
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు అతను కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా కోచ్ తుషార్ అరోథే తప్పుకోవడంతో గత నెలలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు. ఇటీవలే పవార్ పర్యవేక్షణలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో భారత జట్టు శిక్షణా శిబిరం కొనసాగింది. ప్రపంచకప్‌కంటే ముందు భారత జట్టు శ్రీలంకలో పర్యటించి 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టి20 సిరీస్ తర్వాత వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. మహిళల జట్టు కోచ్ పదవి కోసం ఈ నెల 10నే బీసీసీఐ దరఖాస్తులు కోరింది.
20 మంది దీని కోసం పోటీ పడ్డారు. డయానా ఎడుల్జీ, రాహుల్ జోహ్రి, సబా కరీం వీరందరినీ పది నిమిషాల చొప్పున ఇంటర్వ్యూ చేశారు. అనంతరం జాబితాను ఆరుగురికి కుదించారు. పవార్‌తో పాటు మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, అతుల్ బెదాడే, కోహ్లి తొలి కోచ్ రాజ్‌కుమార్ శర్మ, మహిళల జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సనత్ కుమార్ ఈ జాబితాలో నిలిచారు. చివరకు పవార్‌కే అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌కు ఇప్పటికే పవార్‌ను కోచ్‌గా ప్రకటించిన నేపథ్యంలో కొద్ది రోజులకే జరుగనున్న వరల్డ్ కప్ వరకు కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో అతడి ఎంపిక ఖరారైనట్లుగా సమాచారం. భారత్ తరఫున 2 టెస్టులు ఆడిన 40 ఏళ్ల రమేశ్ పవార్, 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. 148 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అతను 470 వికెట్లు పడగొట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment