న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని జట్టు కోచ్ రమేశ్ పొవార్ అంగీకరించాడు. ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో తెలిపాడు. కోచ్‌పై ఒత్తిడి పెంచడం, బ్లాక్‌మెయిల్ చేయడం, తన కోసం జట్టు ప్రయోజనాలు పణంగా పెట్టడం ఆమె మానుకోవాలని అతడు పేర్కొన్నాడు. విస్తృత పరిధిలో ఆలోచించి భారత మహిళా క్రికెట్ మేలు కోసం ఆమె పని చేస్తే బాగుంటుందన్నాడు. తనపై మిథాలీ చేసిన ఆరోపణలకు సంబంధించి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసి బుధవారం వివరణ ఇచ్చాడు. ‘మిథాలీతో తన సంబంధాలు బాగా లేవని రమేశ్ అంగీకరించాడు. ఆమెలో కలుపుగోలుతనం లేదని, వ్యవహారశైలి కూడా చాలా సంక్లిష్టమని రమేశ్ పొవార్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ నుంచి తప్పించడం వ్యూహంలో భాగమే తప్ప దురుద్దేశంతో చేయలేదని కూడా అతను అన్నాడు. ‘మిథాలీ రాజ్ స్ట్రయిక్ రేట్ తక్కువ ఉండటంతోపాటు గెలిచిన జట్టును కొనసాగించాలనుకోవడమే కారణమనే తన మాటకు పొవార్ కట్టుబడ్డాడు’ అని బీసీసీఐలోని కీలక అధికారి ఒకరు వెల్లడించాడు. అయితే పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో లీగ్ మ్యాచ్‌ల సమయంలో మిథాలీ రాజ్ స్ట్రయిక్‌రేట్ గుర్తుకు రాలేదా అనే ప్రశ్నకు రమేశ్ పొవార్ నుంచి స్పందన లేదని సమాచారం! మిథాలీని తప్పించే విషయంలో బయటి నుంచి ఎవరైనా బలమైన వ్యక్తుల ఒత్తిడి ఉందా అనే ప్రశ్నపై స్పందిస్తూ తాను ఎవరి ఫోన్‌లు కూడా అందుకోలేదని కోచ్ జవాబిచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తను రమేశ్ పొవార్ తిరస్కరించాడు.
Comments
Please login to add a commentAdd a comment