నాన్నకు ప్రేమతో...
బండారు సత్యనారాయణ... తూర్పు గోదావరి జిల్లా రాజోలులోని పోలీస్ స్టేషన్ వెనుక బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవించే ఓ సాధారణ వ్యక్తి. ఆయనకో కల ఉండేది. వాళ్లబ్బాయి పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడుతుంటే చూడాలనే ఆశ ఉండేది. బతుకు బండిని ఈడ్చడానికే కష్టపడే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ఆ అబ్బాయిని ప్రోత్సహించింది. కానీ కొడుకును క్రికెటర్‌గా చూడాలనే కోరిక తీరకుండానే నాలుగేళ్ల క్రితం సత్యనారాయణ మరణించారు. అయితే... ఆ తండ్రి కల ఇప్పుడు సాకారమైంది. బండారు అయ్యప్ప ఆంధ్ర రంజీ క్రికెటర్‌గా ఎదగడంతో పాటు ముంబైలాంటి బలమైన జట్టును కుప్పకూల్చి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. నాన్న కోరికను తీర్చి... ప్రేమతో తన ఘనతను నాన్నకే అంకితం చేశాడు.
క్రికెట్‌ను అమితంగా ప్రేమించే మన దేశంలో జాతీయ జట్టుకు ఆడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. చిన్నప్పుడు గల్లీల్లో బ్యాట్ పట్టుకున్నప్పుడు ఈ ఆశ మొదలవుతుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, మార్గదర్శకులు లేకనో... కారణం ఏదైనా మన ప్రస్థానం స్కూల్, కాలేజ్, మహా అయితే స్థానికంగా నిర్వహించే టోర్నమెంట్‌లతోనే ఆగిపోతుంది. కానీ బండారు అయ్యప్ప మాత్రం కష్టపడ్డాడు. తన సహజసిద్ధ నైపుణ్యంతో ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి రంజీ క్రికెటర్‌గా ఎదిగాడు. ముంబైతో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలిసారి మాజీ చాంపియన్‌పై ఆధిక్యాన్ని అందించాడు. దేశవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో అయ్యప్ప పేరు మార్మోగింది.
నిరుపేద కుటుంబం
రాజోలులోని 12వ వార్డులో నివసించే సత్యనారాయణ ఇస్త్రీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన అయ్యప్ప... చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి చూపించేవాడు. చాలామంది తండ్రుల్లా ‘అదేమైనా కూడు పెడుతుందా’ అని ఆయన ప్రశ్నించలేదు. ఏనాటికైనా కొడుకు క్రికెటర్ అయితే చూడాలని అనుకున్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత అయ్యప్పకు అనుకోకుండా ఓ బ్రేక్ దొరికింది. రాజోలు చుట్టుపక్కల ఎక్కడ క్రికెట్ టోర్నీ జరిగినా అయ్యప్ప వెళ్లి తన బంతులతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించేవాడు. స్థానికంగా పిల్లలను ప్రోత్సహించే రాజా అనే వ్యక్తి అయ్యప్పకు ఓ సలహా ఇచ్చారు. ‘నీ దగ్గర నైపుణ్యం ఉంది. కాకినాడలో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సెలక్షన్స్‌కు వెళ్లు’ అని సూచించారు. ఆ సెలక్షన్స్‌కు వెళ్లిన అయ్యప్ప... ఏసీఏ బృందాన్ని ఆకట్టుకున్నాడు. అంతే... ఆంధ్ర అండర్-16 జట్టులో చోటు దక్కింది.
ఏసీఏ సాయంతో...
అప్పటి నుంచి ఏసీఏ సహకారంతో అయ్యప్ప అంచెలంచెలుగా ఎదిగాడు. ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునే స్థాయికి ఎదగకపోయినా... ఏసీఏ ఖర్చులకు ఇచ్చే డబ్బులు, స్కాలర్‌షిప్‌లతో క్రికెట్‌ను కొనసాగించాడు. క్రికెట్ ఆడటానికి బాగుంటుందని విశాఖపట్నంలో డిగ్రీలో చేరాడు. అయితే 2011లో అయ్యప్ప కుటుంబానికి షాక్ తగిలింది. సత్యనారాయణ ఓ ప్రమాదం కారణంగా ఆరోగ్యం దె బ్బతిని మరణించారు. ఆ తర్వాత కొద్దినెలలకే ఆంధ్ర రంజీ జట్టులోకి అయ్యప్ప ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. 2013లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. గత ఏడాది మూడు మ్యాచ్‌లలో అవకాశం వచ్చింది. ఆరు వికెట్లు మాత్రమే వచ్చాయి. అయినా ఆంధ్ర సెలక్టర్లు అయ్యప్ప నైపుణ్యంపై నమ్మకం ఉంచారు. ఈ ఏడాది కూడా జట్టులోకి తీసుకున్నారు. తొలి మ్యాచ్‌లోనే ముంబైలాంటి పటిష్టమైన జట్టుపై ఆరు వికెట్లతో చెలరేగాడు. తీవ్ర ఒత్తిడిలో ఆధిక్యం చేజారిపోతుందనే సందేహం ఉన్న సమయంలో తన నైపుణ్యంతో ఆంధ్రను ఆదుకున్నాడు.
పరిణతి పెరిగింది
నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అయ్యప్ప బౌలింగ్ బాగా మెరుగుపడింది. ‘గత ఏడాది ఒత్తిడిలో ఆడాను. కానీ ఈసారి సీజన్‌కు ముందే సన్నద్ధమయ్యాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో మరింత కష్టపడ్డాను’ అని అయ్యప్ప చెప్పాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఎదురుకావడం అతనిలో ఏ మాత్రం ఆందోళన పెంచలేదు. ‘ఎదురుగా ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్ ఉన్నా నాకు అనవసరం. నా బంతి గుడ్ లెంగ్త్ ఏరియాలో పడాలి. అనుకున్న ప్రణాళిక ప్రకారం బంతులు వేయాలి’ అంటూ తన ప్రణాళికలను వెల్లడించాడు. ముంబైతో మ్యాచ్‌లో తను బౌన్సర్లు వేసిన విధానం చూస్తే... తొందరలోనే ఆంధ్ర నుంచి మరో క్రికెటర్ భారత్‌కు ఆడతాడనే నమ్మకం వచ్చింది. వేచి చూద్దాం... ఆ కలను అయ్యప్ప సాకారం చేసుకుంటాడేమో..! -సాక్షి క్రీడావిభాగం