాలని ఉందనే కోరికను బయట పెట్టాడు. ఆ వ్యక్తులు సచిన్, వినోద్ కాంబ్లీ. తర్వాతి కాలంలో భారత జట్టులో సచిన్‌తో కలసి రహానే ఆడాడు. జిల్లా స్థాయిలో తన జట్టుకు నాయకత్వం వహించిన రహానే.. ఒక వన్డే మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. తర్వాత ముంబై నగరంలోని కొన్ని క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. కేవలం క్రికెట్ ఆడటానికి రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు. రహానే కోసం అతని కుటుంబం ముంబై
నగరానికి దగ్గరగా ఉండే ఏరియాకు మారింది.
2013 తర్వాత అసలు ప్రదర్శన..
2007లో భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రహానే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెండు సెంచరీలు బాదాడు. ముంబై జట్టులో చోటు సంపాదించి అద్భుత ప్రదర్శనతో 2011లోనే భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అతి జాగ్రత్తగా ఆడడంతో పరుగులు చేయలేక ఇబ్బందిపడి జట్టులో చోటు కోల్పోయాడు. 2010 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా ఐపీఎల్‌లో మెరిసింది తక్కువే. అయితే 2012లో రాజస్తాన్ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. దాంతో మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఈ సారి ఇక వెనుదిరగలేదు. టెస్టు, వన్డే, టీ20లనే తేడా లేకుండా అదరగొడుతున్నాడు.
కెప్టెన్‌గా అనుభవం తక్కువే..
రహానే రంజీల్లో ముంబై తరఫున ఆడేవాడు. కెప్టెన్‌గా అనుభవం చాలా తక్కువ. ముంబై జట్టుకు ఒక లిస్ట్-ఎ మ్యాచ్, ఒక టీ20 మ్యాచ్‌లకు మాత్రమే సారథిగా వ్యవహరించాడు. అయితే అండర్-19 లెవల్‌లో 2005-06 కూచ్ బెహార్ టోర్నీలో తన జట్టును విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో ఏకంగా 762 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
రహానే సమర్థుడు: సచిన్
వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రహానేను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పొగడ్తలతో ముంచెత్తాడు. కెప్టెన్ పదవిని సమర్థంగా నిర్వహించగలడని తెలిపా డు. ‘‘అజింక్య కెప్టెన్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అతడు నిజాయితీ పరుడు. చాలా కష్టపడతాడు. అతని అంకితభావం చూసి ముగ్ధుడినయ్యాను.
రహానే ఎప్పుడూ పూర్తి సామర్థ్యంతో ఆడతాడు. అతనికి నా శుభాకాంక్షలు’’అని అన్నాడు. 2000 లో సచిన్ కెప్టెన్సీ వదులుకున్నాక మళ్లీ భారత జట్టుకు కెప్టెన్ ఎంపికైన ముంబై ఆటగాడు రహానేనే.
మరికొన్ని..
- రహానే ఓపెనింగ్ పొజిషన్‌లో ఆడేవాడు. అయితే రోహిత్ శర్మ ఆ స్థానంలో కుదురుకోవడంతో మిడిలార్డర్‌కు మారాడు. ఆటను మెరుగుపరచుకుంటూ గత 18 నెలలుగా భారత జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు.
- భారీ హిట్టర్ కాకపోయినా టీ20ల్లో కూడా స్టార్‌గా ఎదిగాడు. టైమింగ్ షాట్లతో క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకున్నాడు.
- రహానేకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. ముంబై మెట్రోపాలిటన్‌లోని ములుంద్ ప్రాంతంలో భార్య రాధికతో పాటు చెల్లెలు, తమ్ముడు, తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు.
- పార్టీలకు దూరంగా ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో కలసి కేఫ్‌లలో టీ పార్టీ చేసుకుంటాడు.
- సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం.
- బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తాడు