Ramesh Powar
-
'ఇప్పుడే సరైనోడి చేతుల్లోకి వెళ్లాం'.. టీమిండియా కెప్టెన్ కౌంటర్
భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్ రమేశ్ పవార్‌పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 6న బీసీసీఐ రమేశ్ పొవార్‌ను భారత మహిళల జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరగడం పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రధాన కారణమయింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ రమేశ్ పొవార్‌ను ఎన్సీఏకు బదిలీ చేసింది. ఇకపై ఎన్సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో పొవార్ కలిసి పనిచేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం రమేశ్ పొవార్‌పై పరోక్షంగా కౌంటర్ వేసింది. ఇండియా, ఆస్ట్రేలియా వుమెన్స్ ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు మేం సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నాం అంటూ తెలిపింది. అయితే పొవార్‌ను ఉద్దేశించే హర్మన్ ప్రీత్ ఇలా వ్యాఖ్యలు చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు. అయితే పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడం వెనుక హర్మన్‌ప్రీత్ హస్తం ఉందని హిందుస్థాన్ టైమ్స్ ఆరోపణలు చేసింది. పొవార్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాకు స్వయంగా లేఖ రాసినట్లు తెలిసింది. అయితే టీమిండియా మహిళా జట్టుకు పొవార్‌పై ముందు నుంచి మంచి అభిప్రాయం లేదు. ఇంతకముందు 2018 టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్‌ను పొవార్ పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మిథాలీ రిటైర్మెంట్ తర్వాత తన పుస్తకంలోనూ రమేశ్ పొవార్‌తో ఉన్న విబేధాలను బయటపెట్టింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చాలాసార్లు వివాదాల్లో నిలిచాడు. అందుకే హర్మన్‌ప్రీత్ స్వయంగ రంగంలోకి దిగి బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. ఇక కొత్త హెడ్‌కోచ్ ఎవరనే దానిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. అయితే 2021లో హృషికేష్ కనిత్కర్ హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసినప్పటికి అతనికి అవకాశం రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మాత్రం హృషికేష్ కనిత్కర్‌కు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మహిళల జట్టుకు పనిచేసే అవకాశం లభించింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ -
భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్
భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 9న ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా కనిత్కర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా హృషికేశ్ కనిత్కర్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అదే విధంగా భారత మహిళల జట్టు మాజీ హెడ్ కోచ్ రమేష్ పొవార్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికైన అనంతరం కనిత్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. "భారత సీనియర్ మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భారత జట్టులో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. మా జట్టులో సీనియర్ క్రికెటర్లతో పాటు అద్భుతమైన యువ క్రికెటర్లు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాకు పెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి. బ్యాటింగ్ కోచ్‌గా నా వంతు బాధ్యతలు నిర్వహించి జట్టును ముందుకు నడిపిస్తాను" అని కనిత్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ 🚨 NEWS 🚨: Hrishikesh Kanitkar appointed as Batting Coach - Team India (Senior Women), Ramesh Powar to join NCA More Details 🔽https://t.co/u3Agagamdd — BCCI (@BCCI) December 6, 2022 చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్! -
భారత మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన..!
Powar Foresees A New Captain Smriti Mandhana: గోల్డ్‌కోస్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఓటమి పాలైన భారత్ సిరీస్‌ను చేజార్చుకుంది. అంతక ముందు జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఓటమి పాలై ఘోర పరాభవాన్ని భారత్ మూటకట్టుకుంది. ఈ క్రమంలో జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్ కీలక వాఖ్యలు చేశారు. భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటుందని పవార్ తెలిపారు. టెస్టులో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని, ఏదో ఒకరోజు ఆమె జట్టును నడిపిస్తుందని ఆయన అన్నారు. "మేము ఆమెను భారత జట్టు సారధిగా చూడాలని అనుకుంటున్నాము. ‘ఆమె ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్‌గా ఉంది. ఏదో ఒక సమయంలో ఆమె ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఫార్మాట్‌కు స్మృతి కెప్టెన్‌గా ఎంపిక అవుతోందో నాకు తెలియదు. బీసీసీఐ, సెలెక్టర్లు, నేను తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాము’ అని పవార్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగినన రెండో వన్డే మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 127 పరుగులు చేసి డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లోను 52 పరుగులు చేసి రాణించింది. చదవండి: IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన -
ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం..
ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై జట్టు హెడ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో అతని స్థానంలో ముజుందార్‌ను ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన ముంబై కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తదితర మాజీలు పోటీపడ్డా, చివరకు ఆ పదవి ముజుందార్‌నే వరించింది. ఈ పదవి కోసం మొత్తం 9 మంది మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా.. జతిన్ పరాంజ్పే, నీలేశ్ కులకర్ణి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ కమిటీ ముజుందార్వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, ముంబై కొత్త కోచ్‌గా ఎంపికైన మజుందార్ 1994-2013 మధ్యకాలంలో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.1 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 60 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్ -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్‌కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్ వివరణ ఇచ్చారు. -
రమేశ్ పొవార్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.. రెండోసారి
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్ మరోసారి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం తన ట్విటర్లో షేర్ చేసింది. టీమిండియా వుమెన్స్ హెడ్‌కోచ్ పదవికి మొత్తం 35 అప్లికేషన్స్ రాగా.. ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ హెడ్‌కోచ్‌గా పొవార్‌కే ఓటు వేసింది. కమిటీ సిఫార్సు మేరకు బీసీసీఐ కూడా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా ప్రస్తుతం టీమిండియా మహిళల కోచ్‌గా ఉన్న డబ్ల్యూవీ రామన్ నుంచి పొవార్ బాధ్యతలు తీసుకోనున్నారు. 2018 డిసెంబర్లో పొవార్ నుంచే బాధ్యతలు తీసుకున్న రామన్ జట్టును విజయవంతంగా నడిపాడు. 2020 టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ సేన ఫైనల్‌దాకా వెళ్లడంలో రామన్ కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పొవార్ 2018లో టీమిండియా మహిళల జట్టుకు కొంతకాలం పాటు హెడ్ కోచ్‌గా సేవలందించాడు. అప్పటి కోచ్ తుషార్ ఆరోతే పదవికి రాజీనామా చేయడంతో బాధ్యతలు తీసుకున్న పొవార్ నవంబర్ 30, 2018 వరకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇక పొవార్ టీమిండియా తరపున 31 వన్డే మ్యాచ్‌లాడి 34 వికెట్లు.. 2 టెస్టులాడి 6 వికెట్లు తీశాడు. గతంలో సీనియర్ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా పొవార్ గతంలో మూడు నెలల కాలనికి మాత్రమే కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పొవార్‌ను కొనసాగించడానికి ఇష్టపడని బీసీసీఐ.. డబ్యూవీ రామన్‌ను కోచ్‌గా నియమించింది. కాగా, మళ్లీ తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న పొవార్.. అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసి భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా మరొకసారి ఎంపిక కావడం విశేషం. చదవండి: ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా... NEWS: Ramesh Powar appointed Head Coach of Indian Women’s Cricket team Details 👉 https://t.co/GByGFicBsX pic.twitter.com/wJsTZrFrWF — BCCI Women (@BCCIWomen) May 13, 2021 -
క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పదవి కోసం భారీ పోటీ
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అనేక మంది ఈ పదవి కోసం దరఖాస్తులు దాఖలు చేశారు. ఇందులో ప్రస్తుత కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో పాటు గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన రమేశ్ పొవార్, తుషార్ అరోథే కూడా ఉన్నారు. రామన్ శిక్షణలో భారత జట్టు 2020 టి20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. ఈ ఏడాది మార్చితో ఆయన పదవీకాలం పూర్తి కావడంతో బీసీసీఐ కొత్తగా దరఖాస్తులు కోరింది. రామన్‌కు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆసక్తికరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మహిళలు ఈసారి కోచ్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మాజీ చీఫ్ సెలక్టర్ హేమలత కలా, మమతా మాబెన్, జయా శర్మ, సుమన్ శర్మ, నూషీన్ అల్ ఖదీర్ కోచ్ పదవిని ఆశిస్తున్నారు. భారత మహిళల సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ ఇటీవల జాతీయ జట్టు మహిళల కోచ్ ఉంటే బాగుంటుందని అభిప్రాయం వెల్లడించిన నేపథ్యంలో ఇలాంటి స్పందన రావడం ఆసక్తికరం. గతంలో పూర్ణిమా రావు 2017 ఏప్రిల్ వరకు టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. మదన్‌లాల్ నేతృత్వంలోనే క్రికెట్ సలహా కమిటీ కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తుంది. అయితే ఇంటర్వూ్య తేదీలను బోర్డు ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకున్నవారిలో హేమలత ఇటీవల యూపీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించింది. సుమన్ కూడా భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేయగా... మాబెన్కు బంగ్లాదేశ్, చైనా జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. మాజీ క్రికెటర్ నూషీన్ కూడా కోచ్‌గా ఎంతో అనుభవం గడించింది. చదవండి: రామన్‌కే అవకాశం! -
ముంబై కోచ్‌గా రమేశ్ పొవార్ నియామకం
సాక్షి, ముంబై: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం నియమించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన 42 ఏళ్ల పొవార్.. గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. పొవార్ నియామకం ప్రస్తుతానికి తాత్కాలికమే(ప్రస్తుత సీజన్) అయినప్పటికీ.. జట్టు అవసారాల దృష్ట్యా భవిష్యత్త్‌లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎంసీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అమిత్ పాగ్నిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కోచ్ పదవికి ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్, రమేశ్ పొవార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సెలక్టర్లు రమేశ్ పొవార్వైపే మొగ్గు చూపారు. -
భారత ‘ఎ’ జట్టు బౌలింగ్ కోచ్‌గా రమేశ్ పొవార్
ముంబై: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టు బౌలింగ్ కోచ్‌గా రమేశ్ పొవార్‌ను నియమించారు. తిరువనంతపురంలో గురువారం మొదలయ్యే ఈ సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు, ఐదు అనధికారిక వన్డేలు జరుగుతాయి. టీమిండియా తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ భారత మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అదే సమయంలో సీనియర్ సభ్యురాలు మిథాలీ రాజ్, పొవార్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదం తర్వాత మరోసారి అతను మహిళల జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రమేశ్ పొవార్‌ను కాదని డబ్ల్యూవీ రామన్‌ను మహిళల జట్టుకు కోచ్‌గా నియమించింది. -
ఈసారి భారత-ఏ బౌలింగ్ కోచ్‌గా..
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేసిన మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను తాజాగా భారత్-ఏ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించారు. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్న పొవార్ భారత యువ జట్టు బౌలింగ్ కోచ్ నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. గతేడాది భారత మహిళా జట్టుకు నాలుగు నెలలు పాటు పొవార్ కోచ్‌గా పని చేశాడు. ఆ సమయంలో మిథాలీ రాజ్‌తో వివాదం చోటు చేసుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన సెమీ ఫైనల్‌కు మిథాలీని తప్పించడంతో వివాదం రాజుకుంది. ఇందుకు పొవారే కారణమనే వాదన వినిపించింది. అయితే ఆ తర్వాత భారత మహిళా జట్టు కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించగా, పొవార్ కూడా అందుకు అప్లై చేసుకున్నాడు. కాగా, డబ్యూ వీ రామన్‌ను బీసీసీఐ సలహా కమిటీ ఎంపిక చేయడంతో పొవార్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఇటీవల భారత అండర్-19 జట్లుకు సంబంధించి బీసీసీఐ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పవార్ హాజరవుతుండటంతో భారత-ఏ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కావడానికి మార్గం సుగమం అయ్యింది. అయితే దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో స్వదేశంలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో మాత్రమే పొవార్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత్ తరఫున 31 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు పొవార్ ఆడాడు. -
ఇక ఆటమీదే మనసు పెట్టాలి!
కోల్‌కతా: గతాన్ని మరిచి మళ్లీ క్రికెట్ మీదే దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత మహిళల వన్డే సారథి మిథాలీరాజ్ తెలిపింది. కొత్త కోచ్ నియామకంతో కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదం ముగిసిన అధ్యాయమని ఆమె పేర్కొంది. మహిళల సెలక్షన్ కమిటీ కివీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన వన్డే, టి20 జట్లలో మిథాలీకి సముచిత గౌరవం ఇచ్చిన సంగతి తెలిసిందే. వన్డేల్లో ఆమె సారథ్యంపై నమ్మకముంచిన సెలక్టర్లు టి20 జట్టులోనూ ఆమెను కొనసాగించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఇక్కడికొచ్చిన ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘ ఈ వివాదం చేదు అనుభవాన్నిచ్చింది. ఇది మా అందరినీ బాగా ఇబ్బందిపెట్టింది. ఇప్పుడైతే అంతా కుదుటపడింది. ఇక పూర్తిగా ఆటపై, జట్టుపై దృష్టిపెడతా’ అని మిథాలీ చెప్పింది. ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్‌కు పక్కనబెట్టడం తనను, తన కుటుంబసభ్యుల్ని తీవ్రంగా బాధించిందని వివరించింది. ‘తుది జట్టులో చోటు, కోచ్‌తో వివాదం ఇంత పెద్దదవడం మహిళల క్రికెట్‌కు మంచిది కాదు. ఆటతీరు కంటే క్రికెటేతర అంశాలే చర్చనీయాంశం కావడం... ఆటకు ఇబ్బందికరం. కివీస్ పర్యటన కోసం సన్నద్ధం కావాలి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి’ అని హైదరాబాదీ స్టార్ బ్యాట్స్‌మన్ చెప్పింది. కోచ్ పొవార్‌పై మిథాలీ ఆవేదన వ్యక్తం చేయగా, మరోవైపు టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధానలు కోచ్‌కు మద్దతివ్వడంతో జట్టు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలొచ్చాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ క్రికెటర్లు, సహాయ సిబ్బంది అంతా కలిసి ఓ క్రికెట్ కుటుంబంగా మెలుగుతామని, అయితే అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమని చెప్పింది. ‘ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఆలోచించరు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఆట ముందు ఇవన్నీ పెద్ద సమస్యలేమీ కావు. మా ప్రాధాన్యం క్రికెటే. ఓసారి బరిలోకి దిగగానే ఆటే మా సర్వస్వమవుతుంది. ఆటలో నెగ్గేందుకు అంతా ఒక్కటవుతాం. అప్పుడు జట్టే కనిపిస్తుంది. మంచి ప్రదర్శనే మా లక్ష్యమవుతుంది. ఇతరత్రా అంశాలేవీ గుర్తుండవు’ అని మిథాలీరాజ్ తెలిపింది. కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్‌పై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని, అయితే ఆయనను ఇంతకుముందు జాతీయ క్రికెట్ అకాడమీలో కలిశానని పేర్కొంది. 2007లో కివీస్ పర్యటనకు వెళ్లిన అనుభవం తనకు, జులన్‌కి మాత్రమే ఉందని, ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్ తమకు చాలా ముఖ్యమైందని ఆమె చెప్పింది. -
మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎవరో తెలుసా?
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్ ఎంపికయ్యారు. గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్ వంటి హేమాహేమీలను అధిగమించి కోచ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనను మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్ అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ గురువారం ఇంటర్వ్యూ చేసి.. ఎంపిక చేసింది. తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు కోచ్ బాధ్యతలు నిర్వహించిన రమేశ్ పొవార్ పదవీకాలం గత నెల 30తో ముగియడంతో కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. (ఆ ఒక్కరు ఎవరో?) డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న 53 ఏళ్ల రామన్.. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించారు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన ఆయన ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. టీమిండియా తరపున 11 టెస్టులు ఆడి 448 పరుగులు చేశారు. 27 వన్డేల్లో 617 పరుగులు సాధించారు. ఈ రెండు ఫార్మాట్లలో రెండేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. -
ఆ ఒక్కరు ఎవరో?
ముంబై: డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ప్రచారానికి ప్రచారం వస్తుండటంతో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి ఇప్పుడొక హాట్ కేక్‌లా మారిపోయింది. ఒకప్పుడు హడావుడే లేకుండా, చాలా సాదాసీదాగా సాగిపోయి, ఎవరిని ఎంపిక చేశారో మీడియాలో వస్తేగాని తెలియనంతగా సాగిన ప్రక్రియ... నేడు స్వదేశీయులతో పాటు దిగ్గజాలనదగ్గ విదేశీ మాజీ కోచ్‌లు కూడా పోటీ పడే స్థాయికి వచ్చింది. పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పది మందికి కుదించి, కమిటీ ఏర్పాటు చేసి వారిలో ఒకరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే దశకు చేరింది. దరఖాస్తులు 28... మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవరో తేల్చే బాధ్యతను దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీ చేతుల్లో పెట్టారు. మాజీ క్రికెటర్లు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఈ కమిటీలోని ఇతర సభ్యులు. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పదవికి మొత్తం 28 దరఖాస్తులు రాగా 10 మందిని (గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, దిమిత్రి మస్కరెనాస్, బ్రాడ్ హగ్‌తో పాటు తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, భారత మాజీ క్రికెటర్లు మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రామన్, వెంకటేశ్ ప్రసాద్) షార్ట్‌లిస్ట్ చేశారు. కపిల్ కమిటీ వీరికి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. రాయ్ అలా.. ఎడుల్జీ ఇలా.. మరోవైపు కోచ్ ఎంపికపై సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ పూర్తి భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాలని రాయ్... బీసీసీఐని ఆదేశించగా, పొవార్‌ను వచ్చే నెలలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటన వరకైనా కొనసాగించాలని ఎడుల్జీ కోరుతున్నారు. ఎవరి అవకాశం ఎంత? రమేశ్ పొవార్: తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు ఇతడు బాధ్యతలు నిర్వర్తించాడు. గత నెల 30తో ఒప్పందం పూర్తయింది. ప్రపంచకప్ సెమీస్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీరాజ్‌ను ఆడించకపోవడంతో తీవ్రంగా వివాదాస్పదుడయ్యాడు. కోచ్ వ్యవహార శైలిపై మిథాలీ నేరుగా ధ్వజమెత్తింది. మొదట రేసులో లేకున్నా టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కోరడంతో మళ్లీ పోటీలో నిలిచానంటున్నాడు. ఎడుల్జీ మద్దతు కూడా ఉంది. అయితే... ఇంత జరిగాక, ఆటగాడిగానూ గొప్ప రికార్డులు లేని పొవార్‌ను మళ్లీ ఎంపిక చేస్తారా? అన్నది సందేహమే. గ్యారీ కిర్‌స్టెన్: గొప్ప బ్యాట్స్‌మన్, అంతేస్థాయిలో కోచ్‌గానూ ఫలితాలు రాబట్టాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించడంలో కిర్‌స్టెన్ పాత్ర అందరికీ తెలిసిందే. స్నేహభావంతో ఉంటూనే ఆటగాళ్ల నుంచి ఫలితాలను రాబట్టుకోగల నేర్పరి. ప్రొఫెషనల్‌గా చెప్పాలంటే ఈ దశలో మహిళల జట్టుకు కావాల్సిన కోచ్. వెంకటేశ్ ప్రసాద్: టీమిండియా మాజీ పేసర్. మన జాతీయ, అండర్–19 జట్లతో పాటు బంగ్లాదేశ్, ఐపీఎల్‌లోనూ కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. నెమ్మదస్తుడు. అయితే, కోచ్‌గా గొప్ప ఫలితాలు రాబట్టిన రికార్డు లేదు. 2009లో పురుషుల జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్‌ను బీసీసీఐ అర్ధంతరంగా తొలగించింది. అయితే, వివాదాలకు దూరంగా ఉండే స్వదేశీ కోచ్ కావాలనుకుంటే మొగ్గు ఇతడివైపే ఉంటుంది. మనోజ్ ప్రభాకర్: కపిల్‌దేవ్‌తో ఒకప్పుడు కొత్త బంతిని పంచుకున్న భారత మాజీ ఆల్ రౌండర్. తర్వాత కపిల్‌తో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌లో నిషేధానికి గురయ్యాడు. రెండేళ్ల క్రితం భారత్‌లో టి20 ప్రపంచకప్ ఆడిన అఫ్గానిస్తాన్ కోచ్ ప్రభాకరే. ఢిల్లీ రంజీ జట్టు బౌలింగ్ కోచ్‌గా, రాజస్తాన్ హెడ్ కోచ్‌గా పనిచేశాడు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఢిల్లీ ఇతడికి ఉద్వాసన పలికింది. గిబ్స్: మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాల్లో తీవ్ర వివాదాస్పదుడు. బ్యాట్స్‌మన్ అయినప్పటికీ కోచ్‌గా రికార్డేమీ లేదు. ఆటలోలాగే ప్రవర్తనలోనూ దూకుడైన గిబ్స్‌ను మహిళల జట్టు శిక్షకుడిగా నియమించడం అంటే... కొత్త రకం వివాదాలను కోరి తెచ్చుకోవడమే. డబ్ల్యూవీ రామన్: టీమిండియా మాజీ ఓపెనర్. ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇంటర్వ్యూలో మెప్పించగలిగితే అవకాశం ఉండొచ్చు. -
కిర్‌స్టెన్ మళ్లీ వస్తున్నాడా?
ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ మరోసారి టీమిండియా కోచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సారి పురుషుల జట్టుకు కాకుండా మహిళల జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. భారత మహిళల జట్టుకు నూతన కోచ్ నియామకంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇప్పుటికే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పది మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిని బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ ఇంటర్వ్యూ చేయనుంది. అందుబాటులో లేని వారు స్కైప్ ద్వారా కూడా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని బీసీసీఐ తెలిపింది. (కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర్మన్ లేఖ) ఇంటర్వ్యూ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తోపాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్, తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, బ్రాడ్ హాగ్, డిమిట్రి మస్కరెన్హాస్లు ఇంటర్వ్యూకు హాజరవనున్నారు. కోచ్ పదవి కోసం ఏర్పాటు చేసిన బీసీసీఐ సెలక్షన్ ప్యానల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. (పొవార్ కోచింగ్ ముగిసింది...) మొదటి నుంచి టీమిండియాకు నూతన కోచ్ అవసరం లేదంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో సభ్యురాలైన డియానా ఎడుల్జీ వాదిస్తున్నా.. చైర్మన్ వినోద్ రాయ్ మాత్రం పొవార్ కోచింగ్‌పై సుముఖత వ్యక్తం చేయటం లేదు. దీంతో భారత మహిళల క్రికెట్ నూతన కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ) కిర్‌స్టెన్‌కే అవకాశం? మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు గ్యారీ కిర్‌స్టెన్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. వివాదరహితుడిగా పేరొందడం, నైపుణ్యం, కోచింగ్‌లో అనుభవరీత్యా కోచ్ పదవి కిర్స్టెన్నే వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడిని మరలా కోచ్‌గా నియమించే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. అయితే టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతు ఉండటం పొవార్‌కు కలిసొచ్చే అంశం. సఫారీ మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్కు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. స్వదేశీ కోచ్‌నే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్) -
కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర్మన్ లేఖ
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ జట్టుకు నూతన కోచ్ కోసం ఇటీవల బీసీసీఐ ప్రకటన విడుదల చేయడంతో ఇక రమేశ్ పొవార్‌కు ద్వారాలు మూసుకుపోయినట్టే అని అంతా భావించారు. కోచ్‌గా అతనికిచ్చిన గడువు క్రితం నెల 30వ తేదీతో ముగిసిపోవడంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే మిథాలీ రాజ్‌తో వివాదం కారణంగా పొవార్ మళ్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేవనే వాదన వినిపించింది. అయితే తాజాగా టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధన జోడీ పొవార్‌కు మద్దతుగా నిలిచింది. అతడి ఆధ్వర్యంలో జట్టు మెరుగ్గా ఆడిందని కోచ్‌గా మరికొంత కాలం కొనసాగించాలని వీరిద్దరు బోర్డుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత నెల 30తో పొవార్‌తో ఒప్పందం ముగిసింది. దీన్ని పొడిగించేందుకు బీసీసీఐ కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్, మంధన మాత్రం తమకు కోచ్‌గా రమేశ్ పొవారే కొనసాగాలంటూ బోర్డుకు విడిగా లేఖ రాశారు. వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు అతడికే బాధ్యతలు అప్పగిస్తే మంచిదని కోరారు. అలాగే మిథాలీని ఆడించకపోవడంపై కూడా లేఖలో వివరించారు. ‘కొన్ని నెలలుగా మా జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు వచ్చిందో మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రపంచ టాప్ జట్లకు దీటుగా ప్రదర్శన ఇవ్వగలిగాం. దీనికంతటికీ కారణం రమేశ్ పొవార్ శిక్షణే. స్వల్పకాలంలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సాంకేతికంగా, వ్యూహాత్మకంగా భారత మహిళల జట్టును సమూలంగా మార్చా డు. ఇక సెమీస్‌లో ఓటమితో పాటు ఆ మ్యాచ్ చుట్టూ వివాదాలు నెలకొనడం మరింతగా బాధించింది. మిథాలీని తప్పించడం జట్టు వ్యూహంలో భాగంగానే జరిగింది. కెప్టెన్‌గా నేను, వైస్‌కెప్టెన్, కోచ్, సెలెక్టర్ అంతాకలిసి మేనేజర్ సమక్షంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమది. వచ్చే టీ20 ప్రపంచక్‌పకు మరో 15 నెలల సమయమే ఉంది. మరో నెలలో న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లాలి. ఈనేపథ్యంలో జట్టు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మరో కొత్త కోచ్ కాకుండా పొవార్‌నే కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు. అటు స్మృతి కూడా పొవార్ ఆధ్వర్యంలోనే తమ జట్టు వరుసగా 14 టీ20 మ్యాచ్‌లను నెగ్గిందని గుర్తుచేసింది. అందుచేత పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలంటూ పేర్కొన్నారు. కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం.. నాట్ ఎ గుడ్ లీడర్షిప్ -
పొవార్ కోచింగ్ ముగిసింది...
న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే సారథి మిథాలీ రాజ్‌ను తుది జట్టుకు దూరం చేసిన వివాదంలో కేంద్రబిందువైన కోచ్ రమేశ్ పొవార్ కథ ముగిసింది. ఎలాంటి చర్యలు లేకుండానే, ఎవరు జోక్యం చేసుకోకుండానే అతని కోచింగ్‌కు తెరపడింది! ఎలాగంటే... ఈ మాజీ స్పిన్నర్‌ను కేవలం మూడు నెలల కాలానికే కోచ్‌గా నియమించారు. శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా కొత్త కోచ్ నియామక ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే సీనియర్ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా మళ్లీ పొవార్ కోచ్ పదవి చేపట్టే అవకాశం లేదు. ఆయన దరఖాస్తు చేసినా బీసీసీఐ ఈ ప్రక్రియలో పొవార్ పేరును పరిశీలించేందుకు సిద్ధంగా లేదు. హర్మన్, మిథాలీల మధ్య సఖ్యతపై బీసీసీఐ మాత్రం సానుకూల దృక్పథాన్ని ప్రకటించింది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు కలిసి పని చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బీసీసీఐ సీనియర్ మహిళల ఎలైట్ ‘ఎ’ గ్రూప్ వన్డే లీగ్ పోటీలు నేటి నుంచి విజయవాడలోని మూలపాడు మైదానంలో జరుగుతాయి. ఇందులో నేడు గోవాతో జరిగే మ్యాచ్‌లో రైల్వేస్ తరఫున మిథాలీరాజ్ బరిలోకి దిగుతుంది. రేసులో ఎవరంటే... కొత్త కోచ్ అన్వేషణలో టామ్ మూడీ, డేవ్ వాట్మోర్, వెంకటేశ్ ప్రసాద్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టామ్ మూడీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్‌గా విజయవంతమయ్యారు. వాట్మోర్ 1996లో శ్రీలంకను విశ్వవిజేతను చేయడంలో సఫలమయ్యా రు. ఏదేమైనా... ప్లేయర్లకు, కోచ్‌కు మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్ర త్తగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. కోచ్ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 14 ఆఖరి తేదీ కాగా 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. -
పొవార్ చాలు ఇక.. పో?
సాక్షి, ముంబై: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రమేశ్ పొవార్‌ను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కోచ్‌గా నేటి(శుక్రవారం)కి పొవార్ కాంట్రాక్టు పూర్తవనుండటంతో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులు కోరుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆహ్వానించింది. అయితే.. మళ్లీ కోచ్ కోసం పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు బీసీసీఐ అంత సుముఖంగా లేన్నట్లు తెలుస్తోంది. మిథాలీ రాజ్‌ని తప్పిం చడం గురించి టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రస్తావిస్తూ, విరాట్ కోహ్లికి కూడా ఇలాగే చేస్తారా అని ప్రశ్నించడంతో బీసీసీఐ సమాలోచనలో పడినట్టు సమాచారం. (అడుగడుగునా అవమానించారు ) వెస్టిండీస్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను పక్కకు పెట్టడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. మంచి ఫామ్ మీదున్న మిథాలీని తప్పిస్తూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కోచ్ రమేష్ పొవార్, సెలెక్టర్ సుధా షా నిర్ణయం పట్ల అటు ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ) ఇక కోచ్ తనను అవమానించినట్లు మిథాలీ రాజ్ ఆవేదన వ్యక్తం చేయడం, సీనియర్లతో భేదాభిప్రాయాలు, విపరీతమైన ఈగో, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు గెలిచిన జట్టునే కొనసాగించాలని పట్టుబట్టడం వంటి కారణాలు పొవార్‌కు వ్యతిరేకంగా మారాయి. అటు సోషల్ మీడియాలో మిథాలీకి పెద్ద ఎత్తున మద్దతు పెరగటం, రమేష్ పొవార్‌ను ట్రోల్ చేస్తుండటం తెలిసిందే. (మిథాలీ బెదిరించింది: పొవార్) -
ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న వివాదాలతో తన జీవితంలో చీకట్లు అలముకున్నాయని భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ట్విట్టర్ వేదికగా ఆవేదనను మరోసారి వెళ్లగక్కారు. 'నేను చాలా విషాదానికి లోనైయ్యాను. నాకు విలువ లేకుండా జట్టులో నుంచి తీసెయ్యడం చాలా బాధనిపిస్తుంది. జట్టు పట్ల చూపించిన నిబద్ధత, 20ఏళ్ల పాటు దేశం కోసం పడ్డ కృషి అంతా నీరుగారిపోయింది. కఠిన శ్రమ, స్వేదం చిందించి మైదానంలో ఆడిన రోజు, నా బాధ అంతా మట్టి కలిసిపోయాయి. చివరికి జట్టులో నా పాత్రే అనుమానంగా మారింది. నా ప్రతిభ పట్ల అనుమానాలు మొదలైయ్యయి. ఇన్నేళ్లు ఆడి సాధించినదంతా మరుగున పడిపోయింది. నా జీవితంలో ఇదొక విషాదకరమైన రోజు, దేవుడే నాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మిథాలీని తప్పించారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్ రమేశ్ పొవార్, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేశారు. వారి వల్లే తనకు న్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్ పంపారు. ఈ వివాదంపై మిథాలీ రాజ్ తొలిసారి లేఖ ద్వారా స్పందించారు. జట్టు కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారంటూ.. మిథాలీ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసిన జట్టు కోచ్ రమేశ్ పొవార్.. మిథాలీపై పలు ఆరోపణలు చేశారు. మిథాలీ ఓపెనర్‌గా ఆడతానని పట్టుబట్టిందని.. లేదంటే ప్రపంచకప్ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పొవార్ బోర్డుకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మిథాలీ రాజ్ ట్విట్టర్ వేదికగా మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. I'm deeply saddened & hurt by the aspersions cast on me. My commitment to the game & 20yrs of playing for my country.The hard work, sweat, in vain. Today, my patriotism doubted, my skill set questioned & all the mud slinging- it's the darkest day of my life. May god give strength — Mithali Raj (@M_Raj03) 29 November 2018 -
మిథాలీ బెదిరించింది: పొవార్
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని జట్టు కోచ్ రమేశ్ పొవార్ అంగీకరించాడు. ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో తెలిపాడు. కోచ్‌పై ఒత్తిడి పెంచడం, బ్లాక్మెయిల్ చేయడం, తన కోసం జట్టు ప్రయోజనాలు పణంగా పెట్టడం ఆమె మానుకోవాలని అతడు పేర్కొన్నాడు. విస్తృత పరిధిలో ఆలోచించి భారత మహిళా క్రికెట్ మేలు కోసం ఆమె పని చేస్తే బాగుంటుందన్నాడు. తనపై మిథాలీ చేసిన ఆరోపణలకు సంబంధించి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసి బుధవారం వివరణ ఇచ్చాడు. ‘మిథాలీతో తన సంబంధాలు బాగా లేవని రమేశ్ అంగీకరించాడు. ఆమెలో కలుపుగోలుతనం లేదని, వ్యవహారశైలి కూడా చాలా సంక్లిష్టమని రమేశ్ పొవార్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ నుంచి తప్పించడం వ్యూహంలో భాగమే తప్ప దురుద్దేశంతో చేయలేదని కూడా అతను అన్నాడు. ‘మిథాలీ రాజ్ స్ట్రయిక్ రేట్ తక్కువ ఉండటంతోపాటు గెలిచిన జట్టును కొనసాగించాలనుకోవడమే కారణమనే తన మాటకు పొవార్ కట్టుబడ్డాడు’ అని బీసీసీఐలోని కీలక అధికారి ఒకరు వెల్లడించాడు. అయితే పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో లీగ్ మ్యాచ్‌ల సమయంలో మిథాలీ రాజ్ స్ట్రయిక్‌రేట్ గుర్తుకు రాలేదా అనే ప్రశ్నకు రమేశ్ పొవార్ నుంచి స్పందన లేదని సమాచారం! మిథాలీని తప్పించే విషయంలో బయటి నుంచి ఎవరైనా బలమైన వ్యక్తుల ఒత్తిడి ఉందా అనే ప్రశ్నపై స్పందిస్తూ తాను ఎవరి ఫోన్లు కూడా అందుకోలేదని కోచ్ జవాబిచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తను రమేశ్ పొవార్ తిరస్కరించాడు. -
అడుగడుగునా అవమానించారు
ప్రపంచకప్ సెమీఫైనల్ ప్రారంభమయ్యే కొన్ని క్షణాల ముందే మ్యాచ్ ఆడటం లేదనే సమాచారం... ప్రాక్టీస్ చేయడానికి వెళితే మొహం తిప్పుకునే కోచ్... తుది జట్టులో లేకపోతే మైదానంలోకే అడుగు పెట్టవద్దనే ఆంక్షలు... మ్యాచ్ ఆసాంతం డ్రెస్సింగ్ రూమ్‌లోనే బందీ... వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన రోజు నుంచి అవమానాలు... అసలు ఆమె తమ జట్టు సభ్యురాలే కాదన్నట్లుగా వ్యవహరించడం... దాదాపు 20 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ లెక్కలేనన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకొని మహిళా క్రికెట్‌కు పర్యాయపదంగా నిలిచిన మిథాలీ రాజ్‌కు ఎదురైన అవమానాలు ఇవి! ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా మిథాలీని పక్కన పెట్టడంతో మహిళల క్రికెట్లో కొత్త వివాదం రేగింది. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్ రమేశ్ పొవార్ వ్యవహరించారని మిథాలీ ఆరోపించింది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తర్వాత అవమానకర రీతిలో తనతో ప్రవర్తించారని హైదరాబాద్ ప్లేయర్ కన్నీళ్లపర్యంతమైంది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను ఉద్దేశించి మిథాలీ సుదీర్ఘ లేఖ రాసింది. మిథాలీ లేఖ ఆమె మాటల్లోనే... డియర్ రాహుల్ సర్, సబా... నా ఫిర్యాదును వినిపించే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా భారత్ తరఫున ఆడిన నేను ఆటగాళ్ల సమస్యలను విని పరిష్కరించడంలో బీసీసీఐ అండగా నిలవడం తెలుసు. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మొదటిసారి తీవ్ర నిరాశకు గురై కుప్పకూలిపోయినట్లు అనిపిస్తోంది. అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని చేస్తున్న ప్రయత్నం చూస్తే దేశానికి ఇన్నేళ్ల పాటు నేను చేసిన సేవలకు ఎలాంటి విలువ లేదేమో అనిపిస్తోంది. సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీపై నాకు అపార గౌరవం, నమ్మకం ఉన్నాయి. కానీ వెస్టిండీస్‌లో నాకు ఎదురవుతున్న పరిస్థితుల గురించి ఆమెతో మాట్లాడిన తర్వాత కూడా నాకు వ్యతిరేకంగా ఆమె తన పదవిని ఉపయోగించుకుంటుందని ఊహించలేదు. పైగా అన్నీ తెలిసి కూడా సెమీఫైనల్లో నన్ను పక్కన పెట్టడంలో తప్పేమీ లేదని, జట్టు ఎంపిక సీఓఏ పని కాదు అంటూ ఆమె మీడియాలో వ్యాఖ్యానించడం నన్ను తీవ్రంగా బాధించింది. దీన్ని బట్టి చూస్తే అధికారంలో ఉన్నవారి అండ ఉంటే చాలు ఎవరైనా ఏదైనా చేసేయవచ్చు... తప్పు ఒప్పులను పట్టించుకునేవాడే లేరని అనిపిస్తుంది. ఈ లేఖ తర్వాత మరింత మంది నన్ను లక్ష్యంగా చేసుకుంటారని నాకు తెలుసు. ఆమె సీఓఏ సభ్యురాలు అయితే నేను ఒక ప్లేయర్‌ను మాత్రమే. సెమీఫైనల్‌కు ముందు వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లలో నేను రెండు అర్ధ సెంచరీలు చేసి రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాననే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాను. నన్ను సెమీస్ నుంచి తప్పించి మెరుగ్గా ఆడుతున్న ముగ్గురు బ్యాటర్లతోనే బరిలోకి దిగాలనే నిర్ణయం నాతో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.నిబంధనలను గౌరవిస్తూ నేను తాజా ఘటనల గురించి మీడియాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజాలు తెలుసుకొని బీసీసీఐ న్యాయం చేస్తుందని నమ్మడం కూడా దానికి కారణం. కానీ ఏ మాత్రం సిగ్గు పడకుండా సీఓఏ సభ్యురాలు పక్షపాతంతో నాకు ప్రతికూల నిర్ణయాన్ని ముందే తీసుకున్నారేమో అనిపిస్తోంది. నన్ను ఆడించరాదనే కోచ్ నిర్ణయానికి మద్దతు పలికి నన్ను బాధకు గురి చేసిందనే తప్ప టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని కూడా స్పష్టం చేయదలిచాను. దేశం తరఫున ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నాను కాబట్టి బంగారు అవకాశం కోల్పోయామని బాధ పడ్డాను. మేమిద్దరం సీనియర్లం. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోగలం. జట్టులో హర్మన్ విలువేమిటో వన్డే కెప్టెన్‌గా నాకు బాగా తెలుసు. అయితే ఇంతకుముందే చెప్పినట్లు నా సమస్య అంతకంటే తీవ్రమైంది. నా సమస్యల్లా కోచ్ రమేశ్ పొవార్తోనే. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే అసలు విషయం పక్క దారి పడుతున్నట్లు అనిపించింది. మేము వెస్టిండీస్‌లో అడుగు పెట్టగానే కోచ్‌తో నా ఇబ్బందులు మొదలయ్యాయి. నాతో అతను భిన్నంగా ప్రవర్తించడం, వివక్ష చిన్న చిన్న విషయాల్లో కనిపిస్తూనే ఉంది కానీ నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు. శ్రీలంక పర్యటన మొదలు ఆస్ట్రేలియా ‘ఎ’తో మ్యాచ్‌లు, వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లలో కూడా నేను ఓపెనింగ్ చేశాను. ఒకరోజు ప్రాక్టీస్ తర్వాత కోచ్ నా దగ్గరకు వచ్చి మిడిలార్డర్లో బ్యాటింగ్ బలంగా ఉండాలి కాబట్టి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్లో ఆడితే బాగుంటుందన్నారు. నిజానికి ఇటీవలి కాలంలో నేను ఆ స్థానంలో ఆడలేదు, ప్రాక్టీస్ కూడా లేదు. అయినా సరే జట్టు కోసం అంగీకరించాను. అయితే పవర్‌ప్లే వరకు స్కోరు 38/3 మాత్రమే రాగా, కొత్త ఓపెనింగ్ జోడి విఫలమైంది. అయినా సరే దానినే కొనసాగిస్తామని కోచ్ చెప్పారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం లేకపోగా, నాకు పాక్‌పై మంచి రికార్డు ఉండటం వల్ల ఆయన నిర్ణయంతో ఆశ్చర్యపోయాను. వెంటనే నేను సెలక్టర్లతో మాట్లాడాను. వారి జోక్యంతో బ్రేక్‌ఫాస్ట్ సమయంలో నేను ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పారు. నేను బాగా ఆడి జట్టును గెలిపించాను. అయితే దానిపై ఒక్క మెచ్చుకోలు మాట కూడా లేకుండా తన వాదననే గెలిపించుకునే ప్రయత్నం ఆయన మొదలు పెట్టారు. నా పట్ల కోచ్ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. ఉదాహరణలు చెప్పాలంటే... నేను కూర్చున్న దగ్గరి నుంచి లేచివెళ్లడం, నెట్స్‌లో వేరేవాళ్ల ప్రాక్టీస్‌ను చూడటం, నా బ్యాటింగ్ వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవడం, నేను తన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఫోన్లో ఏదో మాట్లాడుతున్నట్లు చేస్తూ అక్కడి నుంచి జారుకోవడం... ఇలా చాలా జరిగాయి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించగా, నన్ను కావాలని అవమానిస్తున్నట్లు అందరికీ అర్థం అయింది.అయినా నేను నియంత్రణ కోల్పోలేదు. పరిస్థితులు చేజారుతుండటం, జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మేనేజర్ వద్దకు వెళ్లి నేను ఇదంతా చెప్పాను. దాంతో ఆమె మా ఇద్దరి మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేసింది. నేను మర్యాదగానే చెప్పాల్సిందంతా చెప్పాను. మేనేజర్ ముందు మాత్రం ‘నిజమే, తప్పు నాదే...ఇలా చేయకుండా ఉండాల్సింది’ అని కోచ్ చెప్పారు. యువ క్రీడాకారిణులను ఓపెనర్లుగా చిన్న జట్టయిన ఐర్లాండ్‌పై ప్రయత్నించమని కూడా నేను ప్రతిపాదించాను. తను మాత్రం నేనే ఓపెనింగ్ చేస్తున్నానని స్పష్టం చేశారు. దాంతో సమస్య పరిష్కారమైపోయిందని నేను అనుకున్నాను. కానీ అది తప్పని తర్వాత అర్థమైంది. ఆ సమావేశం తర్వాత ఆయన ప్రవర్తన మరింత ఘోరంగా మారింది. నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా అసలు ఒక మనిషిని ఉన్నాననే విషయాన్ని మరచిపోయినట్లు వ్యవహరించారు. ఆ సమావేశం కారణంగా ఆయన అహం బాగా దెబ్బతిన్నట్లు నాకర్థమైంది. ఐర్లాండ్‌తో కూడా కఠినమైన పిచ్‌పై నేను మ్యాచ్ గెలిపించాను. దురదృష్టవశాత్తూ ఫీల్డింగ్‌లో నా మోకాలికి దెబ్బ తగిలింది. నాకు స్వల్పంగా జ్వరం కూడా ఉండటంతో ఫిజియో విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు రోజు నాకు ఫోన్ చేసి గ్రౌండ్‌కు రావద్దని కోచ్ ఆదేశించారు. ఒక పెద్ద మ్యాచ్‌కు ముందు నన్ను నా జట్టుతో పాటు ఉండవద్దని చెప్పడంతో షాక్‌కు గురయ్యాను. అయితే మేనేజర్ అంగీకారంతో గ్రౌండ్‌కు వెళ్లాను. కానీ కొద్దిసేపటికే నేను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాకూడదని మరో మెసేజ్ వచ్చింది. సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఫీల్డింగ్ సెషన్ మాత్రమే ఉన్నా రమేశ్ పొవార్ ఐదుగురు అమ్మాయిలను అదనపు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తీసుకెళ్లారు. నాకూ ప్రాక్టీస్ అవసరం ఉంది కాబట్టి నేనూ వస్తానని మెసేజ్ చేశాను కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మళ్లీ మేనేజర్ జోక్యంతో నేను నెట్స్‌కు వెళ్లగా...రమేశ్ అక్కడి నుంచి తప్పుకున్నారు. దాంతో నన్ను సెమీస్‌లో ఆడించవద్దని అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారేమో అనిపించింది. తర్వాతి రోజు ప్రాక్టీస్‌లో నేను పార్ట్‌టైమ్ బౌలర్లు, కేవలం ముగ్గురు బౌలర్లతో కూడా సాధన చేయాల్సి వచ్చింది. ప్రధాన మ్యాచ్‌కు ముందు ఆయన వ్యవహారశైలి చూస్తే నన్ను ఆడించాలనే ఉద్దేశం లేనట్లు అర్థమైంది. సాధారణంగా మ్యాచ్‌కు ముందు రోజు కానీ, మ్యాచ్ రోజు మైదానంలోకి అడుగు పెట్టే ముందు కానీ తుది జట్టును ప్రకటించే అలవాటు రమేశ్‌కు ఉంది. అయితే సెమీస్ రోజు అలా చేయలేదు. హర్మన్ టాస్కు వెళ్లే సమయంలో నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి మేం గత మ్యాచ్‌లో ఆడుతున్న జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. దానర్థం నాకు తప్ప ఆ విషయం అందరికీ తెలుసు! జట్టు ఫీల్డింగ్ కోసం మైదానంలోకి దిగే సమయంలో అందరు ప్లేయర్లు ఒక దగ్గరకు చేరి ‘హడిల్’లో భాగం కావడం సంప్రదాయం. కానీ తుది జట్టులో ఉన్నవారే అక్కడికి రావాలని, మిగతా వారు వెళ్లిపోవాలని ఆదేశించారు. నన్ను నాశనం చేసే ప్రయత్నం చేయడం నాలో ఆందోళనను మరింత పెంచింది. 20 ఏళ్లు నా సర్వం ఆటకు ధారబోసిన తర్వాత ఇలా చేయడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. నా ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు లేదని అప్పడనిపించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచిన తర్వాత నన్ను డగౌట్‌లోకి రమ్మని, సంబరాల్లో భాగం కావాలని చెప్పారు. మ్యాచ్ ఆసాంతం నన్ను ‘హౌస్ అరెస్ట్’లో ఉంచి డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రానీయకుండా చేసిన తర్వాత ఇలా చేయడం ఆశ్చర్యమనిపించింది. ఈ విషయాలన్నీ చూస్తే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా, దేశానికి సేవ చేసిన క్రీడాకారిణిగా నాకు న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? బహిరంగంగానే డయానా ఎడుల్జీ నాకు వ్యతిరేకంగా మారిపోగా, కోచ్ అనుచిత ప్రవర్తన తర్వాత నేను పూర్తి నిరాశలో కూరుకుపోయాను. మీడియాతో మాట్లాడవద్దని చెప్పారు కాబట్టి ఆఖరి ప్రయత్నంగా మీకు ఈ లేఖ రాస్తున్నాను. నేను ఇక ముందు ఏం చేయాలో మీరే చెప్పండి. మీ... మిథాలీ రాజ్ -
పవార్‌కే ‘మహిళల’ పగ్గాలు
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు అతను కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా కోచ్ తుషార్ అరోథే తప్పుకోవడంతో గత నెలలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు. ఇటీవలే పవార్ పర్యవేక్షణలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో భారత జట్టు శిక్షణా శిబిరం కొనసాగింది. ప్రపంచకప్‌కంటే ముందు భారత జట్టు శ్రీలంకలో పర్యటించి 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టి20 సిరీస్ తర్వాత వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. మహిళల జట్టు కోచ్ పదవి కోసం ఈ నెల 10నే బీసీసీఐ దరఖాస్తులు కోరింది. 20 మంది దీని కోసం పోటీ పడ్డారు. డయానా ఎడుల్జీ, రాహుల్ జోహ్రి, సబా కరీం వీరందరినీ పది నిమిషాల చొప్పున ఇంటర్వ్యూ చేశారు. అనంతరం జాబితాను ఆరుగురికి కుదించారు. పవార్‌తో పాటు మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, అతుల్ బెదాడే, కోహ్లి తొలి కోచ్ రాజ్‌కుమార్ శర్మ, మహిళల జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సనత్ కుమార్ ఈ జాబితాలో నిలిచారు. చివరకు పవార్‌కే అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌కు ఇప్పటికే పవార్‌ను కోచ్‌గా ప్రకటించిన నేపథ్యంలో కొద్ది రోజులకే జరుగనున్న వరల్డ్ కప్ వరకు కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో అతడి ఎంపిక ఖరారైనట్లుగా సమాచారం. భారత్ తరఫున 2 టెస్టులు ఆడిన 40 ఏళ్ల రమేశ్ పవార్, 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. 148 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతను 470 వికెట్లు పడగొట్టడం విశేషం. -
రేసులో సునీల్ జోషి, రమేశ్ పవార్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ స్పిన్నర్లు సునీల్ జోషి, రమేశ్ పవార్లు పోటీపడుతున్నారు. 2017 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన కోచ్ తుషార్ అరోథె... సీనియర్ క్రీడాకారిణులతో వచ్చిన విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేసింది. దీనికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా, విజయ్ యాదవ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమత మాబెన్, సుమన్ శర్మ, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మారియా ఫహే తదితరులు ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం సునీల్ జోషి, రమేశ్ పవార్ల మధ్య ఉండనుంది. జోషి టీమిండియా తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడగా... పవార్ 2 టెస్టులు, 31 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పవార్ ప్రస్తుతం మహిళా జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తుండగా... జోషి మొన్నటి వరకు బంగ్లాందేశ్‌కు కోచ్‌గా పనిచేశాడు. శుక్రవారం ముంబైలో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీమ్, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. -
తాత్కాలిక కోచ్‌గా మాజీ స్పిన్నర్!
న్యూఢిల్లీ: ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ పదవికి తుషార్ అరోథి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తాత్కాలిక కోచ్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్‌కు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ బిజూ జార్జ్‌తో కలిసి పవార్ పని చేసేందుకు రంగం సిద్దమైంది. జూలై 25 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ బెంగళూరులో జరిగే భారత మహిళా క్రికెట్ జట్టు శిక్షణా శిబిరంలో పవార్ పాల్గొనున్నాడు. ఈ క్రమంలోనే పవార్‌కు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మహిళా క్రికెట్ కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి తేదీ జూలై 20. దరఖాస్తు చేసుకునే వ్యక్తికి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు 55 ఏళ్లలోపు వయసు కల్గి ఉండాలి. ఈ విషయాన్ని బీసీసీఐ తన వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. -
క్రికెట్ కు రమేశ్ పవార్ గుడ్ బై
న్యూఢిల్లీ: భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ తో పాటు కాంపిటేటివ్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. గత ఎనిమిది సంవత్సరాల క్రితం టీమిండియా జట్టులో చివరి సారి ఆడిన పవార్.. ఆ తరువాత దేశవాళీ మ్యాచ్ లు ఆడాడు. పవార్ తాజా నిర్ణయంతో తన 15 ఏళ్ల దేశవాళీ మ్యాచ్ లకు ముగింపు పలికినట్లయ్యింది. క్రికెట్ మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో పాల్గొనే ఉద్దేశం ఉన్నందునే తాను వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. భారత క్రికెట్ జట్టు తరపున పవార్ రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. వన్డేలో 34 వికెట్లు తీయగా, టెస్టుల్లో ఆరు వికెట్లు తీశాడు. 2004 లో పాకిస్థాన్ తో రావల్పిండిలో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన పవార్..తన చివరి వన్డేలో 2007లో ఆస్ట్రేలియాతో కొచ్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నాడు. పవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 146 మ్యాచ్ లు ఆడి 470 వికెట్లు తీశాడు. రంజీల్లో ముంబై తరపున ఆడిన పవార్.. 2008, 2010, 2012 సంవత్సరాల్లో ఐపీఎల్ టోర్నీల్లో కింగ్స్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించగా, 2011 లో కొచ్చి టస్కర్ తరపున ఆడాడు.