ఆ ఒక్కరు ఎవరో? | Interview for the selection of womens cricket team coach today | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కరు ఎవరో?

Published Thu, Dec 20 2018 1:02 AM | Last Updated on Thu, Dec 20 2018 9:46 AM

Interview for the selection of womens cricket team coach today - Sakshi

ముంబై: డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ప్రచారానికి ప్రచారం వస్తుండటంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి ఇప్పుడొక హాట్‌ కేక్‌లా మారిపోయింది. ఒకప్పుడు హడావుడే లేకుండా, చాలా సాదాసీదాగా సాగిపోయి, ఎవరిని ఎంపిక చేశారో మీడియాలో వస్తేగాని తెలియనంతగా సాగిన ప్రక్రియ... నేడు స్వదేశీయులతో పాటు దిగ్గజాలనదగ్గ విదేశీ మాజీ కోచ్‌లు  కూడా పోటీ పడే స్థాయికి వచ్చింది. పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పది మందికి కుదించి, కమిటీ ఏర్పాటు చేసి వారిలో ఒకరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే దశకు చేరింది.  

దరఖాస్తులు 28... 
మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ ఎవరో తేల్చే బాధ్యతను దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల అడ్‌హక్‌ కమిటీ చేతుల్లో పెట్టారు. మాజీ క్రికెటర్లు అన్షుమన్‌ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఈ కమిటీలోని ఇతర సభ్యులు. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పదవికి మొత్తం 28 దరఖాస్తులు రాగా 10 మందిని (గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్‌ గిబ్స్, ట్రెంట్‌ జాన్‌స్టన్, మార్క్‌ కోల్స్, దిమిత్రి మస్కరెనాస్, బ్రాడ్‌ హగ్‌తో పాటు తాజా మాజీ కోచ్‌ రమేశ్‌ పొవార్, భారత మాజీ క్రికెటర్లు మనోజ్‌ ప్రభాకర్, డబ్ల్యూవీ రామన్, వెంకటేశ్‌ ప్రసాద్‌) షార్ట్‌లిస్ట్‌ చేశారు. కపిల్‌ కమిటీ వీరికి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 

రాయ్‌ అలా.. ఎడుల్జీ ఇలా..
మరోవైపు కోచ్‌ ఎంపికపై సుప్రీంకోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ (సీవోఏ) సభ్యులు వినోద్‌ రాయ్, డయానా ఎడుల్జీ పూర్తి భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాలని రాయ్‌... బీసీసీఐని ఆదేశించగా, పొవార్‌ను వచ్చే నెలలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌ పర్యటన వరకైనా కొనసాగించాలని ఎడుల్జీ కోరుతున్నారు.  

ఎవరి అవకాశం ఎంత? 
రమేశ్‌ పొవార్‌: తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్‌ వరకు ఇతడు బాధ్యతలు నిర్వర్తించాడు. గత నెల 30తో ఒప్పందం పూర్తయింది. ప్రపంచకప్‌ సెమీస్‌లో సీనియర్‌ బ్యాటర్‌ మిథాలీరాజ్‌ను ఆడించకపోవడంతో తీవ్రంగా వివాదాస్పదుడయ్యాడు. కోచ్‌ వ్యవహార శైలిపై మిథాలీ నేరుగా ధ్వజమెత్తింది. మొదట రేసులో లేకున్నా టి20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన కోరడంతో మళ్లీ పోటీలో నిలిచానంటున్నాడు. ఎడుల్జీ మద్దతు కూడా ఉంది. అయితే... ఇంత జరిగాక, ఆటగాడిగానూ గొప్ప రికార్డులు లేని పొవార్‌ను మళ్లీ ఎంపిక చేస్తారా? అన్నది సందేహమే.  

గ్యారీ కిర్‌స్టెన్‌: గొప్ప బ్యాట్స్‌మన్, అంతేస్థాయిలో కోచ్‌గానూ ఫలితాలు రాబట్టాడు. భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ సాధించడంలో కిర్‌స్టెన్‌ పాత్ర అందరికీ తెలిసిందే. స్నేహభావంతో ఉంటూనే ఆటగాళ్ల నుంచి ఫలితాలను రాబట్టుకోగల నేర్పరి.  ప్రొఫెషనల్‌గా చెప్పాలంటే ఈ దశలో మహిళల జట్టుకు కావాల్సిన  కోచ్‌.  

వెంకటేశ్‌ ప్రసాద్‌: టీమిండియా మాజీ పేసర్‌. మన జాతీయ, అండర్‌–19 జట్లతో పాటు బంగ్లాదేశ్, ఐపీఎల్‌లోనూ కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. నెమ్మదస్తుడు. అయితే, కోచ్‌గా గొప్ప ఫలితాలు రాబట్టిన రికార్డు లేదు. 2009లో పురుషుల జట్టు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న వెంకటేశ్‌ ప్రసాద్‌ను బీసీసీఐ అర్ధంతరంగా తొలగించింది. అయితే, వివాదాలకు దూరంగా ఉండే స్వదేశీ కోచ్‌ కావాలనుకుంటే మొగ్గు
ఇతడివైపే ఉంటుంది. 

మనోజ్‌ ప్రభాకర్‌: కపిల్‌దేవ్‌తో ఒకప్పుడు కొత్త బంతిని పంచుకున్న భారత మాజీ ఆల్‌ రౌండర్‌. తర్వాత కపిల్‌తో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో నిషేధానికి గురయ్యాడు. రెండేళ్ల క్రితం భారత్‌లో టి20 ప్రపంచకప్‌ ఆడిన అఫ్గానిస్తాన్‌ కోచ్‌ ప్రభాకరే. ఢిల్లీ రంజీ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా, రాజస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఢిల్లీ ఇతడికి ఉద్వాసన పలికింది.  

గిబ్స్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతాల్లో తీవ్ర వివాదాస్పదుడు. బ్యాట్స్‌మన్‌ అయినప్పటికీ కోచ్‌గా రికార్డేమీ లేదు. ఆటలోలాగే ప్రవర్తనలోనూ దూకుడైన గిబ్స్‌ను మహిళల జట్టు శిక్షకుడిగా నియమించడం అంటే... కొత్త రకం వివాదాలను కోరి తెచ్చుకోవడమే.

డబ్ల్యూవీ రామన్‌: టీమిండియా మాజీ ఓపెనర్‌. ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. భారత అండర్‌–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్‌ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇంటర్వ్యూలో మెప్పించగలిగితే అవకాశం ఉండొచ్చు.  
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement