సెమీస్‌లో రాహుల్ యాదవ్
న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణిస్తూ... హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరుగుతున్న రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో 19 ఏళ్ల ఈ హైదరాబాద్ కుర్రాడు తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 13–11, 11–5, 11–6తో కేవలం 22 నిమిషాల్లో వాంగ్ యుహాంగ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు.
శనివారం జరిగే సెమీఫైనల్లో రెండో సీడ్, ప్రపంచ 63వ ర్యాంకర్ వ్లాదిమిర్ మల్కోవ్ (రష్యా)తో రాహుల్ యాదవ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆనంద్ పవార్ (భారత్) 4–11, 11–7, 8–11, 3–11తో వ్లాదిమిర్ మల్కోవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ ద్వయం 7–11, 11–9, 11–8, 11–9తో మసాతో తకానో–యోషికి సుకమోతో (జపాన్) జంటపై గెలిచి సెమీస్‌కు చేరింది.
పోరాడి ఓడిన వృశాలి
మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి 11–8, 8–11, 12–10, 9–11, 9–11తో మూడో సీడ్ నటాలియా పెర్మినోవా (రష్యా) చేతిలో... ఆరో సీడ్ రసికా రాజే (భారత్) 2–11, 4–11, 7–11తో నత్సుకి నిదైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు.