
రంజిత్ బర్తకూర్
న్యూఢిల్లీ: ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్‌ను కుదించి... కేవలం భారత ఆటగాళ్లతోనే ఆడించాలని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ బర్తకూర్ సూచించారు. ఐపీఎల్–13పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉంది. గతంలో ఈనెల 15 వరకు లీగ్‌ను వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా ఉధృతి మరింత పెరిగింది. దీంతో విదేశీ ఆటగాళ్లతో ఆడించే పరిస్థితి లేకపోవడంతో రంజిత్ మాట్లాడుతూ ‘ఇది ఎలాగూ ఇండియన్ ప్రీమియర్ లీగే కాబట్టి ఈసారి పూర్తిగా మన ఆటగాళ్లకే పరిమితం చేసి... కుదించి ఆడించాలి. ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ ఇంతకుమించి ఏం చేయలేకపోవచ్చు. గతంలో కేవలం భారత ఆటగాళ్లతోనే నిర్వహించడం గురించి అసలు ఆలోచించే పరిస్థితే లేదు. కానీ ఇప్పుడు అంతా మారింది. నాణ్యమైన ఆటగాళ్లు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వీళ్లు కూడా విదేశీ ఆటగాళ్లకు దీటుగా రంజింప చేయగలరు’ అని అన్నారు. ఏదేమైనా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డేనని అది కూడా ఏప్రిల్ 15 తర్వాతేనని రంజిత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment