అడుగడుగునా అవమానించారు  | Mithali Raj Accuses CoA And Coach: Excerpts From The Letter | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అవమానించారు 

Published Wed, Nov 28 2018 2:05 AM | Last Updated on Wed, Nov 28 2018 5:35 AM

Mithali Raj Accuses CoA And Coach: Excerpts From The Letter - Sakshi

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ ప్రారంభమయ్యే కొన్ని క్షణాల ముందే మ్యాచ్‌ ఆడటం లేదనే సమాచారం... ప్రాక్టీస్‌ చేయడానికి వెళితే మొహం తిప్పుకునే కోచ్‌... తుది జట్టులో లేకపోతే మైదానంలోకే అడుగు పెట్టవద్దనే ఆంక్షలు... మ్యాచ్‌ ఆసాంతం డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే బందీ... వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన రోజు నుంచి అవమానాలు... అసలు ఆమె తమ జట్టు సభ్యురాలే కాదన్నట్లుగా వ్యవహరించడం... దాదాపు 20 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ లెక్కలేనన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకొని మహిళా క్రికెట్‌కు పర్యాయపదంగా నిలిచిన మిథాలీ రాజ్‌కు ఎదురైన అవమానాలు ఇవి!  ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా మిథాలీని పక్కన పెట్టడంతో మహిళల క్రికెట్‌లో కొత్త వివాదం రేగింది. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్‌ రమేశ్‌ పొవార్‌ వ్యవహరించారని మిథాలీ ఆరోపించింది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తర్వాత అవమానకర రీతిలో తనతో ప్రవర్తించారని హైదరాబాద్‌ ప్లేయర్‌ కన్నీళ్లపర్యంతమైంది. బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను ఉద్దేశించి మిథాలీ సుదీర్ఘ లేఖ రాసింది. మిథాలీ లేఖ ఆమె మాటల్లోనే... 

డియర్‌ రాహుల్‌ సర్, సబా... నా ఫిర్యాదును వినిపించే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా భారత్‌ తరఫున ఆడిన నేను ఆటగాళ్ల సమస్యలను విని పరిష్కరించడంలో బీసీసీఐ అండగా నిలవడం తెలుసు. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మొదటిసారి తీవ్ర నిరాశకు గురై కుప్పకూలిపోయినట్లు అనిపిస్తోంది. అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని చేస్తున్న ప్రయత్నం చూస్తే దేశానికి ఇన్నేళ్ల పాటు నేను చేసిన సేవలకు ఎలాంటి విలువ లేదేమో అనిపిస్తోంది. సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీపై నాకు అపార గౌరవం, నమ్మకం ఉన్నాయి. కానీ వెస్టిండీస్‌లో నాకు ఎదురవుతున్న పరిస్థితుల గురించి ఆమెతో మాట్లాడిన తర్వాత కూడా నాకు వ్యతిరేకంగా ఆమె తన పదవిని ఉపయోగించుకుంటుందని ఊహించలేదు. పైగా అన్నీ తెలిసి కూడా సెమీఫైనల్లో నన్ను పక్కన పెట్టడంలో తప్పేమీ లేదని, జట్టు ఎంపిక సీఓఏ పని కాదు అంటూ ఆమె మీడియాలో వ్యాఖ్యానించడం నన్ను తీవ్రంగా బాధించింది. దీన్ని బట్టి చూస్తే అధికారంలో ఉన్నవారి అండ ఉంటే చాలు ఎవరైనా ఏదైనా చేసేయవచ్చు... తప్పు ఒప్పులను పట్టించుకునేవాడే లేరని అనిపిస్తుంది.   ఈ లేఖ తర్వాత మరింత మంది నన్ను లక్ష్యంగా చేసుకుంటారని నాకు తెలుసు. ఆమె సీఓఏ సభ్యురాలు అయితే నేను ఒక ప్లేయర్‌ను మాత్రమే. సెమీఫైనల్‌కు ముందు వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లలో నేను రెండు అర్ధ సెంచరీలు చేసి రెండు సార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాననే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాను. నన్ను సెమీస్‌ నుంచి తప్పించి మెరుగ్గా ఆడుతున్న ముగ్గురు బ్యాటర్‌లతోనే బరిలోకి దిగాలనే నిర్ణయం నాతో పాటు క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.నిబంధనలను గౌరవిస్తూ నేను తాజా ఘటనల గురించి మీడియాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజాలు తెలుసుకొని బీసీసీఐ న్యాయం చేస్తుందని నమ్మడం కూడా దానికి కారణం. కానీ ఏ మాత్రం సిగ్గు పడకుండా సీఓఏ సభ్యురాలు పక్షపాతంతో నాకు ప్రతికూల నిర్ణయాన్ని ముందే తీసుకున్నారేమో అనిపిస్తోంది.   

నన్ను ఆడించరాదనే కోచ్‌ నిర్ణయానికి మద్దతు పలికి నన్ను బాధకు గురి చేసిందనే తప్ప టి20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని కూడా స్పష్టం చేయదలిచాను. దేశం తరఫున ప్రపంచ కప్‌ గెలవాలని కోరుకున్నాను కాబట్టి బంగారు అవకాశం కోల్పోయామని బాధ పడ్డాను. మేమిద్దరం సీనియర్లం. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోగలం. జట్టులో హర్మన్‌ విలువేమిటో వన్డే కెప్టెన్‌గా నాకు బాగా తెలుసు. అయితే ఇంతకుముందే చెప్పినట్లు నా సమస్య అంతకంటే తీవ్రమైంది. నా సమస్యల్లా కోచ్‌ రమేశ్‌ పొవార్‌తోనే. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే అసలు విషయం పక్క దారి పడుతున్నట్లు అనిపించింది.  మేము వెస్టిండీస్‌లో అడుగు పెట్టగానే కోచ్‌తో నా ఇబ్బందులు మొదలయ్యాయి. నాతో అతను భిన్నంగా ప్రవర్తించడం, వివక్ష చిన్న చిన్న విషయాల్లో కనిపిస్తూనే ఉంది కానీ నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు. శ్రీలంక పర్యటన మొదలు ఆస్ట్రేలియా ‘ఎ’తో మ్యాచ్‌లు, వరల్డ్‌ కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లలో కూడా నేను ఓపెనింగ్‌ చేశాను. ఒకరోజు ప్రాక్టీస్‌ తర్వాత కోచ్‌ నా దగ్గరకు వచ్చి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ బలంగా ఉండాలి కాబట్టి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో ఆడితే బాగుంటుందన్నారు. నిజానికి ఇటీవలి కాలంలో నేను ఆ స్థానంలో ఆడలేదు, ప్రాక్టీస్‌ కూడా లేదు. అయినా సరే జట్టు కోసం అంగీకరించాను. అయితే పవర్‌ప్లే వరకు స్కోరు 38/3 మాత్రమే రాగా, కొత్త ఓపెనింగ్‌ జోడి విఫలమైంది. అయినా సరే దానినే కొనసాగిస్తామని కోచ్‌ చెప్పారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం లేకపోగా, నాకు పాక్‌పై మంచి రికార్డు ఉండటం వల్ల ఆయన నిర్ణయంతో ఆశ్చర్యపోయాను. వెంటనే నేను సెలక్టర్లతో మాట్లాడాను. వారి జోక్యంతో బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో నేను ఓపెనింగ్‌ చేస్తున్నానని చెప్పారు. నేను బాగా ఆడి జట్టును గెలిపించాను. అయితే దానిపై ఒక్క మెచ్చుకోలు మాట కూడా లేకుండా తన వాదననే గెలిపించుకునే ప్రయత్నం ఆయన మొదలు పెట్టారు. నా పట్ల కోచ్‌ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది.

ఉదాహరణలు చెప్పాలంటే... నేను కూర్చున్న దగ్గరి నుంచి లేచివెళ్లడం, నెట్స్‌లో వేరేవాళ్ల ప్రాక్టీస్‌ను చూడటం, నా బ్యాటింగ్‌ వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవడం, నేను తన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఫోన్‌లో ఏదో మాట్లాడుతున్నట్లు చేస్తూ అక్కడి నుంచి జారుకోవడం... ఇలా చాలా జరిగాయి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించగా, నన్ను కావాలని అవమానిస్తున్నట్లు అందరికీ అర్థం అయింది.అయినా నేను నియంత్రణ కోల్పోలేదు. పరిస్థితులు చేజారుతుండటం, జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మేనేజర్‌ వద్దకు వెళ్లి నేను ఇదంతా చెప్పాను. దాంతో ఆమె మా ఇద్దరి మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేసింది. నేను మర్యాదగానే చెప్పాల్సిందంతా చెప్పాను. మేనేజర్‌ ముందు మాత్రం ‘నిజమే, తప్పు నాదే...ఇలా చేయకుండా ఉండాల్సింది’ అని కోచ్‌ చెప్పారు. యువ క్రీడాకారిణులను ఓపెనర్లుగా చిన్న జట్టయిన ఐర్లాండ్‌పై ప్రయత్నించమని కూడా నేను ప్రతిపాదించాను. తను మాత్రం నేనే ఓపెనింగ్‌ చేస్తున్నానని స్పష్టం చేశారు. దాంతో సమస్య పరిష్కారమైపోయిందని నేను అనుకున్నాను. కానీ అది తప్పని తర్వాత అర్థమైంది.
 
ఆ సమావేశం తర్వాత ఆయన ప్రవర్తన మరింత ఘోరంగా మారింది. నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా అసలు ఒక మనిషిని ఉన్నాననే విషయాన్ని మరచిపోయినట్లు వ్యవహరించారు. ఆ సమావేశం కారణంగా ఆయన అహం బాగా దెబ్బతిన్నట్లు నాకర్థమైంది. ఐర్లాండ్‌తో కూడా కఠినమైన పిచ్‌పై నేను మ్యాచ్‌ గెలిపించాను. దురదృష్టవశాత్తూ ఫీల్డింగ్‌లో నా మోకాలికి దెబ్బ తగిలింది. నాకు స్వల్పంగా జ్వరం కూడా ఉండటంతో ఫిజియో విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు రోజు నాకు ఫోన్‌ చేసి గ్రౌండ్‌కు రావద్దని కోచ్‌ ఆదేశించారు. ఒక పెద్ద మ్యాచ్‌కు ముందు నన్ను నా జట్టుతో పాటు ఉండవద్దని చెప్పడంతో షాక్‌కు గురయ్యాను. అయితే మేనేజర్‌ అంగీకారంతో గ్రౌండ్‌కు వెళ్లాను. కానీ కొద్దిసేపటికే నేను డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బయటకు రాకూడదని మరో మెసేజ్‌ వచ్చింది.   సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఫీల్డింగ్‌ సెషన్‌ మాత్రమే ఉన్నా రమేశ్‌ పొవార్‌ ఐదుగురు అమ్మాయిలను అదనపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం తీసుకెళ్లారు. నాకూ ప్రాక్టీస్‌ అవసరం ఉంది కాబట్టి నేనూ వస్తానని మెసేజ్‌ చేశాను కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మళ్లీ మేనేజర్‌ జోక్యంతో నేను నెట్స్‌కు వెళ్లగా...రమేశ్‌ అక్కడి నుంచి తప్పుకున్నారు. దాంతో నన్ను సెమీస్‌లో ఆడించవద్దని అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారేమో అనిపించింది. తర్వాతి రోజు ప్రాక్టీస్‌లో నేను పార్ట్‌టైమ్‌ బౌలర్లు, కేవలం ముగ్గురు బౌలర్లతో కూడా సాధన చేయాల్సి వచ్చింది. ప్రధాన మ్యాచ్‌కు ముందు ఆయన వ్యవహారశైలి చూస్తే నన్ను ఆడించాలనే ఉద్దేశం లేనట్లు అర్థమైంది. సాధారణంగా మ్యాచ్‌కు ముందు రోజు కానీ, మ్యాచ్‌ రోజు మైదానంలోకి అడుగు పెట్టే ముందు కానీ తుది జట్టును ప్రకటించే అలవాటు రమేశ్‌కు ఉంది. అయితే సెమీస్‌ రోజు అలా చేయలేదు. హర్మన్‌ టాస్‌కు వెళ్లే సమయంలో నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి మేం గత మ్యాచ్‌లో ఆడుతున్న జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. దానర్థం నాకు తప్ప ఆ విషయం అందరికీ తెలుసు! జట్టు ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి దిగే సమయంలో అందరు ప్లేయర్లు ఒక దగ్గరకు చేరి ‘హడిల్‌’లో భాగం కావడం సంప్రదాయం. కానీ తుది జట్టులో ఉన్నవారే అక్కడికి రావాలని, మిగతా వారు వెళ్లిపోవాలని ఆదేశించారు. నన్ను నాశనం చేసే ప్రయత్నం చేయడం నాలో ఆందోళనను మరింత పెంచింది.  

20 ఏళ్లు నా సర్వం ఆటకు ధారబోసిన తర్వాత ఇలా చేయడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. నా ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు లేదని అప్పడనిపించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ గెలిచిన తర్వాత నన్ను డగౌట్‌లోకి రమ్మని, సంబరాల్లో భాగం కావాలని చెప్పారు. మ్యాచ్‌ ఆసాంతం నన్ను ‘హౌస్‌ అరెస్ట్‌’లో ఉంచి డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బయటకు రానీయకుండా చేసిన తర్వాత ఇలా చేయడం ఆశ్చర్యమనిపించింది.  ఈ విషయాలన్నీ చూస్తే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా, దేశానికి సేవ చేసిన క్రీడాకారిణిగా నాకు న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? బహిరంగంగానే డయానా ఎడుల్జీ నాకు వ్యతిరేకంగా మారిపోగా, కోచ్‌ అనుచిత ప్రవర్తన తర్వాత నేను పూర్తి నిరాశలో కూరుకుపోయాను. మీడియాతో మాట్లాడవద్దని చెప్పారు కాబట్టి ఆఖరి ప్రయత్నంగా మీకు ఈ లేఖ రాస్తున్నాను. నేను ఇక ముందు ఏం చేయాలో మీరే చెప్పండి. 
మీ...  మిథాలీ రాజ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement