
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు చిట్టబోయిన రాహుల్ యాదవ్‌కు నిరాశ ఎదురైంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రాహుల్ తుదిమెట్టుపై బోల్తాపడ్డాడు. ఫైనల్లో క్వాలిఫయర్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ రాహుల్ యాదవ్ 21–18, 9–21, 18–21తో కిరణ్ జార్జ్ (కేరళ) చేతిలో పరాజయం పాలయ్యాడు.
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కృష్ణప్రసాద్ తన భాగస్వామి ధ్రువ్ కపిల (ఎయిరిండియా)తో కలిసి టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల ద్వయం 21–17, 19–21, 21–15తో రూపేశ్‌కుమార్–దిజు (పెట్రోలియం) జంటపై గెలుపొందింది. మహిళల డబుల్స్ విభాగంలో కేయూర మోపాటి జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో కేయూర (తెలంగాణ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 11–21, 17–21తో శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
, ,