కెరీర్‌లో మొదటిసారి...
రామ్‌కుమార్‌కు తొలి ‘మాస్టర్స్’ విజయం
ఒహాయో: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత యువ టెన్నిస్ తార రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్‌లో తొలి ‘మాస్టర్స్’ విజయాన్ని సాధించాడు. సిన్సినాటి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్‌లో ఈ చెన్నై ప్లేయర్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో రామ్‌కుమార్ 6–7 (5/7), 6–1, 6–4తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా)పై విజయం సాధించాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల తర్వాత రెండో అత్యున్నత స్థాయి హోదా మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లకు ఉంది.
వాస్తవానికి ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లోనే రామ్‌కుమార్ ఓడిపోయినా... టోర్నమెంట్ మొదలయ్యాక మెయిన్ ‘డ్రా’లోని ఇతర ఆటగాళ్లు గాయాల కారణంగా వైదొలిగారు. దాంతో నిర్వాహకులు ‘లక్కీ లూజర్’ హోదాలో రామ్‌కుమార్‌కు మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం ఇచ్చారు. రెండో రౌండ్‌లో జారెడ్ డొనాల్డ్‌సన్ (అమెరికా)తో రామ్‌కుమార్ ఆడతాడు. రామ్‌కుమార్ ఇటీవలే వాషింగ్టన్‌లో జరిగిన సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో తొలి రౌండ్‌లో, అంటాల్యా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
పేస్–జ్వెరెవ్ జంట ఓటమి
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంట తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. గంటా 21 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పేస్–జ్వెరెవ్ ద్వయం 6–2, 6–7 (2/7), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 44 ఏళ్ల పేస్‌తో 20 ఏళ్ల జ్వెరెవ్ తొలిసారి జతకట్టాడు. 1997లో పేస్ తన కెరీర్‌లో ఆరు డబుల్స్ టైటిల్స్ గెలిచిన ఏడాదే జ్వెరెవ్ జన్మించడం విశేషం. గతవారం రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించిన జ్వెరెవ్ సీజన్‌లో ఐదో సింగిల్స్ టైటిల్‌ను గెలిచాడు.