రాయల్స్ రాజసంగా... | Rajasthan Royals won match against Sunrisers team | Sakshi
Sakshi News home page

రాయల్స్ రాజసంగా...

Published Sat, Apr 19 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

రాయల్స్ రాజసంగా...

రాయల్స్ రాజసంగా...

సన్‌రైజర్స్‌పై గెలుపుతో రాజస్థాన్ శుభారంభం    
 రాణించిన రహానే   
 ఐపీఎల్-7
 
 కొత్త లుక్‌తో అదరగొడదామని బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. పేలవ ఆటతీరుతో బ్యాటింగ్‌లో విఫలం కాగా... బౌలర్లు ప్రారంభంలో వికెట్లు తీసినా ఆ తర్వాత లయ తప్పారు. మరోవైపు గత సీజన్‌లో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ దృష్టంతా విజయంపైనే అని వాట్సన్ సేన నిరూపించుకుని ఏడో సీజన్‌లో శుభారంభం  చేసింది.
 
 అబుదాబి: 31 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజింక్యా రహానే (53 బంతుల్లో 59; 6 ఫోర్లు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు పట్టు సాధిస్తున్న వేళ ఓపిగ్గా ఎదురు నిలిచి జట్టుకు కావాల్సిన పరుగులు సాధించాడు. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా... స్టువర్ట్ బిన్నీ (32 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) జట్టును ఒడ్డున పడేశాడు. తద్వారా షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్-7 మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.
 
  శిఖర్ ధావన్ (34 బంతుల్లో 38; 3 ఫోర్లు; 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 32; 1 ఫోర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లోకేశ్ రాహుల్ (18 బంతుల్లో 20; 1 ఫోర్; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ధావల్ కులకర్ణి, రిచర్డ్‌సన్, భాటియాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 135 పరుగులు చేసింది. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.
 
 ఆది నుంచీ తడబాటే..
 తొలి ఓవర్‌లోనే సన్‌రైజర్స్ ఓపెనర్ ఫించ్ (2) వికెట్‌ను కోల్పోయింది. దీంతో బరిలో స్టార్ హిట్టర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌లున్నా ఆటలో జోరు కనిపించలేదు. వికెట్ నెమ్మదించడంతో ఈ జోడి ఆచితూచి ఆడుతూ సింగిల్స్‌కే పరిమితమైంది. తొలి పవర్‌ప్లేలో 41 పరుగులు మాత్రమే చేయగలిగింది.  
 తొమ్మిదో ఓవర్‌లో ధావన్ బ్యాట్ నుంచి ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ నమోదైంది. ఆ తర్వాత ఓవర్‌లో బౌండరీతో టచ్‌లో కనిపించినా 12వ ఓవర్‌లో రజత్ భాటియా బౌలింగ్‌లో డీప్ స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 55 పరుగులు నమోదయ్యాయి. భాటియా తన మరుసటి ఓవర్‌లో వార్నర్‌ను అవుట్ చేయడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది.
 
 స్లాగ్ ఓవర్లలో తుపాన్ ఆటతీరును చూపే డారెన్ స్యామీ (6) జట్టును ఆదుకుంటాడని ఆశించినా తనూ నిరాశపరిచాడు. లోకేశ్ రాహుల్  ఉన్న కాసేపు వేగంగా ఆడినా వీరిద్దరు నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు.  చివర్లో వేణుగోపాల్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌కు ఆమాత్రం స్కోరైనా వచ్చింది.
 
  నిదానంగా...  
 రాజస్థాన్‌ను కూడా సన్‌రైజర్స్ తొలి ఓవర్‌లోనే దెబ్బతీసింది. స్టెయిన్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించిన నాయర్ (4) మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో ఓవర్‌లో యువ ఆటగాడు సామ్సన్ (3) ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
 
 నిలకడగా ఆడుతున్న రహానేకు తోడు కెప్టెన్ షేన్ వాట్సన్ (3) రాకతో ఇన్నింగ్స్ కుదుటపడుతుందనుకున్నప్పటికీ ఏడో ఓవర్‌లో ఇషాంత్ శర్మ గట్టి దెబ్బ తీశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ వెనుదిరిగాడు.
 
 రహానే, స్టువర్ట్ బిన్నీ జోడి మధ్య ఓవర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. స్యామీ బౌలింగ్‌లో బిన్నీ భారీ సిక్స్, ఫోర్ బాది స్కోరు వేగాన్ని పెంచాడు. ఆ తర్వాత వీరి ఇన్నింగ్స్‌లో దూకుడు కనిపించకపోయినప్పటికీ పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగారు. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతూ లక్ష్యాన్ని అందుకున్నారు.
 
 స్టెయిన్ వేసిన 15వ ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు సాధించిన రహానే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాతమిశ్రా తన వరుస ఓవర్లలో రహానే, హాడ్జ్‌ను అవుట్ చేసి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపాడు. అయితే బిన్నీ, ఫాల్క్‌నర్ (2 బంతుల్లో 8; 2 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు.
 
  స్కోరు వివరాలు
 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) రిచర్డ్‌సన్ (బి) కులకర్ణి 2; ధావన్ (సి) రిచర్డ్‌సన్ (బి) భాటియా 38; వార్నర్ (సి) రిచర్డ్‌సన్ (బి) భాటియా 32; రాహుల్ (సి) రహానే (బి) కులకర్ణి 20; స్యామీ (సి) సామ్సన్ (బి) రిచ ర్డ్‌సన్ 6; వేణుగోపాల్‌రావు నాటౌట్ 16; కరణ్ శర్మ (సి) హాడ్జ్ (బి) రిచర్డ్‌సన్ 4; స్టెయిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 133
 వికెట్ల పతనం: 1-2; 2-77; 3-82; 4-108; 5-111; 6-130.
 
 బౌలింగ్: కులకర్ణి 4-0-23-2; రిచర్డ్‌సన్ 4-0-25-2; ఫాల్క్‌నర్ 3-0-27-0; తాంబే 4-0-23-0; భాటియా 4-0-22-0; బిన్నీ 1-0-7-0.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) స్టెయిన్ 4; రహానే (సి) ఫించ్ (బి) మిశ్రా 59; సామ్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 3; వాట్సన్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 3; బిన్నీ నాటౌట్ 48; హాడ్జ్ (సి) స్యామీ (బి) మిశ్రా 1; ఫాల్క్‌నర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు) 135
 వికెట్ల పతనం: 1-4; 2-15; 3-31; 4-108; 5-111, 6-121
 బౌలింగ్: స్టెయిన్ 4-0-29-2; భువనేశ్వర్ 3.3-0-21-1; ఇషాంత్ 4-0-29-1; స్యామీ 2-0-19-0; మిశ్రా 4-0-26-2; కరణ్ శర్మ 2-0-8-0.
 
 ఐపీఎల్‌లో నేడు
 బెంగళూరు రాయల్ చాలెంజర్స్
 X
 ముంబై ఇండియన్స్
 సా. గం. 4.00 నుంచి
 
 కోల్‌కతా నైట్ రైడర్స్
 X
 ఢిల్లీ డేర్ డెవిల్స్
 రా. గం. 8.00 నుంచి
 వేదిక: దుబాయ్
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement