న్యూఢిల్లీ: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్ చేజారినప్పటికీ కివీస్ కెప్టెన్ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ‍్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్ టైటిల్ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.
‘బౌండరీ’ నిబంధనతో ప్రపంచకప్ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయినా విలియమ్సన్ ఒక్క మాట కూడా తూలకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. పీడకల కన్నట్లుగా అనిపించిందని, ఈ తరహాలో పరాజయం పాలవుతామని ఊహించలేదని అన్నాడే తప్పా ఆగ్రహించలేదు. బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నామని నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అద్భుతంగా జరిగిందని, అందరూ దానిని బాగా ఆస్వాదించారని పేర్కొన్నాడు. ఫలితం తమకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఎవరిపైనా విమర్శలు చేయకుండా హుందాగా ప్రవర్తించాడు.
Comments
Please login to add a commentAdd a comment